తెలంగాణ బడ్జెట్ — ఓట్ల కోసమా? జీవితాల మార్పు కోసమా?
x
అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ బడ్జెట్ — ఓట్ల కోసమా? జీవితాల మార్పు కోసమా?

రైతు పొలంలో నిలబడినా, దళితుడు పక్కా ఇంటి కోసం వేచి ఉన్నా, యువకుడు ఉపాధి కోసం చూస్తున్నా, వారికి కావలసింది మాటలు కాదు, మార్పు. ఆ దిశలో బడ్జెట్ కూర్పు సాగిందా?


ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20, 2026న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత వరుసగా మూడవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ఒకేసారి రెండు కథలు చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధాన కథ ఏమిటంటే — రూ.3,24,234 కోట్ల వ్యయం, 10.7 శాతం వేగంతో వృద్ధి చెందుతున్న జీఎస్‌డీపీ, ఇది జాతీయ సగటు 8 శాతాన్ని మించింది; అంతేగాక రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరుకుంది — ఇది జాతీయ సంఖ్యకు దాదాపు రెట్టింపు. ఇది ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాన్ని సూచిస్తుంది.

రెండవ కథ మాత్రం గ్యారంటీ కేటాయింపులు, అప్పు సవాళ్ల గురించి వివరిస్తుంది తెరచి చుస్తే ఇక్కడే తెలంగాణ బడ్జెట్ ఓట్ల కోసమా? జీవితాల కోసమా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.
గ్యారంటీ గారడీ
ఆరు గ్యారంటీలు 2023 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారంలో కీలక హామీలుగా నిలిచాయి — ఆ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా కూడా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొదటిసారి అధికారంలో వచ్చింది అప్పుడే. రెండున్నర సంవత్సరాలు, మూడు బడ్జెట్ల తర్వాత ఆ హామీల రాజకీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి దారితీసింది.
2026-27 బడ్జెట్‌లో గ్యారంటీ పరిధిలోని పథకాల కోసం రూ.50,713 కోట్లు కేటాయించారు. మొదట చూస్తే పెద్ద మొత్తంగా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది అంత‌కుముందు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ తో పోలిస్తే త‌గ్గుద‌ల‌ అని చెప్పొచ్చు. గత సంవత్సరం కేటాయింపు రూ 56,084 కోట్లుగా ఉంది. ఉదాహరణకు ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఈ సంవత్సరం రూ.5,500 కోట్లు మాత్రమే కేటాయించారు, 2025-26లో రూ.12,571 కోట్లతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో రెండు లక్షల కొత్త లబ్ధిదారులను చేర్చినా, దాని కేటాయింపు రూ.14,861 కోట్లు, అంత‌కుముందు ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ తో పోలిస్తే, స్థిరంగానే ఉంది. యువత స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించారు — గత సంవత్సరంతో పోలిస్తే అదే మొత్తం, అయితే ప్రతిపక్షాలు మాత్రం గత సంవత్సరం ఎటువంటి నిధులు విడుదల కాలేదని వాదిస్తున్నాయి.
హామీల అమలులో జాప్యానికి, ప్రభుత్వం ఇచ్చిన వివరణ — ఆర్థిక ఇబ్బందులు, దశల వారి అమలు మొదలైనవి కొంత వరకు సబబుగానే కనిపిస్తాయి. విస్తృత స్థాయిలో సంక్షేమం అమలు చేయడం నిజంగానే కష్టమైన పని. రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.64,000 కోట్ల మార్కెట్ రుణాలను అంచనా వేసింది. కానీ రూ.83,000 కోట్లకు పైగా అప్పు తీసుకుంది. ఇది 30 శాతం అధికం, రాష్ట్ర ఆర్థిక చరిత్రలో అత్యంత పెద్ద మధ్యంతర పెరుగుదల్లో ఒకటి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఇప్పుడు రూ.73,383 కోట్ల రుణాలను అంచనా వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక లోటు రూ.58,458.71 కోట్లు. మొత్తం ప్రజా రుణం ఇప్పటికే సుమారు రూ.5.62 లక్షల కోట్లు, అంటే జీఎస్‌డీపీలో 29 శాతం. ఈ పరిస్థితిలో నియంత్రణ అవసరం అనే వాదనకు నిర్మాణాత్మ‌క ఆధారాలు ఉన్నాయి.
