ఇండియా పొత్తులో కమ్యునిస్టుల వాటా ఎంత?

ఇండియా కూటమిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు కమ్యునిస్టులు ఎన్ని సీట్లు అడుగుతున్నారు. ఇప్పటికే ఒక సారి చర్చ పూర్తి అయింది.

Update: 2024-04-03 11:41 GMT

ఇండియా కూటమితో కలిసి కమ్యునిస్టులు ప్రయాణం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కాస్తా వేళ్లూనుకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల ఏపిసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కమ్యునిస్టులతో పాటు లౌకిక వాదుల శక్తులను కలుపుకొని అడుగులు ముందుకేస్తోంది. కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో కమ్యునిస్టులు కలిసి ముందుకు సాగుతున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలని కమ్యునిస్టులకు సంకేతాలందడంతో రెండు సందర్భాల్లో నేరుగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి షర్మిలతో కలిసి మాట్లాడారు. మూడు రోజుల క్రితం సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య నాయకులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ కాంగ్రెస్‌ నాయకురాలు షర్మిలతో పొత్తులపై చర్చలు జరిపారు.

కొలిక్కి రాని చర్చలు
ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే అంశంపైన కాంగ్రెస్‌ నుంచి సరైన క్లారిటీ రాలేదు. కాంగ్రెస్‌లో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థుల, ఆశావాహుల అభ్యర్థనలు కూడా ఎక్కువుగానే ఉన్నాయి. సుమారు 1,500 దరఖాస్తులు సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీకి వచ్చాయి. అన్నింటిని పరిలించిన తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత మంగళవారం 114 మంది అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ అభ్యర్థుల పేర్లను వైఎస్‌ షర్మిలా ప్రకటించారు. మిగిలన పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
5న తుది నిర్ణయం
కమ్యునిస్టులకు ఎన్ని సీట్లు ఖరారు చేయాలి అనే అంశంపై ఈ నెల 5న తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం సమావేశమై ఏయే నియోజక వర్గాల్లో పోటీ చేయాలో కూడా ఫైనల్‌ చేయనున్నారు. సీపీఐకి రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు పార్లమెంట్‌ స్థానాల్లో గుంటూరు నుంచి పోటీ చేసేందుకు సీపీఐ పట్టుపడటంతో ఆ సీటును సీపీఐకి కేటాయించారు. రెండో సీటు విశాఖపట్నం అడుగుతున్నారు. ఇంకా నిర్ణయం వెల్లడి కాలేదు. సీపీఎం 10 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్‌ సీట్లు కోరినట్లు తెలిసింది. అయితే వీరికి ఒక పార్లమెంట్‌ కర్నూలును కేటాయించే అవకాశం ఉంది. అరకు స్థానాన్ని కూడా కోరుతున్నట్లు తెలిసింది.
Tags: