ఈ ఎన్నికల్లో కెసిఆర్ కు ఎదురైన 30 సవాళ్లివే...
ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈ ఎన్నికల్లో 30 పెను సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నారనే దాని పై ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ సవాళ్లు ఇవే.
ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా అధికార పార్టీకి ఎన్నిసవాళ్లు ఎదురయ్యాయన్నదే ప్రధానంగా చర్చల్లో ఉంటుంది.
ఓడిపోయినా ప్రతిపక్షాలకు పోయేదేమీ ఉండదు కాబట్టి, ప్రతిపక్ష పార్టీలకు ఎదురయ్యే సవాళ్ల మీద అంత పెద్ద చర్చ ఉండదు. అయితే, అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు ఎలా ఇరుకున పెడుతున్నాయన్నది మరొక చర్చనీయాంశం అవుతుంది. ఇలా ఎన్నికల ప్రచారంలో జనమంతా ఈ మూడు విషయాలు ఎలా ఉన్నాయనే దాని మీద దృష్టిపెట్టి ఉంటారు.
తెలంగాణాలో అధికార పార్టీ బిఆర్ ఎస్ చాలా గట్టి పార్టీ. 2001 లో పుట్టిన ఈ పార్టీ తెలంగాణ ఉద్యమంతో ఊరూర వేళ్లూనింది. 2014 ఎన్నికల్లో గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, అనేక సంక్షేమ పథకాలు మొదలు పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి ఇంట్లో చొరబడింది. ఇక మనకు తిరుగుండదు అని ముఖ్య మంత్రి భావించారు.
తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తనని, ప్రతి కుటుంబాన్ని అంతో ఇంతో ఆదుకున్న టిఆర్ ఎస్ పార్టీని ప్రజలు అక్కున చేర్చుకుని ఆదరిస్తారు, ఇది ఆటోమేటిక్ గా జరుగుతుందని ఆయన భావించి, పార్టీని ఇక జాతీయ స్థాయికి తీసుకుపోయి ఢిల్లీలో సెటిల్ అవుదామనుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ )ని భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) గా మార్చారు. అయితే, పదమూడేళ్ల ఉద్యమం, పదేళ్ల అధికారం, సమర్థవంతమయిన నాయకత్వం ఉన్నా బిఆర్ ఎస్ పార్టీ ఈ సారి చిక్కుల్లో పడింది. ఎన్నడూ లేనంత తీవ్రమయిన పోటీని కాంగ్రెస్ నుంచి ఎదుర్కొంది. చివరకు ఎగ్జిట్ పోల్సన్నీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తున్నది చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో బిఆర్ ఎస్ కు ఎన్ని రకాల సవాళ్లు ఎదరుయ్యాయేనేదాన్ని 'ఫెడరల్- తెలంగాణ' పరిశీలించింది. బిఆర్ ఎస్ నేతల ప్రచారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కెటి రామారావు,కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావుల ప్రచారం, ప్రతిపక్షాల ప్రచారం, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, బిజెపి నేతలు, బండి సంజయ్, ఈటల రాజేందర్, బిఎస్పి అధినేత డా.ప్రవీణ్ కుమార్ ల ప్రచారం, మీడియాలో పలు సందర్భాలలో వచ్చిన విశ్లేషణలు అధారంగా అధికార పార్టీ కి ఎన్ని సవాళ్లు ఎదురయ్యాయో లెక్కించింది.
ఈ సమాచారం ప్రకారం కెసిఆర్ కు 2023 అసెంబ్లీ ఎన్నికల ను ఎదుర్కోవడంలో 30 పెను సవాళ్లు ఎదురయ్యాయి.
అవి ఇవే.
1. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఖాతరు చేయకుండా తన బోమ్మ ఉంటే చాలు ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారనే అతివిశ్వాసం.
2. కెసిఆర్ కుటుంబం వోవర్ ఎక్స్ పోజర్ కు గురయింది. ఎక్కడ చూసినా ఆ నలుగురే. కనిపించి పార్టీలో ప్రచారంలో కొత్త దనం లేకుండా చేశారు.
