
భూమికి యూరియా భుక్కిస్తున్న తెలంగాణ రైతులు....
పది ఎకరాలకు చల్లాల్సింది.. ఎకరంలో పోస్తున్నారా? సిఫార్సులకు మించి యూరియా వాడకం, నిస్సారం అవుతున్న భూములు
ఈ మధ్య తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత తలెత్తింది. ఏ జిల్లాలో చూసిన రైతులంతా యూరియా కోసం బారులు తీరిన వార్తలే. కొన్నిచోట్ల చెప్పులు క్యూలో పెట్టడం, కొన్నిచోట్ల ఉదయం నాలుగు గంటల నుంచే ఫర్టిలైజర్ షాపుల వద్ద పట్టాభూమి పాస్ పుస్తకాలు పెట్టడం, పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ వార్తలు, వీడియోలే ట్రెండింగ్ లో ఉన్నాయి.
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డిలో రైతుల మధ్య ఘర్షణ జరిగింది. తరువాత తమ మధ్య ఘర్షణకు కారణం వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరే అని భావించి అన్నదాతలు రైతు వేదికవేదిక మీదికి ఉరికి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకురావడం, బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో ఎరువులు తీసుకోకపోతే బస్తాలు రద్దు చేస్తామని ప్రకటించడం మరింత గందరగోళానికి దారితీసింది.
సరైన సమయంలో యూరియా చల్లకపోతే పంట సరిగా పండదని రైతులు గగ్గోలు పెట్టడం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కనిపించింది. అయితే తెలంగాణలో రైతులు పరిమితికి మించి యూరియా చల్లుతున్నారని తాజాగా కొన్ని సర్వేల్లో తేలింది. భూమి వద్దనదులే అని అతిగా యూరియా తినిపిస్తే, బంగారు పంటరావడం బంగారు లాంటి భూమి నాశనమవుతుందని ఈ సర్వేలు చెబుతున్నాయి. అసలు యూరియా ఎంత వాడాలి? దాని ప్రాధాన్యం ఏమిటీ? ఇది వివరంగా తెలుసుకుందాం.
యూరియా అంటే ఏమిటీ?
పంట ఎదగడానికి నత్రజని లోపం తలెత్తకుండా యూరియాను రైతులు వాడుతుంటారు. ఈ యూరియాను వివిధ దశలలో వాడాల్సి ఉంటుంది. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం పంట వేయడానికి ముందు భూసార పరీక్షలు చేశాక వారి దాని ఫలితాలను అనుసరించి యూరియా(నత్రజని) ని వాడాల్సి ఉంటుంది.
కానీ సాధారణంగా రైతులు వరి పంటకు నాట్లు వేసిన రోజు కాంప్లెక్స్ ఎరువులు అయిన డీఏపీ లేదా 20-20-0-13 లో యూరియాను కలిపి చల్లుతుంటారు. ఇప్పుడు అయితే కాంప్లెక్స్ ఎరువు అయిన డీఏపీలో 18 శాతం యూరియా(నత్రజని) కలిసి ఉంటుంది. అయినప్పటికి రైతులు అవగాహన లేమితో యూరియాను యధేచ్ఛగా వినియోగిస్తున్నారు.
ఎకరానికి ఎంత యూరియా వాడాలి.
ప్రతి ఎకరానికి కేవలం 46 నుంచి 48 కిలోల యూరియాను మాత్రమే వాడితే సరిపోతుందని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (AEO) చెప్పారు.
‘‘ మీరు ఎన్నిసార్లు చల్లుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సిఫార్సులకు అనుగుణంగా రసాయన ఎరువులు వాడుకోవాలి. అంతకుమించి వాడితే ఏం ఉపయోగం ఉండదు. నేను చెప్పింది వరి పంటకు మాత్రమే. మిరపకు అయితే అది దాదాపు 60 నుంచి 70 కిలోల వరకూ వాడుకోవాల్సి ఉంటుంది’’ అని పేరు రాసేందుకు ఇష్టపడిన ఆ అధికారి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ సాగవుతున్న వరి పంటకు మొదటి 20 రోజుల వరకూ కాంప్లెక్స్ ఎరువులు చల్లుకుంటే యూరియా వాడకం అవసరం లేదని పొట్ట దశకు ముందు 36 కిలోలు ఒకసారి చల్లుకుంటే సరిపోతుంది. రెండోసారి మరో 18 నుంచి 20 కిలోలు చల్లుకోవాలి. పంటకు కావాల్సినంత నత్రజని ఈ రెండు విడతలుగా చల్లుకుంటే సరిపోతుందని ఆయన చెప్పారు.
