హిందూ మత బోధకుడు’గా మారుతున్న వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి
x
తిరుపతిలో హిందూమతంలోకి మారిన అబ్దుల్లా, అమీనా

హిందూ 'మత బోధకుడు’గా మారుతున్న వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి

భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో హిందూమత పునఃప్రవేశం చేసిన ముస్లిం దంపతులు. ఎందుకు?


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మాజీ ఛైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఒక ఆసక్తికరమయిన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం, తిరుపతిలో ఒక మత మార్పిడి కార్యక్రమాన్ని వైదిక పద్థతిలో ఏర్పాటు చేశారు. అబ్దుల్లా, అమీనా అనే ముస్లిం దంపతులను వైద మంత్ర పఠనం మధ్య హిందూ మతంలోకి పున:ప్రవేశ కల్పించారు. దీనితో వాళ్లు శ్రీనివాసులు రెడ్డి, పుష్పలు మారారు. అబ్దుల్లా అమీనాలు పూర్వం హిందూమతంలోనే ఉండేవారు. అపుడు వారిపేర్లు శ్రీనివాసులు రెడ్డి, పుష్ప. ఇపుడు వాళ్ల హిందూమతంలోకి అదే పేర్లను స్వీకరించారు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి వాళ్లు హిందువులుగా మారడం, రెండోది అగ్రకుల రెడ్డి హోదా పునరుద్ధరించుకోవడం.

భూమన కరుణాకర్ రెడ్డి పూర్వం రాడికల్ కమ్యూనిస్టు. ఆతర్వాత కాంగ్రెస్ లో చేరి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆపైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ చేసి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. టిటిడి బోర్డు ఛెయిర్మన్ అయ్యారు. టిటిడిలో ఉన్నపుడు ఆయనలో హిందూ భక్తి కట్టలు తెచ్చుకుంది. దళితులను హిందూమతానికి, ముఖ్యంగా వేంకటేశ్వర స్వామికి దగ్గర చేర్చేందుకు ‘దళితగోవిందం’ అనే కార్యక్రమం నిర్వహించారు.

టిడిడి ఒక ధార్మిక సంస్థ. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం ఈసంస్థ లక్ష్యాల్లో ఒకటి. అయితే, టిటిడిలో ఉన్నపుడు ఆయన ముస్లింలను గాని, క్రైస్తవులను గాని హిందూమతంలోకి తెస్తూ పునరాగమ మహోత్సవం నిర్వహించలేదు. ఇపుడు ఉన్నట్లుండి ఒక ముస్లిం జంటని ఎంచుకుని వారిని హిందూ మతంతోకి తెచ్చారు. ఈ కార్యక్రమానికి హిందూమత పున:స్వీకరణ కార్యక్రమం అని పేరు పెట్టి వైదిక పద్ధతిలో హోమం జరపించి, బ్రాహ్మణుల వేద మంత్రాలతో వారిని శుద్ధి చేయించి వేడుకగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసంలో జరిగింది. దీనికి కొద్దిమందినే ఆహ్బానించినప్పటికి కార్యక్రమం వెనక ఒక రాజకీయ లక్ష్యం ఉన్నందున వైసిపి సోషల్ మీడియా సైన్యం ఈ వార్తని వైరల్ చేసింది.

ఇంతవరకు ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ వాళ్లు గాని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్ ) గాని నిర్వహించలేదు. ఇలాంటపుడు కరుణాకర్ రెడ్డి ఎందుకు నిర్వహించారు అనేది చర్చనీయాంశం అయింది. ఎందుకంటే, ఇది ప్యూర్ హిందూమతతంతు కాదున, రాజకీయ తంతు. ఇపుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్ డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళ సనాతన ప్రచారానికి ఒక విరుగుడుగా జరిగిన కార్యక్రమం. ఇలా ముస్లిం లు హిందూమతంలోకి మారిన సంఘటలను ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్లు లేదు.

భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువులందరిని క్రైస్తవులుగా ప్రచారం చేయడం రాష్ట్రంలో జరుగుతూ ఉంది.బిజెపి మద్దతు దారులు సోషల్ మీడియాలో రకరకాలుగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి క్రైస్తవుడని గుర్తు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఇది కొత్త విషయం కాదు. ఎపుడూ చర్చనీయాంశం కాలేదు. కేంద్రంలో బిజెపి బలపడుతున్నకొద్ది ఇది సోషల్ మీడియాలో ఒక కొత్త సత్యంగా జరజర పాకూతూ పోయింది. అయితే, వైఎస్ ఆర్ ఉన్నంతవరకు, లేదా చంద్రబాబునాయుడు వాజ్ పేయితో కలసి ఉన్నంతవరకు దీనికి రాజకీయ ప్రాముఖ్యం రాలేదు. అయితే, ఇది 2014 తర్వాత బాగా బలం పుంజుకుంది. ఇందులో భాగంగా వైఎస్ బంధువులంతా క్రైస్తవులనే ప్రచారం కూడా పెరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి కూడా క్రైస్తవుడే అనేది ఆయన టిటిడి బాధ్యతలు స్వీకరించాక బ ాగా చర్చనీయాంశమయింది. వైఎస్ కుటుంబంతో భూమన్ కుటుంబానికి వైవాహిక సంబంధాలుడంటమే దీనికి కారణం.

భూమన నిజానికి క్రైస్తవుడు కాదు. ఆయన ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఎక్కడా తాను క్రైస్తవుడని రాయలేదు. కాకపోతే, క్రైస్తవకుటుంబానికి కూతురునివ్వడం, ఆమె వివాహం క్రైస్తవ సంపద్రాయం ప్రకారం జరిగడంతో దానికి సంబంధించిన ఫోటోలను కొంతమంది వైరల్ చేశారు. ఆయన్ని ‘క్రైస్తవుడు’ అని ప్రచారం చేశారు. ఆయనతో వ్యక్తిగత సంబంధం ఉన్నవాళ్లకు కరుణాకర్ రెడ్డి మతాచారం ఏమిటో అర్థమవుతుంది. అయితే, భూమనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం మాత్రం బాగా జనంలోకి వెళ్లింది. నిజమోనేమో అనే స్థాయికి వచ్చింది.

తిరుపతి నగరంలోని పీకే లేఅవుట్‌లో నివసించే శ్రీనివాసులు రెడ్డి, పుష్పలు ఇపుడు ఎందుకు ఇస్లాం స్వీకరించారో తెలియదు. సుమారు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి వెతుక్కుంటూ కువైట్‌కు వలస వెళ్లారు. అపుడు ఎందుకు మతం మారారు, ఇపుడు ఎందుకువెనక్కి వస్తున్నారనేది మిస్టరీ. కరుణాకర్ రెడ్డి కి వాళ్లు సమయానికి దొరికారు. అప్పర్ క్యాస్ట్ రెడ్డి దంపతులను కాకుండా ఒక దళిత క్రైస్తవుని ఎన్నుకుని ఉంటే ఇంకా మంచి ప్రచారం వచ్చేది..

ఆంధ్రా పార్టీల సెక్యులర్ ముసుగు

2024 ఎన్నికల్లో గెలిచాక తెలుగుదేశం పార్టీ ‘సెక్యులర్ కలర్’ కొంత వదిలించేసుకుంది. సనాతనం స్వీకరించింది. దీనికి ప్రధాని మోదీ భారత రాజకీయాల్లో అంత్యంత శక్తివంతుడిగా ఎదగడమే. ఆంధ్రా ఎన్ డిఎ (NDA) లో ఉన్న రెండు సెక్యులర్ పార్టీలు (తెలుగుదేశం, జనసేన) ఇపుడు సనాతన జపం బాగా చేస్తున్నాయి. టిడిపి నేతలు ఇందులో కొంత నిగ్రహంగా ఉన్నా, జనసేన నేత పవన్ కల్యాణ్ మాత్రం నిలువునా కాషాయం పూసుకున్నారు. ఆయన వేష భాషలు బిజెపి వాళ్ల కంటే ఎక్కువ హిందూత్వం అందుకున్నాయి. ఒక్కొక్కసారి వెగటు కలించేంతగా ఆయన సనాతన వాదం ముదిరింది. ఇది ప్రధాని మోదీ బలం చూసి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహమే. ఎందుకంటే పవన్ రాజకీయ జీవితంలో అన్ని రంగులు ఉన్నాయి. ఇపుడు ఆయనకు కాషాయకారు నడుస్తూ ఉంది.