3. ఒక నాటి వాజ్ పేయి ప్రభుత్వం చేసిన ఇండియా షైనింగ్ (India Shining) క్యాంపెయిన్ లాగా తెలంగాణలో అంతా సుభిక్షం, నెంబర్ 1 అంటూ సొంత మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఇతర పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాకుండా బిగించడం. వ్యతిరేకులందరి నోరు మూయించడం. ప్రజల్లో విశ్వాసం క్రమంగా కోల్పోతున్నామన్న విషయం కూడా తెలుసుకోకుండా కళ్లూ చెవులు మూసుకోవడం
4. కొద్ది రోజులు మోదీతో దోస్తి. కొద్ది రోజులు మోదీకి ఫైట్. మరికొద్ది రోజులు మోదీ,కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంటు అనడం. కూతరు కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు మోదీతో చేతులు కలిపాడని జనమంతా నమ్మడం. దీనితో ఉద్యమనేత రాజకీయాల మీద గౌరవం సన్నగిల్లడం.
5. బిఆర్ ఎస్ ను జాతీయ పార్టీగా ఎందుకు మార్చాడో ఇప్పటికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో జనంలో దీని లక్ష్యం మీద కూడా అనుమానాలు రావడం. విషయంలోనూ గడియకో మాట
6. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో విమానమేసుకుని రాష్ట్రాలు తిరగటం, ఎవరూ పట్టించుకోక పోవడంతో ప్రజల్లో ఆయన జాతీయ నాయకత్వ కెపాసిటీ మీద అనుమానం రావడం
14.అవినీతిపరులైన పార్టీ నాయకులను వెనకేసుకుని రావటం
7. తనేమీ చెప్పినా జనం నమ్ముతారని బీజేపీ విషయంలో ఒకటి చెప్పడం మరొకటి చేయడం.
8. తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలను వాడుకుని తెలంగాణ ఏర్పడ్డాకా వాటిని గాలికి వదిలేయడం, అక్కడ వసతుల్లేవు, ఫాకల్టీ లేదు. మెస్ ల్లో భోజనం అధ్వాన్నం. తీరా పాసయ్యాక ఆ యువతకి ఉద్యోగాలు చూపించలేకపోవడం
9. పేపర్ లీకేజీల్లో నెంబర్ వన్. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేకపోవడం. ఇది ఇంటర్ లీకేజీతో మొదలయింది. ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 లీకేజితో తారాస్థాయికి చేరుకుంది. దీనితో 30 లక్షల మంది నిరుద్యోగులు ఎన్నికల సమయానికి పల్లెల్లో ఇంటికి చేరుకున్నారు. ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి. అందుకే కెసిఆర్,కెటిఆర్, హరీష్ రావు ,కవిత తెలంగాణా అభివృద్ధి గురించి ఎంత గొప్పగా చెప్పినా నట్టింట్లో తిష్ట వేసిన నిరుద్యోగానికి సమాధనం రాలేదు.
10. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి వాగ్దానం చేసి, గెలిచారు. ఈ అయిదేళ్లు దాని గురించి మాట్లాడలేదు. దీనితో ఎన్నికల్లో గెలిచేందుకు ఉద్యమనేత కెసిఆర్ ఏ అబద్దపు హామీ అయినా ఇస్తారు. ఆయన ఉపన్యాసాలను సీరియర్ తీసుకోవాల్సిన పనిలేదు.
11. ఉద్యమపార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేసుకున్నారు. వాళ్లంతా ఏమీ ఆశించకుండా కాంగ్రెస్ కు ప్రచారం చేశారు.
12. తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను ఆణచేయడం. ఆర్టీసీలో యూనియన్లే లేకుండా చేసి సమ్మెను క్రూరంగా అణిచివేయటం
13. సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
14. మీడియా, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలను అణిచేయడం మిడిల్ క్లాస్ మేధావులకు ఆగ్రహం తెప్పించింది. వాళ్లంతా కెసిఆర్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు.
15. ఉద్యమనేత గా వెలుగొందిన నేత టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, కాంగ్రెస్,సిపిఐ పార్టీల నుంచి ఫిరాయింపులు పోత్సహించడమేమిటి?