కానీ ఇక్కడ లోతైన సమస్య ఏమిటంటే, హామీలకు ఆర్థిక స్థిరత్వంకు ఎటువంటి పోలిక‌లు లేవు. అవి ఆరు నూరైనా నూరు ఆరైనా అమ‌లు చేస్తామ‌నే అనే అర్థంలో ఆరు గ్యారెంటీలు అమ‌లవుతాయి అనే అర్థంలో ఎన్నిక‌ల హామీల్లో పేర్కొన్నారు. మీకు ఇల్లు వస్తుంది. మీకు బీమా వస్తుంది. మీ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు వస్తాయి అనే చెప్పారు. బడ్జెట్లు ఈ హామీలను కోతల ద్వారా, దశలవారీ అమలు ద్వారా, లేదా నిశ్శబ్దంగా తగ్గించినప్పుడు, పౌరులకు తెలుసుకునే మార్గం లేదు. ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసిన పౌరురాలికి ఆలస్యం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల వల్లనా లేదా రాజకీయ వ్యవస్థ విఫలమైందా అనేది తెలుసుకోలేని పరిస్థితి. ఆమెకు ఒక్కటే తెలుసు, ఇంకా ఇల్లు రాలేదు అని.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఎందుకంటే తెలంగాణ ఓటర్లు, రైతులు, దళిత కుటుంబాలు, మహిళలు, పట్టణ పేదలు దాన్ని కోరుకున్నారు, అడిగారు. ఆర్థిక మంత్రి నిజంగానే ఆర్థిక పరిమితులు నిర్వహిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు కల్పితమైనవి కావు. మూలధన వ్యయం నిష్పత్తి తప్పుగా ఉందని తెలిసిన ప్రభుత్వ అధికారులు, సలహారులు దాన్ని బహిరంగంగా చెప్పే పరిస్థితులు లేవు. హామీలు పొందిన ఓటరు నిజంగా ప్రభుత్వం వాటిని నిలబెట్టుకోవాడిని ప్రయతిస్తుందా? లేక మబ్యబెడుతున్నారా అన్నదాన్ని గుర్తించలేకపోతున్నారు
ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు అటు పూర్తిగా మూలధన, మౌలిక పెట్టుబడులపై ద్రుష్టి సారించలేక, ఇటు మితిమీరిన సంక్షేమ పథ కాలకు కట్టుబడలేక, తాయిలాల విష వలయంలో నిరంతరంగా కొట్టుమిట్టాడుతున్నాయి
ఎక్కడ గుర్తింపు ఇవ్వాలి — ఎందుకు ఇవ్వాలి
ఈ బడ్జెట్ ఎమి చేయలేదని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. నిజానికి ఈ బడ్జెట్ ప్రశంచించ దగ్గ విషయాలు వున్నాయి. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా జూన్ 2026 నుండి 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల కవరేజీ ఇవ్వడం చిన్న విషయం కాదు. ఇది అమలైతే పేద కుటుంబాలకు వచ్చే ఆర్థిక నాశనాన్ని తగ్గిస్తుంది. రైతు భరోసా కేటాయింపును రూ 18,000 కోట్లకు పెంచడం, ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ 10,000 సహాయం అందించడం, వర్షపాతం త‌గ్గ‌డం వల్ల తీవ్ర ప్రభావం పడే తెలంగాణ‌లో రైతుల ఆదాయ అస్థిరతను నేరుగా పరిష్కరిస్తుంది.
