
ఇంటి ఆవరణలో పడగవిప్పిన నాగుపాము( ఫొటో కర్టసీ: ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ)
భవనాల మధ్య బుస కొడుతున్న పాములు, హైదరాబాద్‌లో హైఅలెర్ట్
హైదరాబాద్‌లో ఎందుకు పెరుగుతున్నాయి పాములు? భయపెడుతున్న తాజా గణాంకాలు
కాంక్రీట్ నిర్మాణాలతో ఉన్న హైదరాబాద్ మహానగరం ఇప్పుడు పాముల సంచారానికి కూడా కేంద్రంగా మారుతోంది. నగర విస్తరణ, భారీ భవన నిర్మాణాలతో పాముల సహజ ఆవాసాలు నశించడంతో అవి జనవాసాల వైపు వస్తున్నాయి. ఈ క్రమంలో 2025వ సంవత్సరంలో ఒక్క హైదరాబాద్‌లోనే 15 వేలకుపైగా పాములను రెస్క్యూ చేసి అడవుల్లో వదిలినట్లు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ గణాంకాలు వెల్లడించాయి.
ఇంటి వాకిలి వద్ద నాగుపాము… బాత్‌రూంలో కొండచిలువ… హైదరాబాద్‌లో ఇవి ఇక అరుదైన దృశ్యాలు కావు. నగరంలో పాముల సంచారం రోజురోజుకు పెరుగుతుండటంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి ప్రతిరోజూ వందకు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నగర విస్తరణే ఈ అనూహ్య పరిస్థితికి మూలకారణంగా మారింది.
ఇదీ నగర పరిస్థితి
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ పాముల సంచారం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. చెట్లు, పుట్టలు, గుట్టలు మాయమవుతూ వాటి స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా మారింది. 2013లో రెండు వేల లోపే ఉన్న పాముల రెస్క్యూలు 2025 నాటికి 15 వేలు దాటడం ఈ సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్...పాముల సంచారానికి నిలయం
హైదరాబాద్ నగరం పాముల సంచారానికి నిలయంగా మారుతుందా? అంటే అవునంటోంది... తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల విభాగం,ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ. కాలగమనంలో కలిసి పోయిన 2025 వ సంవత్సరంలో హైదరాబాద్ మహా నగరంలో రికార్డు స్థాయిలో నాగుపాములు, కొండచిలువలతోపాటు వివిధ రకాల పాములను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు పట్టుకున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి.2025వ సంవత్సరంలో నగరంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు 15వేలకు పైగా పాములను పట్టుకొని తెలంగాణ అభయారణ్యాల్లో వదిలి వేసినట్లు తేలింది.
భవన నిర్మాణాలతో దెబ్బతింటున్న పాముల ఆవాసాలు
హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో భవన నిర్మాణాలు పెరిగాయి. దీంతో పాముల నివాస ప్రాంతాలు చెట్లు, పుట్టలు, గుట్టల్లో అభివృద్ధి పేరిట భారీ భవన నిర్మాణాలు చేపడతుండటంతో పాముల ఆవాసాలు దెబ్బతిని అవి బయటకు వస్తున్నాయి.నగర విస్తరణతో పాముల సంచారం వెలుగుచూసింది. దీనికి తోడు గతంలో పాము కనిపిస్తే చాలు ప్రజలు దాన్ని కొట్టి చంపేవారు.కానీ పాముల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ప్రజలు పాము కనిపించగానే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లకు సమాచారం అందిస్తున్నారు. దీంతో వాలంటీర్లు హుటాహుటిన వచ్చి పాములను పట్టుకొని వాటిని పాముల సంరక్షణ కేంద్రానికి తరలించి, ప్రతీనెలా వాటిని అడవుల్లో వదిలివేస్తున్నారు.
పెరుగుతున్న పాము కాట్లు
హైదరాబాద్ నగరంలో పాముల సంచారం పెరగడంతోపాటు పాము కాటు ఘటనలు కూడా పెరిగాయి. పాముకు ముప్పు కలిగినపుడు లేదా దానికి గాయం చేసినపుడు అవి కాటు వేస్తుంటాయి.పాము కాటు బాధితుల్లో ఎక్కవుగా 31 నుంచి 40 సంవత్సరాల వయసు వారు అధికంగా ఉన్నరని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్సు డేటా చెబుతోంది. రుతుపవనాలు వచ్చే జూన్ నెలలో అందులోనూ సాయంసంధ్య సమయంలో ఎక్కువగా పాముకాట్లు నమోదవుతున్నాయి. పాములు ఎక్కువగా పాదాలపై కాటు వేస్తున్నాయని, అందువల్ల నడిచేటపుడు జాగ్రత్తగా చూసుకోవాలని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లు చెబుతున్నారు.