లడ్డుతో మొదలయిన సనాతన వాదం

తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి వివాదం తర్వాత ఆంధ్రా రాజకీయాల్లో భక్తి, పవిత్రత, హిందూ మనోభావాలు అనే అంశాలు బాగా అలుముకున్నాయి. ఈ పరిణామం వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘క్రైస్తవుడు’ అనే విషయం గుర్తుకు తెచ్చేలా మారుతూ వచ్చింది. లడ్డు తయారీ కోసం కల్తీనెయ్యి సరఫరా చేయడం, నేతిని అనుమతించడం వంటి చర్యలను స్కామ్ గా చూపించి, వైసిపి హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ఎన్ డిఎ బాగా ప్రయత్నిస్తూ ఉంది. అంటే జగన్ క్రైస్తవుడుని, ఆతని పాలనలో హిందూ ఆలయాల పరిరక్షణ జరగదని దానికి ఉదాహరణ కల్తీనెయ్యి అనే రాజకీయ ప్రచారం సాగుతూ ఉంది. ఆ పార్టీని దూరంగా పెట్టడం హిందువులందరి బాధ్యత అనే చెప్పడమే దీని ఉద్యేశ్యం. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా, ఓట్ల శాతంలో జగన్ బలం ఉందని ఎన్డీయే గుర్తించింది. మళ్లీ జగన్ వస్తాడేమో అనే భయం కూడా ఎన్డీయే పార్టీలలో ఉంది. అందుకే జగన్ ని రాజకీయాలతో నే కాకుండా ‘సనాతనం’ తో కూడా కొట్టేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు ఆంధ్ర రాజకీయాలను పరిశీలించేవారికి అర్థమవుతుంది.

వైఎస్ జగన్ అనుచరులందరూ ఈ వ్యూహం పరిధిలోకి వస్తారు . భూమన్ హిందూ మతప్రబోధకుడిగా మారుస్తున్నది కూడా ఈ రాజకీయమే. ఈ క్రైస్తవం మరకల నుంచి బయటపడటం భూమన్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే, ఆయన తన కొడుకు అభినయ్ రెడ్డిని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. తిరుపతి మునిసిపల్ కౌన్సిల్ దాకా వచ్చినా 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ అన్యమత ముద్ర కొడుకు భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీన్నుంచి బయటపడటం కరుణాకర్ రెడ్డి కి అసవరం. తాను హిందువును మాత్రమే కాదు, హిందుమత ప్రచారకుడిని కూడాఅని ఆయన హోమం సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా ఆయన చెప్పారు. హిందూమతం నుంచి వెళ్లిపోయిన వాళ్లని వెనక్కి (Ghar Waapsi) తెచ్చే పనికూడా భుజానేసుకుంటా నని తిరుపతి హిందూ మత పున: స్వీకరణ మహోత్సవం ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పారు.

తాను హిందూ ధర్మం కోసం టిటిడి ఛైర్మన్‌గా ఉన్నపుడు ఏమి చేసిందో చెప్పారు. అపుడు హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం సంబంధిత అంశాలపై చర్చించేందుకు 60 మంది పీఠాధిపతులు, మత పెద్దలతో ఒక సదస్సు ఎలా నిర్వహించింది తిరుపతి కార్యక్రమంలో మాట్లాడుతూ భూమన చెప్పారు. ఇతర మతాల్లోకి మారిన వారు తిరిగి సనాతన ధర్మం స్వీకరించాలనుకొంటే వారికి సహాయం చేయడానికి ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సాయం చేస్తానని కూడా భూమన చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందకు భూమన హిందూ ఎవాంజెలిస్టుగా మారుతున్నారా?


Read More
Next Story