విశ్వవిద్యాలయాల్లో వర్ధిల్లున్న ‘అనాగరికత’
x

విశ్వవిద్యాలయాల్లో వర్ధిల్లున్న ‘అనాగరికత’

మత ఛాందసవాదం, కులాధిపత్యం, లింగ బేధం, ప్రాంతీయాభిమానం భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ పాటించడం శోచనీయం.

మనిషి వివేకవంతుడు, వివేచనాపరుడు. తన మేథో సంపత్తితో ఆకాశానికి నిచ్చెనలు వేయగలడు, గ్రహగతిని తెలుసుకొని రాకెట్లతో ఉప గ్రహాలను సృష్టించగలడు, లేకపోతే విధ్వంసానికి రంకెలెయ్యగలడు.

జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) 2020 మన దేశ ప్రాచీన విద్యావిధానాన్ని శ్లాఘించింది. ఆనాటి నలందా, తక్షశిల, విక్రమశిల, వల్లభి వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ నలుమూలల నుండి వేల సంఖ్యల్లో విద్యార్థులను ఆకర్షించి జ్ఞాన భాంఢాగారాలుగా పేరుగాంచి విజ్ఞాన వెలుగులు విరజిమ్మాయి. కానీ ప్రపంచమే ఒక కుగ్రామమై ప్రపంచీకరణ యుగం నుండి కృత్రిమ మేధ దిశగా వడివడిగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో కూడా మత ఛాందసవాదం, కులాధిపత్యం, లింగ బేధం, ప్రాంతీయాభిమానం వంటి కొన్ని కాలం చెల్లిన సామాజిక కట్టుబాట్లను భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ పాటించడం శోచనీయం. వీటికి కొంతమంది ఆచార్యులు మద్దతివ్వడం, అక్కడ కుల సంఘాలు పాతుకపోవడం చూస్తాము. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో వివక్షను ఉక్కుపాదంతో అణిచివేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గత నెలలో యూ‌జి‌సి సమానత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది.

‘దేశమంటే మట్టి కాదోయ్-దేశమంటే మనుషులోయ్’ అని చాటి చెప్పిన గురజాడ అప్పారావు మాటలు దేశ అభివృద్ధికి మానవ వనరులే కీలకం తెలియజేస్తున్నాయి. మన నేలలో జ్ఞానోదయం పొందిన గౌతమ బుద్ధుని బోధనలు తూచా తప్పకుండా పాటించి జపాన్ అజేయ దేశంగా నిలిచింది. మహాత్మా గాంధీ పాటించిన అహింసా మార్గాన్ని ప్రేరణగా తీసుకొని జూనియర్ మార్టిన్ లూథర్ అమెరికాలో జాతి వివక్షతపై పోరాటం చేశారు.
వేదాల సారం, ద్వైతాద్వైత సిద్ధాంతాలు, ఇతిహాసాల్లోని విలువలు, పురాణాల్లోని తత్వం, గీతా సారాంశం, పంచతంత్ర నీతి కథల్లోని లౌక్యం, వివేకానందుడు యువతకిచ్చిన సందేశాలు, వేమన పద్యాల్లోని సమాజ పోకడలు, దేశాన్నేలిన గొప్ప రాజుల చరిత్రలు, ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిదాయక పోరాట గాథలే మన భారతీయుల వారసత్వ సంపద. వీటినన్నింటినీ చిన్నప్పటినుండి పుస్తకాల్లో చదివిన యువత, వారి నుండి ప్రేరణ పొంది ఉన్నత విద్యనభ్యసించి ప్రయోజకువ్వాలని కలలు కంటారు. తమకు నచ్చిన ఉద్యోగం చేయాలని, సమాజంలో గౌరవం దక్కాలని, ఆత్మ గౌరవంతో బతకాలనే ఒక లక్ష్యం పెట్టుకొని కష్టపడి చదువుతారు. కానీ విశ్వవిద్యాలయాల్లో గుప్పెడు మంది విద్యార్థులు భవిష్యత్తులో నాయకుడు అయ్యేందుకు రోజూ ఏదో ఒక అలజడి సృష్టిస్తూ, అనవసర రాజకీయాలు చేస్తూ, మిగతా విద్యార్థులను రెచ్చగొడుతున్నారు.
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష కారణంగా 2016 లో రోహిత్ వేముల, 2019 లో పాయల్ తాడ్వి లు ఆత్మహత్య చేసుకున్నారు. శోక సంద్రంలోనున్న వారి తల్లులు ఈ రకమైన వివక్షలను అరికట్టి తద్వారా భవిష్యత్తులో ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని 2019 లో సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాజ్యం (ప్రప్రజా) వేశారు.
2019 నుండి ఆ ప్రప్రజా పై తీర్పు వెలువరించే సమయానికి అంటే 2025 వరకు ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష ఆధారిత ఫిర్యాదులు దాదాపు 118 శాతం పెరిగినట్టు సుప్రీం కోర్టు గుర్తించింది. అంతేకాకుండా యూ‌జి‌సి వివక్షను కట్టడి చేసేందుకు 2012 లో అమల్లోకి వచ్చిన నిబంధనలు నామమాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. అందుకే మరింత పకడ్బంధీగా ఈ నియమాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నేపథ్యంలో యూ‌జి‌సి ‘ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ పెంపుదలకు నిబంధనలు-2026’ అనే పేరుతో గత నెలలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
వీటి ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం, వైకల్యం ఆధారంగా వివక్ష చూపరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు కుల వివక్షకు గురికాకుండా సామాజిక రక్షణ కల్పించి, సమానత్వానికి నాంది పలికే కఠిన నియమాలన్నమాట. అయితే ఈ మార్గదర్శకాలు జనరల్ కేటగిరీ (అగ్ర కులాల) విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఇంతకుముందు ఈ నిబంధనలు ఎస్‌సి, ఎస్‌టి విద్యార్టులకు మాత్రమే వర్తించేవిధంగా ఉండగా, ఇప్పుడు తీసుకొచ్చిన నియమాల ప్రకారం ఓ‌బి‌సి వర్గాన్ని కూడా చేర్చారు. అంటే అగ్ర కులాలకు చెందిన విద్యార్థులపై, మిగతా ఏ కులానికి చెందిన విద్యార్థైనా అకారణంగా ఆరోపణలు చేసి, ఈ నిబంధనలను దుర్వినియోగపరిచే అవకాశముందనే ఆందోళన వ్యక్తమైంది. ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షాధారిత ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించే కమిటీలో జనరల్ కేటగిరీ సభ్యులు లేకపోవడం వల్ల విచారణ ఏకపక్షంగా జరుతుందనేది మరో వాదన. అందువల్ల ఈ మార్గదర్శకాలను వెనక్కుతీసుకోవాలని కొందరు వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు కొత్త మార్గదర్శకాల అమలుపై తాత్కాలికంగా నిలుపుదల (స్టే) విధించి వాటి సమీక్షకు న్యాయకోవిదులు, నిపుణులతో కూడిన కమిటీ వేసింది. అంతవరకు 2012 లోని సమానత్వ నియమాలే అమల్లో ఉంటాయని పేర్కొంది.