16. .అసెంబ్లీలో భారీ అధిక్యత ఉన్నా కాంగ్రెస్ శాసనసభాపక్షాన్నే తెరాసలో విలీనం చేసుకోవడం
17. తెలంగాణ గడ్డ తమది, అక్కడ అధికారం తమదే. ప్రజలు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారా అన్నట్లు ఇతరులకు హక్కులేనట్లు ప్రవర్తించడం.
18. ఫాంహౌస్‌లో స్టింగ్ ఆపరేషన్ చేసి బీఎల్ సంతోష్, అమిత్‌షాల పాత్రపై దేశవ్యాప్తంగా అన్ని కోర్టులకు, పార్టీలకు సీడీలు పంపి ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో అసలు ఆ ఊసే ఎత్తకపోవడం
19. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకుండా బిజెపితో రాజీపడ్డారని ప్రచారం తీవ్రంగా రావడం.దీనితో BRS-BJP ఒకటే ఓటర్లు భావించడం
20. ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జగన్‌ను ప్రోత్సహిస్తున్నారనే అనుమానం ఒక సామాజిక వర్గంలో ప్రబలడం
21. చంద్రబాబు అరెస్ట్ మీద హైదరాబాద్ లో నిరసనలు తెలిపే హక్కులేదంటూ ఐటి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు
22. దళితబంధు, బీసీ బంధు అందుకున్న లబ్ధిదారులకంటే అందని ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి. పార్టీ కార్యకర్తల కుటుంబాలకే ఇది అందుతున్నాయన్న ఆరోపణ
23. కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజీలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు బాగా దెబ్బతినడం
24. కెసిఆర్ మోడల డెవలప్ మెంటు అంటే ప్రజల్లో భయం. ఏ ప్రాజక్టుపేరుతో భూములుపోతామని రైతుల్లో భయం ఉంటే, పదేళ్లలో ఉద్యోగాలివ్వకపోయినా ఇపుడు గెలిచాడంటే ఇక ప్రభుత్వోద్యోగాలు ఎప్పటికీ ఇవ్వడని యువతరంలో భయం
25. కెసిఆర్ జగనతో చేతులు కలపాడని ఆంధ్రా కమ్మ సెటిలర్లు నమ్మి బిఆర్ ఎస్ ఓడించేందుకు పూనుకోవడం
26. ముఖ్యమంత్రి ఎపుడూ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమిత కావడం, ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా దర్శనం సులభంగా దొరకకపోవటం
27. గజ్వేల్ లో ప్రజల్లో ఒక విమర్శ ఉంది. మా ఎమ్మెల్యే మా వూరికి రాదు, మిమ్మల్ని వాళ్ల ఇంటి దరిదాపులకి కూడా రానీయడు. కెసిఆర్ ని ఫామ్ హౌస్ ను బాగా అబాసుపాటు చేసింది
28. గతంలో లాగా కాకుండా ఈ సారి కాంగ్రెస్ కెసిఆర్ ను ఎన్నికల ప్రచారంలో, సోషల్ మీడియాలో చుట్టుముట్టేందుకు పకడ్బందీ వ్యూహం తయారుచేసుకోవడం.ముఠాలను మర్చిపోయి ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాడటం
29. కెసిఆర్ ఉపన్యాసాల్లో కొత్త దనం లేకపోవడం. పదేళ్లుగా రోజూ చెప్పినవే చెప్పి విసుగెత్తించడం, పదేళ్లు పాలించినా ఇంకా చెప్పులరిగేలా ఊరూరా తిరిగే పరిస్థితి ఎదురుకావడం. కాంగ్రెస్ హామీలలో ఉన్న నావెల్టీ అందించలేకపోవడం
30. గాంధీ కుటుంబాన్ని విమర్శించ పోయి కుటుంబరాజకీయాల్లో తానే కూరుకుపోవడం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలెలా ఉన్నా, డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు ఈ సవాళ్లకు కెసిఆర్ ఎలా స్పందించారనే దాని మీద అధారపడి ఉంటాయి.