రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కొత్త వ్యూహం
x

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కొత్త వ్యూహం

భారత నావికుల భద్రతే ముఖ్యమంటున్న ఢిల్లీ


Click the Play button to hear this message in audio format

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ప్రత్యక్ష మధ్యవర్తిగా వ్యవహరించకపోయినా, ఇరు దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకుని శాంతి ప్రయత్నాల్లో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా భారతీయ నౌకా సిబ్బంది భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణ, ఆహార ధాన్యాల సరఫరా వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ పరిమితమైన దౌత్య ప్రయత్నాల ద్వారా అంతర్జాతీయంగా మరోసారి విశ్వగురువు అనే గుర్తింపును బలోపేతం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.

2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా నిలబడాలని ఒత్తిడి చేసినప్పటికీ, భారత్ మాత్రం ఏ పక్షానా చేరలేదు. అదే సమయంలో రష్యా నుంచి రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేయడం కూడా పాశ్చాత్య దేశాల అసంతృప్తికి కారణమైంది.
అయితే అంతర్జాతీయ చమురు ధరలను స్థిరీకరించేందుకు భారత్ ఈ కొనుగోళ్లు చేయడానికి అప్పటి అమెరికా బైడెన్ ప్రభుత్వం అనుమతించిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తరువాత స్పష్టం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను భారత్ తీవ్రంగా ఖండించకపోవడం అమెరికా, ఐరోపా దేశాలకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
ఆ సమయంలో ప్రస్తుత కాలం యుద్ధాలకు సంబంధించినది కాదని మోదీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ తరువాత కూడా పుతిన్‌తో సమావేశమైన ప్రతిసారీ మోదీ ఇదే సందేశాన్ని పునరుద్ఘాటించారు.
అయితే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరేందుకు అనుకూల పరిస్థితులు లేవని భావించిన భారత్ ప్రత్యక్ష మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంది. కానీ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఆహారం, ఇంధన సరఫరాలపై ప్రభావం పెరగడం, అంతర్జాతీయంగా రాజకీయ విభజనలు తీవ్రమవడం వంటి పరిణామాలు భారత్ ఆలోచనల్లో మార్పునకు కారణమయ్యాయి.
ముఖ్యంగా 2025 జూలైలో నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగి భారతీయ నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం కీలక మలుపుగా మారింది. దీంతో ఈ యుద్ధం భారత్‌కు కేవలం అంతర్జాతీయ రాజకీయ సమస్య మాత్రమే కాకుండా, నేరుగా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా మారింది. అప్పటి నుంచి శాంతి కోసం సాధారణ విజ్ఞప్తులు చేయడం కంటే, ఆచరణాత్మక ప్రతిపాదనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని భారత్ గుర్తించింది.
ఈ క్రమంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పలుమార్లు చర్చలు జరపడంతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతోనూ సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అటు మాస్కోతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే, ఇటు కీవ్‌తోనూ దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై చర్చలకు భారత్‌కు అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య అబుదాబిలో శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో భారత్ భాగస్వామి కాదు. ఐరోపా కమిషన్, ఐరోపా మండలి ప్రతినిధులతో పాటు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ భద్రతా సలహాదారులు, నాటో ప్రధాన కార్యదర్శి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అక్కడ ఉన్నప్పటికీ, వారు కూడా ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనడం లేదు.
ఉక్రెయిన్ ప్రతినిధి బృందానికి సలహాలు, మార్గదర్శకత్వం అందించడానికే పరిమితమయ్యారు. ‘‘అమెరికా శాంతి మధ్యవర్తిగా రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న అబుదాబిలో భారత్ లేదు. భారత్ లక్ష్యం నిరాడంబరమైనది.
యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమైన మన నావికులను రక్షించడం, అలాగే గ్లోబల్ సౌత్ లోని దేశాలు ధాన్యం కొరతను అధిగమించడానికి సహాయపడేలా ఆహార కారిడార్ ను ఏర్పాటు చేయడానికి ఇరు పక్షాలను ఒప్పించడం భారత్ లక్ష్యం’’ అని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వర్ సిబల్ అన్నారు.
భారత్ మాత్రం తన ప్రయత్నాలను రెండు ప్రధాన అంశాల చుట్టూ కేంద్రీకరించింది. మొదటిది యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ నౌకా సిబ్బంది భద్రత. రెండోది వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకాలు లేకుండా చూడటం.
ప్రపంచంలో నౌకా సిబ్బంది సరఫరాలో ఫిలిప్పీన్స్ తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది. అలాంటి సమయంలో నౌకలపై దాడులు జరగడం భారత ప్రయోజనాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఘర్షణలు కూడా భారతీయులపై ప్రభావం చూపుతున్నాయి.
అందుకే ఇరు దేశాలు వాణిజ్య నౌకల రవాణా మార్గాలపై దాడులు చేయకుండా అంగీకరించేలా ఒప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
ఇక మరో ముఖ్యమైన అంశం ఆహార ధాన్యాల సరఫరా. రష్యా, ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో ఉన్నాయి. యుద్ధం కారణంగా సరఫరాలు నిలిచిపోతే ముఖ్యంగా ఆఫ్రికా వంటి ప్రాంతాల్లోని అభివృద్ధి చెందుతున్న దేశాల ఆహార భద్రత దెబ్బతింటుంది.
అందువల్ల నల్ల సముద్రంలో ధాన్య రవాణా కారిడార్‌ను పునరుద్ధరించేలా ఇరు దేశాలను ఒప్పించాలని భారత్ భావిస్తోంది. దీని ద్వారా గ్లోబల్ సౌత్ దేశాలకు ఆహార కొరత సమస్యను అధిగమించడంలో సహాయపడటంతో పాటు, ఆ దేశాలకు మద్దతుగా నిలిచే దేశంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
అదే సమయంలో ఐరోపా దేశాలకు కూడా భారత్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటోంది. ఉక్రెయిన్ భద్రత పట్ల భారత్‌కు ఆసక్తి ఉందని చాటిచెప్పడం ద్వారా, రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న పాశ్చాత్య దేశాల విమర్శలను తగ్గించాలని భావిస్తోంది. వచ్చే నెలలో ఖరారు కావాల్సిన భారత్–ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవడం కూడా ఈ ప్రయత్నాల వెనుక ఉన్న మరో లక్ష్యంగా కనిపిస్తోంది.
భారత్ పాత్ర పరిమితంగానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సంఘర్షణల పరిష్కారంలో నిర్మాణాత్మక సహకారం అందించగల దేశంగా తన గుర్తింపును తిరిగి పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తుది శాంతి ఒప్పందాన్ని కుదిర్చే సామర్థ్యం తనకు ఉందని భారత్ అతిగా ప్రచారం చేసుకోకూడదని మాజీ భారత రాయబారి అనిల్ వాధ్వా సూచించారు. రాజకీయ ఒప్పందానికి అనుకూల వాతావరణం కల్పించడం, ఇరు దేశాల మధ్య చర్చల మార్గాలను తెరిచి ఉంచడమే భారత్ ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తంగా చూస్తే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తన పాత తటస్థ వైఖరిని పూర్తిగా మార్చుకోకుండానే, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా మరింత చురుకైన దౌత్య ప్రయత్నాలు చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌తో సంబంధాలను కొనసాగిస్తూ అంతర్జాతీయ వాణిజ్యం, ఆహార భద్రత, నౌకా సిబ్బంది రక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది పక్కన పెడితే, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తనకంటూ ఒక స్వతంత్ర దౌత్య స్థానాన్ని కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు.


Read More
Next Story