సంక్షేమ విభజన కూడా ముఖ్యమైనది. ద‌ళితుల కోసం రూ 11,784 కోట్లు, గిరిజ‌నుల కోసం రూ 7,937 కోట్లు,వెన‌క‌బ‌డిన కులాల కోసం రూ 12,511 కోట్లు, మరియు మైనారిటీల కోసం రూ 3,769 కోట్లు కేటాయించడం కేవలం రాజకీయ కోణ‌మే కాదు, సమానత్వాన్ని ప్రజా వ్యయ నిర్మాణంలో స్థిరపరుస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు విస్తరించడం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ 1,000 కోట్లు, హాస్టల్ వంటగదుల ఆధునికీకరణకు రూ 100 కోట్లు కేటాయించడం, విద్యను దాతృత్వంగా కాకుండా మౌలిక వసతిగా చూసే సంకేతం.
ఇవి చిన్న విషయాలు కావు. ఇవి గుర్తింపుకు అర్హమైనవి. కానీ ప్రశ్నించకుండా గుర్తించడం కేవలం చప్పట్లు కొట్టడం మాత్రమే.
ఈ బడ్జెట్ సమాధానం ఇవ్వలేని ప్రశ్న. ఈ పద్ధతిలో రూపొందించబడిన ఏ బడ్జెట్ కూడా సమాధానం ఇవ్వలేనిది, తెలంగాణ 2035 లేదా 2047 నాటికి బలమైన రాష్ట్రంగా నిర్మితమవుతుందా? లేదా మరింత అప్పుల్లో మునిగి, బాధ్యతల్లో చిక్కుకుని, నిజమైన మార్పుకు దూరంగా, తక్కువ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా మిగులుతుందా?
ఆ ప్రశ్నకు సమాధానం కేటాయింపుల్లో లేదు. అది అమలు వ్యవస్థల్లో ఉంది, ఆర్థిక గమనంలో ఉంది, అభివృద్ధి మరియు సంక్షేమం పరస్పర శత్రువులు కాదని పౌరులకు చెప్పగల రాజకీయ ధైర్యంలో ఉంది.
బడ్జెట్ ఒక అద్దం లాంటిది. అందులో రాష్ట్రం తన భవిష్యత్తును చూసుకోవాలి, కానీ చూస్తున్నది మాత్రం గతం నీడను మాత్రమే. అప్పుల భారం పెరుగుతోంది, హామీలు అమలు తగ్గుతున్నాయి, అయినా రాజకీయ భాష మాత్రం మారడం లేదు. ఇది ప్రభుత్వం వైఫల్యం మాత్రమే కాదు. ఇది వ్యవస్థ వైఫల్యం.
నిజమైన మార్పు అంటే బడ్జెట్ పత్రంలో అంకెలు మారడం కాదు. పౌరులకు నిజం చెప్పగల ధైర్యం కలిగి ఉండటం. సంక్షేమం అంటే ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలు కాదు. అది నిరంతరం నిర్మించే వ్యవస్థ. రైతు పొలంలో నిలబడినా, దళిత కుటుంబం పక్కా ఇంటి కోసం వేచి ఉన్నా, పట్టణ యువకుడు ఉపాధి కోసం చూస్తున్నా. వారికి కావలసింది మాటలు కాదు, మార్పు.
తెలంగాణకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ప్రతి ఎన్నికల్లో కొత్త హామీలు ఇస్తూ, పాత హామీలు మరిచిపోతూ అప్పుల సుడిగుండంలో కొట్టుమిట్టాడటం. రెండోది, కష్టమైన నిజాలు చెప్పగల నాయకత్వంతో, దీర్ఘకాలిక ఆర్థిక పునాది నిర్మించడం. మొదటి దారి సులభం, రెండో దారి చరిత్రలో నిలుస్తుంది.
ఏ దారి ఎంచుకుంటారో అది ఈ బడ్జెట్ చెప్పదు. రాబోయే ఎన్నికలు చెప్తాయి.


Read More
Next Story