విరాట్ ఆధిపత్యం కొనసాగుతుందా?

విరాట్ మరోసారి రెచ్చిపోతాడా? మెల్ బోర్న్ సీన్ మరోసారి రిపీట్ చేస్తాడా? ఐసీసీ ఈవెంట్లలో పాక్ పై భారత్ కొనసాగిస్తున్న ఆధిపత్యం కొనసాగుతుందా?

Update: 2024-06-09 05:51 GMT

ఐసీసీ ఈవెంట్ అంటే ఎంత సందడి ఉండాలి. ముఖ్యంగా టీ20 క్రికెట్ అంటేనే జనాలు ఎగబడి చూస్తున్న రోజులివి. కానీ యూఎస్ఏ- వెస్టీండీస్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీకి ఏదో వెలితి కనిపిస్తోంది. బహూశా ఆదివారం నాడు జరిగే భారత్- పాకిస్తాన్ మ్యాచ్ తో అది తీరుతుంది కావచ్చు. ఈ మ్యాచ్ తో తిరిగి సందడి నెలకొంటుందని టోర్నీ నిర్వాహకులతో పాటు అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.

న్యూయార్క్ లోని నస్సా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. నేడు నిజంగా సూపర్ అండే.. ఈ పాత పోటీకి కొత్త స్టేడియం అతిథ్యం ఇవ్వబోతోంది. దాదాపు 34 వేలమంది సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన డ్రాప్ ఇన్ పిచ్ లను వాడుతున్నారు. అందుకే అందరి కళ్లు పిచ్ పైనే ఉన్నాయి. ఇవి ఇంకా కుదురుకున్నాయా లేదా అనే విషయంలో ఎవరూ ఏం చెప్పలేకపోతున్నారు.
భారత్ ఆధిపత్యం కొనసాగుతుందా?
ప్రపంచకప్ పోరు విషయానికి వస్తే, పాకిస్థాన్‌పై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రారంభ ఎడిషన్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మొట్టమొదటి T20 ప్రపంచ కప్ ఫైనల్ జరిగింది. భారత్ ఇప్పటి వరకూ గెలిచిన ఏకైక కప్పు అప్పుడే. అది కూడా చిరకాల ప్రత్యర్థి పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.
ఆ తరువాత టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌, పాకిస్థాన్‌లు ఏడుసార్లు తలపడగా, 'మెన్ ఇన్ బ్లూ' ఒక్కసారి మాత్రమే పాకిస్తాన్ చేతిలో ఓడింది. మిగితా అన్ని సందర్భా ల్లో పాక్ పై భారత్ స్పష్టంగా ఆధిపత్యం ప్రదర్శించింది.
చివరిగా రెండు దేశాల మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. పాక్ అంటేనే విరాట్ చెలరేగి ఆడుతుంటాడు. ఇప్పటి వరకూ దాయాదితో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లలో విరాట్ మూడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లను అందుకున్నాడు. దీనిని బట్టి కింగ్ కోహ్లి పాక్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
అలాగే, కోహ్లి పాక్ పై టీ20ల్లో 488 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. అలాగే అత్యధిక సిక్సర్లు (11) సాధించిన రికార్డును కూడా తన పేరు మీదనే లిఖించుకున్నాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 82 నాటౌట్‌గా విరాట్ పేరు మీదనే ఉంది.
మొత్తంమీద, T 20 లలో, భారత్ - పాకిస్తాన్ 12 సార్లు తలపడగా, భారత్ 9-3 ఆధిక్యాన్ని కలిగి ఉంది.
ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.
2007
గ్రూప్ దశ: భారత్ (141/9), పాకిస్థాన్ (141/7). కింగ్స్‌మీడ్, డర్బన్‌లో (సెప్టెంబర్ 14, 2007) మ్యాచ్ టై అవ్వగా భారత్ బౌల్ అవుట్‌లో గెలిచింది. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ నిలిచాడు.
ఫైనల్: జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో (సెప్టెంబర్ 24, 2007) భారత్ (157/5) పాకిస్థాన్ (152)పై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. కప్ భారత్ ఎగరేసుకుపోయింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఇర్ఫాన్ పఠాన్
2012
గ్రూప్ దశ: కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో (సెప్టెంబర్ 30, 2012) భారత్ (129/2) పాకిస్థాన్ (128)పై 18 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: విరాట్ కోహ్లీ (78 నాటౌట్ (61 బంతుల్లో) & 1/21)
2014
గ్రూప్ దశ: ఢాకాలోని మిర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్ (131/3) పాకిస్థాన్ (130/7)ని 9 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఓడించింది (మార్చి 21, 2014)
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: అమిత్ మిశ్రా
2016
గ్రూప్ స్టేజ్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ (119/4) పాకిస్థాన్ (118/5)పై 13 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది (మార్చి 19, 2016)
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: విరాట్ కోహ్లి (37 బంతుల్లో 55 నాటౌట్)
2021
గ్రూప్ దశ: దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (అక్టోబర్ 24, 2021)లో పాకిస్థాన్ (152/0) భారత్ (151/7)పై మరో 13 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: షాహీన్ షా ఆఫ్రిది (3/31)
2022
గ్రూప్ స్టేజ్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG), మెల్‌బోర్న్ (అక్టోబర్ 23, 2022)లో భారత్ (160/6) పాకిస్తాన్ (159/8)ని చివరి బంతికి విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 82 నాటౌట్)
అయితే 2009, 2010 T20 ప్రపంచ కప్ (వరల్డ్ ట్వంటీ 20) ఎడిషన్లలో, భారత్- పాకిస్తాన్ ఎక్కడ ముఖాముఖి ఎదురుకాలేదు.


Tags:    

Similar News