అసలు ఉన్నత విద్యాసంస్థ ప్రాంగణాల్లో కుల వివక్ష రాజ్యమేలకుంటే, యూ‌జి‌సి కొత్త నిబంధనలు దుర్వినియోగమవుతాయనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. ఈ కొత్త మార్గదర్శకాలకు కొన్ని సవరణలు చేస్తే అందరి భయాలు తొలిగిపోయి సమానత్వం పెంపొందుతుంది. దానిలో భాగంగా మొదటగా వివక్ష అంటే ఏమిటో స్పష్టంగా వివరణ ఇవ్వాలి. ఉన్నత విద్యా సంస్థలోని ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీ అధ్యాపకులు/ఆచార్యులను కూడా సభ్యులుగా చేర్చితే నిష్పక్షపాత విచారణ సాధ్యమవుతుంది.
ఇంకా ర్యాగింగ్, ప్రాంతీయతత్వాలను కూడా వివక్ష లిస్టులో చేర్చితే బాగుంటుంది. సామాజిక, సాంస్కృతిక అంశాల ఆధారంగా విద్యార్టులకు ప్రత్యేక హాస్టల్లను ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారం కానే కాదు. కావున మనుషులంతా సమానమని బోధించే సరస్వతీ ఒడిలోనే వివక్ష చూపిస్తే విద్యకు అర్థమే లేకుండా పోతుంది. ఎవరికి వారుగా ఆత్మ పరిశీలన చేసుకొని, తనకు తానుగా ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన వివక్ష చూపనని ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేసుకుంటే ఈ నియమాల అవసరం ఏముంటుంది. బడుగు-బలహీన వర్గాల కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థులకు ప్రేమ, మనోధైర్యం, నైతిక బలాన్నిచ్చే విధంగా తోటి విద్యార్థులు, బోధనా సిబ్బంది మెలగాలి. సంపన్న దేశాలు, సంతోషదాయక దేశాలు జాతి వివక్షను జయించి అన్ని రంగాల్లో అద్భుతాలు చేస్తుంటే, మనం మాత్రం ఇంకా కుల గోడలనే గొడవల్లోనే మగ్గిపోతున్నాము. మరోవైపు పితృస్వామ్య భావనను, మతఛాందస వాదాన్ని తలకెక్కించుకున్న దేశాల్లో జరిగే అల్లకల్లోలాలు, వాటి దయనీయ పరిస్థితినీ కళ్ళారా చూస్తున్నాం.
కాలం మారింది, మనమూ మారాలి. మానవ హక్కులను కాలరాసే కుసంస్కృతికి స్వస్తి పలకాలి. మనమిప్పుడు వీధి కుక్కలు, పశుపక్ష్యాదుల కోసం పోరాటాలు చేసేంత ఎత్తుకు ఎదిగాము. చెట్టూ పుట్టలు, కొండా కోనలు, వాగులూ వంకల కోసం పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు చేస్తున్నాము. అడవులను కాపాడడానికి, స్వచ్చమైన గాలి కోసం సోషల్ మీడియా వేదికగా గళమెత్తుతున్నాము. కానీ మన దేశంలోనే పుట్టిపెరిగిన సాటి విద్యార్థిని మనిషిగా చూడడంలో మాత్రం వెనకబడ్డాము. ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ళను మన మేథో సంపత్తితో పరిష్కరించి ఎల్లలెరుగని మానవత్వ పరిమళాలు గుభాళింపజేయాలి. వివక్షతకు చరమగీతం పాడి, జంబూద్వీప పుత్రుల పట్ల సోదరభావంతో త్రికరణశుద్దిగా మెలగడమే నిజమైన దేశభక్తి అనిపించుకుంటుంది. 2047 కల్లా వికసిత భారత్ సిద్దించాలంటే జావివి (ఎన్ఈపి) 2020 సూచించిన బాటలో నడవడంతోపాటుగా ‘సబ్కా సాత్-సబ్కా వికాస్’ మంత్రాన్ని జపించడమే కాదు, ఒంట పట్టించుకోవాలి. సామాజిక వివక్షత ఏ రూపంలో ఉన్నా వాటన్నింటిని పాతరవేసి అందరూ సమానమనే మానవత్వ భావంతో మెలుగుతూ లోకకళ్యాణానికి పాటుపడినప్పుడే మన దేశం ‘విశ్వ గురువు’ అవుతుంది.


Read More
Next Story