మిజోరం ప్రజల విలక్షణ తీర్పు

పడిలేచిన కెరటం లాల్‌ దుహోమా, లాల్‌దుహోమా ఆధ్వర్యంలోని ‘జెడ్పీఎం’ మిజోరం రాజకీయ చరిత్రలో రికార్డ్‌ సాధించింది.


మిజోరం ప్రజల విలక్షణ తీర్పు
x
Lalduhoma

ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో మిజోరం రాష్ట్ర ఉదంతమే నిదర్శనం. అవిచ్ఛన్నంగా రాష్ట్రాన్ని ఏలిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌)ను పక్కన బెట్టి ప్రతిపక్షం జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌కి (జెడ్‌పీఎం)కి అధికారాన్ని కట్టబెట్టారు మిజోరం రాష్ట్ర ప్రజలు. మొత్తం 40 సీట్లలో జెడ్‌పీఎంకి ఏకంగా 27 సీట్లు ఇచ్చారు. మూడున్నర దశాబ్దాల పాటు వస్తోన్న రాజకీయ సంప్రదాయానికి గుడ్‌బై చెప్పడం విశేషం.

ఈశాన్య రాష్ట్రం మిజోరం (Mizorzm). మూడున్నర దశాబ్దాలుగా మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF), కాంగ్రెస్‌ (Congress)లే రాష్ట్రాన్ని పాలించాయి. 1989లో మిజోరం రాష్ట్రంగా అవతరించింది. అప్పటి నుంచి ఈ రెండు రాష్ట్రాలే అధికారాన్ని చెలాయించాయి. తొలిసారి ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM)’కు మిజోరం ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్‌ ఆధిపత్యానికి తెరపడింది. జెడ్పీఎంకి అధికారాన్ని కట్టబెట్టిన నేతగా లాల్‌దుహోమా (Lalduhoma) పేరు మార్మోగుతోంది.
ఎవరీ లాల్‌ దుహోమా..
లాల్‌ దుహోమా మాజీ ఐపీఎస్‌ అధికారి. ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి. ఇందిర స్ఫూర్తితోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. లాల్‌దుహోమా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద రెండుసార్లు అనర్హతకూ గురయ్యారు. గెలుపోటములను తట్టుకున్నారు. ఎట్టకేలకు మిజోరంలో 1989 నుంచి వరుసగా రెండు సార్లు ఒకే పార్టీ అధికారం కట్టబెట్టే సంప్రదాయానికి తెరదించారు. జెడ్పీఎంను అధికారానికి చేరువ చేశారు. మిజోరం సీఎంగా లాల్‌ దుహోమా బాధ్యతలు చేపట్టనున్నారు.
మిజోరంలో ZPM జయకేతనం..
లాల్‌దుహోమా 1949లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. నలుగురు సంతానంలో చిన్నవాడు. బీఏ వరకు చదివారు. మిజోరం తొలి ముఖ్యమంత్రి ఛూంగా వద్ద ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. సీనియారిటీ ప్రాతిపదికన 1977లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. 1982లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జిగా పని చేశారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజకీయాల్లో ప్రవేశించారు. 1984లో కాంగ్రెస్‌ తరఫున మిజోరం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంఎన్‌ఎఫ్‌ తిరుగుబాటుతో రాష్ట్రంలో దెబ్బతిన్న శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు నడుంకట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో 1986లో కాంగ్రెస్‌ సభ్యత్వాన్ని వదులుకున్నారు.
జోరం నేషలిస్టు పార్టీ ఏర్పాటు...
కాంగ్రెస్‌ నుంచి తప్పుకున్న తర్వాత జోరం నేషనలిస్ట్‌ పార్టీ (జెడ్‌ఎన్‌పీ)ని స్థాపించారు. 2018 ఎన్నికల తర్వాత మరో గ్రూపుతో కలిసి ‘జెడ్పీఎం’ సంకీర్ణ పార్టీలో చేరారు. కానీ ‘జెడ్పీఎం’కు పార్టీగా గుర్తింపు లభించలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా రెండు నియోజకవర్గాల్లో (ఆయిజోల్‌–1, సెర్ఛిప్‌) పోటీ చేసి గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్‌ సీఎంగా పనిచేసిన లాల్‌ థాన్‌హవలాను సెర్ఛిప్‌ నుంచి ఓడించి చరిత్ర సష్టించారు. కానీ 2020లో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడయ్యారు. 2021 ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి గెలిచారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యారు.
మళ్లీ అక్కడి నుంచే గెలుపు..
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో సెర్ఛిప్‌ నుంచి లాల్‌ దుహోమా పోటీ చేసి గెలిచారు. మిజోరం విషయంలో నిబద్ధత, ప్రజాజీవితంలో అంకితభావమే ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుడిగా మార్చాయి. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివద్ధే ధ్యేయంగా పని చేశారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్‌ పాలనపై ధ్వజమెత్తారు. ఎన్డీఏలో భాగమైన ఎంఎన్‌ఎఫ్‌ తన ప్రాంతీయ తత్వాన్ని కోల్పోయిందనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. చరిత్ర సష్టించారు. ఎంఎన్‌ఎఫ్‌’ని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అసలు ఖాతా తెరవకుండానే చేశారు. బీజేపీ మాత్రం రెండు సీట్లను గెలిచింది. చిత్రంగా ఇంతలావు ఊపులోనూ మరో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. లాల్‌దుహోమా ఆధ్వర్యంలోని ‘జెడ్పీఎం’ మిజోరం రాజకీయ చరిత్రలో రికార్డ్‌ సాధించింది. లాల్‌ దుహోమా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
Next Story