ఏపీ లోని ఈ మూడు మునిసిపాలిటీల్లో ఎన్నికలు ఎందుకు ఆగాయి

Update: 2025-02-13 11:29 GMT

రాష్టంలోని 12 మునిసిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులకు ఎన్నికలు ఈనెల 3,4 తేదీల్లో నిర్వహించారు. స్టేట్ ఎన్నికల కమిషన్ 9 మునిసిపాలిటీల్లో ఎన్నికలు రెండు రోజుల్లో పూర్తి చేసింది. 3వ తేదీన ఏడు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగగా, రెండు మునిసిపాలిటీలకు 4న జరిగాయి. మరో మూడు మునిసిపాలిటీల్లో వాయిదా పడ్డాయి. సరిగ్గా 13వ రోజు అంటే ఈనెల 17న సోమవారం ఆగిపోయిన మూడు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరిగేందుకు గురువారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ మూడు చోట్ల ఎన్నికలు ఎందుకు ఆగాయి

ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కాకినాడ జిల్లా తుని మునిసిపాలిటీల్లో వైఎస్సార్ సీపీ కే మెజారిటీ ఉంది. అయితే ఈ మునిసిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది. మునిసిపాలిటీల్లో జరిగే ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి. మునిసిపాలిటీల్లో కొన్ని చోట్ల చైర్మన్లు, మరికొన్ని చోట్ల వైఎస్ చైర్మన్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. కార్పొరేషన్ లలో కొన్ని చోట్ల మేయర్లు, కొన్ని కార్పొరేషన్ లలో డిప్యూటీ మేయర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. దాంతో ఎన్నికల సంఘం ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం మిత్ర పక్షాలు ఎలాగైనా ఈ మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో వాయిదా పడ్డాయి.

ఇటీవల గెలిచిన వన్నీ గతంలో తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉన్నవే కావడం విశేషం. తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ చేసిన హడావుడి, వైఎస్సార్సీసీ వారిని తమ వైపు తిప్పుకోవడంలో సామ, దాన, బేధ దండోపాయాలు తెలుగుదేశం పార్టీ ఉపయోగించిది. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. అయినా జరిగిపోయాయి. ఇలా ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ వారే విజయం సాధించారు. అంటే వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ వెళ్లారు.

పాలకొండ పరిస్థితి ఏమిటి?

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీలో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఈ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇందులో 17 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా 3 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో గెలుపొందింది. ఇక్కడ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన యందవ రాధాకుమారి ఇటీవలి వరకు ఉన్నారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన చనిపోవడంతో రాధాకుమారికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె మునిసిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ చైర్మన్ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈ మునిసిపాలిటీ చైర్మన్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. రెండో వార్డు నుంచి గెలిచిన ఆకుల మల్లీశ్వరి ఒక్కరు మాత్రమే ఎస్సీ మహిళగా ఉన్నారు. దీంతో ఆమె మాత్రమే ఎన్నికలో పోటీ చేసేందుకు అర్హురాలు.

ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీలో ఉన్న మల్లీశ్వరి ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈమె ఎన్నికలో పోటీ చేయాలంటే వైఎస్సార్సీపీ బీఫారం ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీలో చేరినా బి ఫారం ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. అయితే ఈమె తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల వైఎస్సార్సీపీ బీ ఫారంపై పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎన్నికల అధికారికి ఆమె చెప్పారు. అందుకు నిబంధనలు అంగీకరించవని ఎన్నికల అధికారి ఆమెకు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ తరపున గెలిచారు కాబట్టి ఆ పార్టీ తరపున మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నిక ఆగిపోయింది. ఆమె కాకుండా పోటీ చేసే అర్హత వేరే వారికి లేకపోవడంతో వచ్చే 17వ తేదీన జరిగే ఎన్నిక కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే అక్కడ ప్రత్యేకాధికారి పాలన విధించే అవకాశం ఉంది.

పిడుగురాళ్ల మునిసిపాలిటీలో విచిత్ర పరిస్థితి

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మునిసిపాలిటీలో 33 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లోనూ గతంలో వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి చనిపోయారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 33 మందిలో ఒకరు చనిపోతే 32 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు తెలుగుదేశం పార్టీ వారికి తగిన బలం లేదు. దీంతో వారు వైఎస్సార్సీపీ వారిని మునిసిపల్ హాలులోకి రాకుండా అడ్డుకుంటున్నారు. రేపాళ్ల రమాదేవి వైఎస్ చైర్మన్ పోస్టుకు పోటీ చేస్తోంది. ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించిన ఎన్నికల్లో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే తమను కౌన్సిల్ హాలులోకి రాకుండా తెలుగుదేశం పార్టీ వారు అడ్డుకున్నారని, పోలీసులు రాకపోవడంతో లోపలికి పోలేక పోయామని వైఎస్సార్సీపీ వారు చెబుతున్నారు. ఈనెల 17న తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఆ రోజైనా ఎన్నిక జరుగుతుందా? లేక ఇలాగే వాయిదా పడుతుందా? అనేది వేచి చూడాలస్సిందే.

తునిలో 17న ఏమి జరుగుతుందో..

కాకినాడ జిల్లా తుని మునిసాపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులు వైఎస్సార్ సీపీకి రాగా, తెలుగుదేశం పార్టీకి 6 వార్డులు వచ్చాయి. దీంతో వైఎస్సార్సీపీ అక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం మునిసిపల్ కమిషనరుగా సుధారాణి ఉన్నారు. వైస్ చైర్మన్ పోస్టుకు ఇక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తేనే లోపలికి వెళ్లాలని, లేదంటే గేటు బయటే ఉండాలని తెలుగుదేశం పార్టీ వారు పట్టుబట్టారు. పలువురు కార్యకర్తలు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ వైఎస్సార్ సీపీ వారు కూడా తమను కౌన్సిల్ హాలులోకి సెక్యూరిటీతో తీసుకు పోవాలని గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈనెల 3,4 తేదీలో ఇదే తంతు జరిగింది. ఈనెల 17న ఇక్కడ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికైనా సజావుగా జరుగుతుందా? లేక గతంలో మాదిరిగానే గొడవలు జరుగుతాయా? అనే సందేహాలు పలువురిలో ఉన్నాయి. పోలీస్ బందోబస్త్ పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇంతకూ ఇక్కడ ఎన్నిక జరుగుతుందా? ఆగిపోతుందా అనేది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News