అవయవదానంలో మహిళలే అగ్రస్థానం, త్యాగంతో ప్రాణాలు పోస్తున్న మహిళలు
x
జీవన్ దాన్ కార్యక్రమంలోనూ అతివలే అగ్రస్థానం

అవయవదానంలో మహిళలే అగ్రస్థానం, త్యాగంతో ప్రాణాలు పోస్తున్న మహిళలు

ఒకరి మరణం… ముగ్గురికి, ఐదుగురికి పునర్జన్మ: అవయవదానంలో మహిళల మానవత్వం


ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా మరికొందరికి పునర్జన్మనిచ్చిన మహిళలు తెలంగాణలో అవయవదానానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వ్యక్తిగత త్యాగం, మానవత్వంతో అవయవదానంలో మహిళలే ముందున్నారు. జీవన్ దాన్ గణాంకాలు వారి చైతన్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.


ముగ్గురికి పునర్జన్మనిచ్చిన మహిళ
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో మరో ముగ్గురికి ఆమె పునర్జన్మ నిచ్చారు.
2025 జులై 29 : హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ఇజ్జత్ నగర్ ప్రాంత మహిళ శ్రీదేవి (37) జులై 27వతేదీన ఆఫీసుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాల పాలైంది. మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులకు జీవన్ దాన్ సభ్యులు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించడంతో జులై 29వతేదీన రెండు మూత్రపిండాలు, కాలేయాన్ని సేకరించి అవసరమైన రోగులకు వాటిని మార్పిడి చేసి వారి ప్రాణాలు నిలిపారు.

ఐదుగురికి ప్రాణం పోసిన మహిళా డాక్టర్
2025 ఫిబ్రవరి 10 : హైదరాబాద్ నగరానికి చెందిన 24 ఏళ్ల మహిళా వైద్యురాలు డాక్టర్ ఎన్ భూమికారెడ్డి కారులో వస్తూ ఖానాపూర్ వద్ద డివైడరును ఢీకొని ప్రమాదం బారిన పడి బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం అన్నిటికన్నా మిన్న అని చెప్పే ఆ వైద్యురాలి మాటలను గుర్తు చేసుకున్న ఆమె తల్లిదండ్రులు గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను ఐదుగురు రోగులకు మార్పిడి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించారు.

అవయవదాతల్లో అతివలే అగ్రస్థానం
తెలంగాణలో లైవ్ అవయవ దాతల్లో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. కుమారుడికి రెండు కిడ్నీలు దెబ్బతింటే , వారికి ఓ కిడ్నీని ఓ తల్లి లేదా, భార్య, చెల్లి ముందుకు వచ్చి కిడ్నీని దానం చేసిన ఘటనలున్నాయని నిమ్స్ వైద్యులు చెప్పారు.2023వ సంవత్సరంలో అవయవదానం చేసిన మహిళల సంఖ్య అధికమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ గణాంకాలే చెబుతున్నాయి. అవయవదాన మానవీయ మహోద్యమంలో మహిళలు ముందు నిలవడం విశేషం.

త్యాగానికి ప్రతిరూపం మహిళలు : గూడూరు సీతా మహాలక్ష్మీ
తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా 80 శాతం మంది మహిళలు ఒక కిడ్నీని తన కుటుంబసభ్యులకు దానంగా ఇచ్చారని జాతీయ ఆరోగ్యశాఖ లెక్కలే చెబుతున్నాయని ఆర్గాన్ డొనేషన్ ఉద్యమ నాయకురాలు గూడూరు సీతామహాలక్ష్మీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మహిళలు త్యాగాలకు ప్రతిరూపమని ఆమె పేర్కొన్నారు. ఏ కుటుంబంలో అయినా సోదరుడు, భర్త, కుమారుడు ఇలా ఎవరికైనా కిడ్నీలు దెబ్బతింటే ఆ కుటుంబంలోని మహిళలే ముందుకు వచ్చి లైవ్ అవయవదానం చేస్తున్నారని ఆమె చెప్పారు.

తెలంగాణ మహిళల్లో పెరిగిన చైతన్యం, అవవయ దానంలోనూ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రంలో పురుషులే కాదు మహిళల్లోనూ అవయవ దానం కోసం జీవన్ దాన్ కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తెలంగాణలో 2013వ సంవత్సరంలో కేవలం 34 మంది మహిళలు అనారోగ్యంతో వివిధ అవయవాల కోసం జీవన్ దాన్ కార్యక్రమం కింద తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.గత పన్నెండేళ్లలో అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా రోగుల సంఖ్య పది రెట్లకు పైగా పెరగడం విశేషం. 2025వ సంవత్సరంలో 497 మంది మహిళా రోగులు అవయవాల కోసం తమ పేర్లను నమోదు చేయించుకోవడంతో జీవన్ దాన్ కార్యక్రమంపై మహిళల్లో పెరిగిన ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. అవయవదానం చేయడంలో మహిళలు ముందున్నారని తెలంగాణ జీవన్ దాన్ కన్వీనర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జీవన్ దాన్ కార్యక్రమం కోసం మహిళల రిజిస్ట్రేషన్లు
సంవత్సరం రిజిస్ట్రేషన్ల సంఖ్య
2013 34
2014 187
2015 209
2016 306
2017 336
2018 361
2019 309
2020 186
2021 423
2022 418
2023 466
2024 506
2025 497

రిజిస్ట్రేషన్లే కాదు మహిళల్లో పెరిగిన ట్రాన్స్ ప్లాంటేషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని మహిళల్లో జీవన్ దాన్ కార్యక్రమం కింద అవయవాల కోసం రిజిస్ట్రేషన్లే కాకుండా ట్రాన్స్ ప్లాంటేషన్ల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. 2013వ సంవత్సరంలో ఒక్క మహిళా రోగి కూడా అవయవాలను మార్పిడి చేసుకోలేదు. కానీ గత పన్నెండేళ్లలో జీవన్ దాన్ కార్యక్రమం కింద మహిళల అవయవాల మార్పిడిలో 219 మంది శస్త్ర చికిత్సలు చేయించుకొని రికార్డు నెలకొల్పారు. 2014వ సంవత్సరంలో 31 మంది మహిళలు ట్రాన్స్ ప్లాంటేషన్లు చేయించుకోగా 2015వ సంవత్సరానికి వీటి సంఖ్య రెట్టింపునకు చేరి 64 మందికి పెరిగింది. 2016లో 73 మంది, 2017లో 93 మంది, 2018లో 106 మంది మహిళలు అవయవాలను మార్పిడి చేయించుకున్నారని జీవన్ దాన్ గణాంకాలే స్పష్టం చేశాయి. 2019 వ సంవత్సరంలో 86 మంది మహిళలు, 2020లో 45 మంది, 2021లో 140 మంది, 2022లో 173 మంది, 2023లో 178 మంది మహిళలు అవయవాలను ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారని నిమ్స్ వైద్యులు చెప్పారు. 2024వ సంవత్సరంలో 177 మంది మహిళలు అవయవాల మార్పిడి కోసం ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకోగా, 2025వ సంవత్సరంలో వీరి సంఖ్య 219 కి పెరిగింది.

త్యాగానికి ప్రతిరూపమైన మహిళలు అవయవదానంలోనూ తమ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఒకరి జీవితం ముగిసినా మరెందరికో జీవన దీపం వెలిగిస్తూ, తెలంగాణలో అవయవదానం మానవీయ ఉద్యమంగా విస్తరించడంలో మహిళల పాత్ర కీలకంగా మారింది.


Read More
Next Story