ఏటేటా పెరుగుతున్న పాముల సంఖ్య
హైదరాబాద్ నగరంలో 2013వ సంవత్సరంలో 2,464 పాములను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు పట్టుకోగా, ఏటేటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2015వ సంవత్సరంలో 3,389 పాములను పట్టుకున్నారు. 2018వ సంవత్సరంలో 5,644 పాములను పట్టుకోగా 2020వ సంవత్సరం నాటికి పట్టుకున్న పాముల సంఖ్య 8,895 కు పెరిగింది. ఇలా ఏటేటా పట్టుకున్న పాముల సంఖ్యతో పాటు వీటి సంరక్షణ పెరుగుతూనే ఉంది. 2021వ సంవత్సరంలో 10,525 పాములను వాలంటీర్లు పట్టుకొని అటవీశాఖ అధికారుల అనుమతితో అడవుల్లో వదిలివేశారు. 2025వసంవత్సరంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్లు 15వేలకు పైగా పాములను పట్టుకున్నారంటే హైదరాబాద్ నగరంలో పాముల సంచారం 2013 నుంచి పోలిస్తే అనూహ్యంగా పెరిగిందని తాజా పాముల సంచారం గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కొత్త భవనాల నిర్మాణం, నగర విస్తరణ వల్ల పాముల సంచారం పెరిగిందని ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాము పట్టుకున్న పాముల సంఖ్య ఏటేటా పెరుగుతుందని ఆయన తెలిపారు. 2013వ సంవత్సరంలో తాము 2,464 పాములను పట్టుకోగా, 2025వ సంవత్సరంలో వీటి సంఖ్య 15వేలు దాటిందని ఆయన వివరించారు.
పాముల రెస్క్యూ
హైదరాబాద్ నగర విస్తరణతోపాటు అటవీ ప్రాంతాలు తగ్గిపోతుండటంతో మనుషులు- పాముల మధ్య సంఘర్ణణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాములకు ఆహారం దొరక్క అవి ఇళ్లు, ఫ్యాక్టరీలలోకి వస్తున్నాయి. ఇలా ఇళ్లలోకి వస్తున్న పాములను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ పట్టుకొని వాటిని అడవుల్లో వదిలివేస్తుంది. ఇళ్లు, జనవాసాల్లోకి వచ్చిన పాములను వాలంటీర్లు పట్టుకొని వాటిని రెస్క్యూ సెంటరుకు తరలిస్తామని, నెలరోజులకు ఒకసారి పాములన్నింటినీ అడవుల్లో వదిలివేస్తుంటామని వాలంటీర్ రాజు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పట్టుకున్న పాములను తాము అడవిలోకి వదిలేందుకు తాము అనుమతిస్తున్నామని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణుల విభాగం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పాములపై అవగాహన సదస్సులు
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ పాఠశాల విద్యార్థులు, ప్రజల కోసం పాములపై అవగాహన వర్క్ షాప్ లు నిర్వహిస్తోంది. వివిధ రకాల పాములను గుర్తించడం ఎలా? పాముల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, భద్రతా చర్యలు, పాములు, వన్యప్రాణులతో శాంతియుత సహజీవనంపై సొసైటీ వాలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు.
మీ ఇంట్లోకి పాము వచ్చిందా?
మీ ఇంట్లోకి పాము వచ్చిందా అయితే మాకు ఫోన్ కాల్ చేయండి అంటోంది హైదరాబాద్ నగరానికి చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ. సెల్ ఫోన్ నంబరు 83742 33366 నంబరుకు కాల్ చేసి, పాము కనిపించిన ఇంటి లొకేషన్ షేర్ చేస్తే చాలు క్షణాల్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాలంటీర్ మీ ముందు ప్రత్యక్షమై పామును పట్టుకొని, దాన్ని తీసుకువెళతారని సొసైటీ హెల్ప్ లైన్ ప్రతినిధి అజయ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ పాములు పట్టే సేవా సంస్థ 24 గంటలూ పనిచేస్తోంది.
రోజుకు వందకు పైగా ఫోన్ కాల్స్
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి ప్రతీరోజూ పాములు ఇళ్లలోకి వచ్చాయంటూ వందకు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ చెప్పారు. రెస్క్యూ కోఆర్డినేటర్లు పాములు వచ్చిన ప్రాంతాలకు సమీపంలో ఉన్న వాలంటీర్లను గుర్తించి వారిని వెంటనే రెస్క్యూ సైటుకు పంపిస్తుంటామని ఆయన వివరించారు. తమ సొసైటీ వాలంటీర్లకు పాముల రక్షణ, సురక్షితంగా పాములను పట్టుకోవడంలో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారిని రంగంలోకి దించుతున్నామని అవినాష్ చెప్పారు.
హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ పాముల సంచారం కూడా పెరుగుతుండటం ఆందోళనకరం. సహజ ఆవాసాల నాశనం, భవన నిర్మాణాల విస్తరణ వల్ల ఏర్పడుతున్న ఈ పరిస్థితిలో పాములను చంపడం కాదు, సంరక్షించడం, ప్రజల్లో అవగాహన పెంచడమే శాశ్వత పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మనుషులు–పాముల మధ్య సహజీవనమే హైదరాబాద్‌కు భద్రమైన భవిష్యత్తు అని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నగరంలో పాము కనిపిస్తే భయంతో దాడి చేయడం కంటే సంబంధిత అధికారులకు లేదా శిక్షణ పొందిన వాలంటీర్లకు సమాచారం ఇవ్వడమే సరైన మార్గం. పాములు మనకు శత్రువులు కాకుండా సహజ పర్యావరణంలో కీలక భాగమని గుర్తిస్తేనే ప్రమాదాలను తగ్గించగలం. హైదరాబాద్‌లో పెరుగుతున్న పాముల సంచారం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
Next Story