రైతులు ఏం చేస్తున్నారు?
వరి పంటకు రెండు విడతలుగా వాడాల్సిన యూరియాను రైతులు ఏకంగా నాలుగు నుంచి ఆరు సార్లు చల్లుతున్నారు. సాధారణంగా ఒక యూరియా బస్తాలో 46 శాతం యూరియా ఉంటుంది. ఇందులో కాబట్టి రెండు బస్తాలు చల్లుకుంటే సరిపోతుంది.
‘‘మేమే గత ఏడాది రెండు ఎకరాల వరి సాగుకు నాలుగు నుంచి ఆరు సార్లు యూరియా వాడాము. మొదటి సారి డీఏపీతో కలిపి రెండు ఎకరాలకు ఒక బస్తా వాడాము. తరువాత నాలుగుసార్లు యూరియా మాత్రమే వాడాము’’ అని వీరాస్వామి అనే రైతు ‘ది ఫెడరల్’ కు చెప్పారు.
డీఏపీ ఒక్క బస్తాకు రూ. 1400 అని, అదే యూరియా బస్తాకు ఒక్కటికి 300 లోపే వస్తుందని చెప్పారు. తక్కువ రేటు కారణంగానే యూరియాను రైతులు అధికంగా వాడుతున్నట్లు తెలుస్తోంది.
‘‘యూరియా చల్లిన ఒక్కరోజులోనే పంట చేలు పచ్చగా మారుతుంది. ఇదే మాకు పంట బాగా వస్తుందని నమ్మకం కలుగుతోంది.’’ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎకరానికి మొదట్లో డీఏపీతో పాటు యూరియా బస్తాలు, వీటికి తోడు నానో యూరియా కూడా పోసి మరీ వాడుతున్నారు. మధ్యలో 50 కిలోల పొటాష్ బస్తాకు కూడా నానో యూరియాతో పాటు 50 కిలోల యూరియాను ఎకరానికి చల్లుతున్నారు.
మొక్కజొన్న, పత్తి పంటకు కాస్త తక్కువ మోతాదులో యూరియా వాడకం ఉంది. మొక్కజోన్న విత్తిన తరువాత 20 రోజులకు యూరియాను ఎకరానికి 50 కిలోల బస్తాను వాడుతున్నారు. అదే విధంగా మొక్కజొన్న తలపువ్వు దశలోనూ ఒకసారి వాడుతున్నారు. పల్లి పంట(వేరుసెనగ)కు కూడా ఇదే విధంగా, ఇంతే మోతాదులో యూరియాను వాడుతున్నారు.
అధికంగా వాడితే ఏమవుతుంది?
యూరియాను అధికంగా వాడితే భూసారం కోల్పోవడంతో పాటు పంట సహజ రోగ నిరోధక శక్తిని కోల్పోతుంది. భూమిలోని సహజ లవణాలను మొక్కలు పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది.
అంతేకాకుండా తెగళ్లు బెడద అధికంగా ఉంటుంది. సారవంతమైన భూములు మెల్లమెల్లగా ఉప్పు భూములుగా మారే అవకాశం ఎక్కువ అవుతుంది. నేలలో పోషకాలు అందించే వానపాములు కూడా జీవించలేకుండా పోతుంది. నీటి నిల్వ సామర్థ్యం కూడా క్రమంగా అడుగంటుతుంది.
యూరియా ఎక్కువ చల్లిన భూమిలో తిన్న పంటను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెదడు సరిగా ఎదగక మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువ.
సీజీడబ్ల్యూబీ కొన్ని ప్రాంతాలలో నీటి నమూనాలను పరీక్షించగా తాగునీటిలో యూరియా శాతం 45 మిల్లిగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. ఇవి తాగడానికి పనికిరావు.
అయినప్పటికి యూరియా వాడకం తెలుగు రాష్ట్రాలలో మోతాదుకు మించి వాడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. రైతులకు వెంటనే దీనిపై అవగాహన కల్పించకపోతే యూరియా దుష్పరిణామాలు సమాజం ఎదుర్కోవాల్సి వస్తుంది.
Next Story

