కమలం రూటేమిటో.. ?!

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి-బిఆర్ఎస్ (గతంలో టీఅర్ఎస్ ) హోరా హోరీగా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. తెలంగాణాలో బిజెపికి జనసేన నేరుగా మద్దతు ప్రకటించింది.


కమలం రూటేమిటో.. ?!
x
BJP Logo


ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ ఎటువైపు అనే విషయంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బిజెపి-జనసేన పార్టీలు ఇప్పటి వరకు స్నేహభావంతో ఉన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ కి వ్యతిరేకంగా పనిచేస్తామని ఢంకా మోగించారు. నేరుగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. దీంతో ఏపీలో 2024 ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పుడు తాజాగా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి పై సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాయడంతో నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి దూరంగా ఉన్న బిజెపి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మ‌రింత‌ దగ్గరవుతోంద‌ని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనపై ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి టిడిపికి పని చేస్తున్నారని, బిజెపికి కాదని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. గతంలో సోము వీరాజు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన వారే ఇప్పుడు పురంధేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టాక కమ్మ సామజిక వర్గానికి మద్దతు ఇస్తున్నారని అధికార పార్టీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ముందుగా మద్యంపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఏపీ బిజెపి పార్టీ అధ్యక్షురాలు ఆ తరువాత నేరుగా ఏపీలో మద్యం విక్రయాలపై సీబీఐ తో విచారించాలని నేరుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఆమె లేఖ రాసారు. అక్కడితో ఆగకుండా తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి పై లేఖ రాయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ వరుస లేఖా దాడితో అధికార పార్టీపై కేంద్రం చర్యలకి ముందుకి వెళ్తుందా లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కేంద్రం ఎంతో స్నేహపూర్వకం ఉంటోంది. దీంతో పురంధేశ్వరి లేఖతో వైసీపీ పార్టీ నేతలపై బీజేపీ అధ్యక్షురాలు రాస్తున్న లేఖల పై కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అధికార వైసిపి తో దోస్తీనా.. లేక కయ్యానికి కాలు దువ్వుతుందా? తేలాల్సివుంది.

తెలంగాణాలో ఇలా ఎందుకు ..?

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి-బిఆర్ఎస్ (గతంలో టీఅర్ఎస్ ) హోరా హోరీగా ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. తెలంగాణాలో బిజెపికి జనసేన నేరుగా మద్దతు ప్రకటించింది. ఇక టిడిపి తెలంగాణాలో ఎన్నికల పోటీ నుండి తప్పుకుంది. పార్టీ నిర్ణయం వెలువడిన వెంటనే తెలంగాణ టి-టీడీపీ అధ్యక్షుడి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు పార్టీకి రాజినామ్ చేసి బీఆర్ఎస్ పార్టీ తీర్ధం తీసుకున్నారు. ఇక ఎన్నికల్లో పోత్తు విషయంలో బిజెపి, జనసేన, ట్-టీడీపీలు బిఆర్ఎఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. మిగిలిన కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ కు పోటా పోటీగా బరిలో నిలుస్తోంది. ఈ పొత్తును చూస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికార వైసీపీకి పోటీ ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు ఎటువైపు వెళ్లనున్నారో అన్న విషయంలో సందిగ్ధత వుంది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన బిజెపితో కలిసి పనిచేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పకనే చెప్పారా అనే అనుమానం కలుగుతోంది. ఇదే జరిగేతే ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలు మరింత రసకందాయనంలో జరగనున్నాయి.


Next Story