దీనితో చరిత్ర పునరావృతుందనే ఆయన ఆశ!
x
సతీమణితో కలిసి యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

దీనితో చరిత్ర పునరావృతుందనే ఆయన ఆశ!

ఈ సారి కూడా సీఎం కేసీఆరేనా? ఎన్నికలకు ముందు యాగాలు కలిసొస్తాయా? సెంటిమెంట్‌లో వాస్తవమెంత?


తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) కేసీఆర్‌కు కాస్త భక్తిభావం ఎక్కువ. దేవుళ్లను విశ్వసిస్తారు.యాగాలు చేయిస్తారు. వాటివల్ల ఫలితం కచ్చితంగా ఉంటుందని ఆయన విశ్వసిస్తారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు యాగం చేయడం, స్వామివారి పాదాల చెంతన నామినేషన్‌ పత్రాలకు పూజ చేశాక నామినేషన్‌ వేయడం కేసీఆర్‌ ఆనవాయితి.

తెలంగాణలో నవంబర్‌ 30వ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలోలాగే కేసీఆర్‌ ఇటీవల రాజశ్యామల యాగం చేయించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ యాగం జరిగింది.

విశాఖపట్నం శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర పర్యవేక్షణలో మూడు రోజుల పాటు (నవంబర్‌ 1 నుంచి 3 వరకు) జరిగిన ఈ యాగంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఎన్నికలకు ముందు ప్రతిసారి..

2015లో కేసీఆర్‌ (KCR) మహారుద్ర సహిత సహస్ర చండీయా ఐదురోజుల పాటు (జనవరి 21 నుంచి 25వరకు) నిర్వహించారు. 2018 ఎన్నికలకు ముందు కూడా తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం (Rajasyamala Yaagam) చేయించారు. తర్వాత జరిగిన ఎన్నికలలో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోనూ అడుగుపెడుతున్న సందర్భంలోనూ ఆయన ఢల్లీిలో యాగం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారు’’

- పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి

‘‘కేసీఆర్‌ యాగం చేసిన ప్రతిసారి ఎన్నికలలో గెలుపొందారు. ఈ దఫా కూడా అదే పునరావృతమవుతుంది’’

- పార్టీ వర్గాలు

‘‘పూర్వ కాలంలో రాజు గారు యుద్ధానికి వెళ్లే ముందు వేదపండితులతో యాగాలు చేయించేవారు. చండీయాగాలు, శత్రు సంహార యాగాలు వాటిలో ముఖ్యమైనవి.’’

- పురోహితులు

రాజసూయ యాగం` రాజ శ్యామల యాగం ఒకటేనా!

వీటి మధ్య సంబంధం తెలుసుకోవాలంటే ముందుగా రాజసూయ యాగం గురించి తెలియాలి. ‘సూయం’ అంటే శాశ్వతం... రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా ఉండేలా చేసేది. అందుకే దీన్ని ‘రాజసూయ యాగం’ అంటారు.

శత్రు క్షయం, కీర్తి, విజయాలు సిద్ధించడం కోసం రాజసూయ యాగం చేయాలని చెప్పి శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో ఈ యాగం చేయిస్తాడట. మహాభారతంలోని సభాపర్వంలో ఈ యాగ ప్రస్తావన ఉంది. మయసభలో దుర్యోధనుడి పరాభవం, శిశుపాలుడి వధ ఈ యాగం తర్వాతే జరిగాయట.

తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకునేందుకు.. రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగం ఇది. ఈ యాగాన్ని ఏడాదిపాటు చేయొచ్చు.. లేదంటే మండలం రోజులు (41 దినాల పాటు) నిర్వహిస్తారు. 21 రోజులు, 16 రోజులు, 3 రోజుల్లో కూడా చేస్తారు. రాజసూయ యాగం రాజ శ్యామల యాగం ఒకటే కాకపోయినా.. వాటి వెనకున్న ఆంతారార్థం మాత్రం ఒకటే. ‘‘ప్రారంభించిన కార్యంలో విజయం అందుకోవాలి. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, అధికారం సిద్ధిస్తుందని’’ కొందరి విశ్వాసం.

తిరుమలపై వరుణుడి కోసం యజ్ఞం

1979లో తిరుమల కొండమీద తీవ్ర నీటి కొరత ఏర్పడిరది. అప్పటి ఈవో దివంగత పీవీఆర్‌కె ప్రసాద్‌ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం కనుక్కోవాలని దివంగత ఉప్పులూరి గణపతి శాస్త్రిని సంప్రదించారు. త్రికరణ శుద్ధిగా యజ్ఞం ఆచరిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పడంతో వేదపండితులతో వరుణ యజ్ఞం చేయించారు. యజ్ఞం ముగుస్తున్న సమయంలో కుండపోతగా వర్షం కురిసింది. విచిత్రం ఏమిటంటే.. ఒక్క తిరుమలలో తప్ప చుట్టుపక్కల ఎక్కడా వర్షఛాయలు కనిపించలేదు. ఇదంతా కాకతాళీయమా? వేదమంత్రాల శక్తి ప్రభావమా? భక్తులు నమ్ముకున్న దేవుడి అనుగ్రహమో తెలియదు కాని.. ఈ విషయాలను స్వయంగా పీవీఆర్‌కె ప్రసాద్‌ తన పుస్తకం (నాహం కర్తా, హరిః కర్తా)లో రాశారు.

రాజ శ్యామల దేవత ఆలయం ఎక్కడుంది?

రాజ శ్యామల యాగం ప్రస్తావన వస్తే.. శ్రీ రాజ శ్యామల ఆలయం గురించి తెలుసుకోవాలి. వైజాగ్‌లోని చినముషిడివాడలోని శారదా పీఠం ప్రాంగణంలో మాత్రమే శ్రీ రాజ శ్యామల ఆలయం ఉంది. దేశంలో మరొక్కెడ లేదు. 2018 ఎన్నికల అనంతరం అధికారాన్ని నిలబెట్టుకున్న కేసీఆర్‌ విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి, శ్రీ రాజ శ్యామలకి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన అరుదైన పర్యటనలలో ఇది ఒకటి.

దురదృష్టకరం

‘‘యాగాలతో ఓట్లుపడవు. ఆ విషయానికొస్తే..బీఆర్‌ఎస్‌ (BRS) విజయం కోసం కేసీఆర్‌ 2022 డిసెంబర్‌లో రాజశ్యామల యాగం చేశారు.ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎక్కడ ఉంది. మరణాలకు దారితీసే మూఢనమ్మకాలు తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ కొనసాగుతుండడం దురదృష్టకరం’’.

-బాబు గోగినేని, ప్రముఖ హేతువాది

భారీ ఖర్చుతో కూడిన మూడు రోజుల యజ్ఞం కంటే రెండు రోజుల పాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని పంచి ఉంటే సమాజానికి ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ కేసీఆర్‌ ఏదో మంత్రాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లినపుడు ఇలాంటివి చేస్తుంటారు’’ అని కరీంనగర్‌ (Karimnagar) నియోజకవర్గ బీజేపీ (BJP) అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు.

ఏపీలో జగన్‌ కూడా..

ఏపీలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా వైజాక్‌ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందతో ఈ యాగం చేయించారని పండితులు చెబుతున్నారు. ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ విజయం సాధించారు.

నామినేషన్‌ పత్రాలకు కేసీఆర్‌ పూజలు

సిద్దిపేట (Siddipeta) జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ ఇటీవల దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీ. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 9న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.


Read More
Next Story