ఎన్నికల ప్రచారాన్ని భూ మార్గం పట్టించిన రాహుల్
x

ఎన్నికల ప్రచారాన్ని భూ మార్గం పట్టించిన రాహుల్

విమానాలు, గాలి మోటార్లు దిగి చేతులూపుకుంటూ వేదికల మీదకు వచ్చే పరిస్థితికి భిన్నం ఈ యువనేత.. జనంతో మమేకం.. ప్రజలతో మాటా ముచ్చట.. వీధి మీటింగులు.. నేటి ట్రెండ్.


ఎన్నికల ప్రచారాన్ని భూ మార్గం పట్టించిన రాహుల్

(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)

2014. అక్టోబర్. మహారాష్ట్ర.. ఎన్నికల హోరెత్తుతున్నాయి. కరాడ్ సౌత్ నియోజకవర్గం.. పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ క్యాండిడేట్. ఆయనపై కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా ఏడు సార్లు హస్తం గుర్తుపై గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే విలాస్ పాటిల్-ఉండాల్కర్ పోటీ.

విలాస్ పాటిల్ ని అందరూ "కాకా అంటే బాబాయి" అంటారు. కాకా.. నిజానికి డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన ప్రచార స్టైలే వేరు. చే సంచిలో ఓ చొక్కా, పంచా, కండువా వేసుకుని బయల్దేరతాడు. ఊరూరా తిరుగుతాడు. ఎక్కడ చీకటి పడితే ఆ ఊళ్లోనే ఉంటాడు. వాళ్లతోనే తింటాడు. ముచ్చట పెడతాడు. జనం ఉంటే ర్యాలీ చేస్తాడు. లేదంటే మూల మలుపు మీటింగులు పెడతాడు. ఎవర్నో పిలుస్తాడు, బండెక్కుతాడు. పక్కఊరికి పోతాడు. అట్లా ఏడు సార్లు గెలిచి 8వ సారి ఓడాడు.

ఇక్కడ సీన్ కట్ చేస్తే...

2023 అక్టోబర్ 18.. తెలంగాణ. ఓ పక్క దసరా పండగ.. మరోపక్క ఓట్ల పండగ.. రెండింటికీ ముహూర్తాలు ఖరారు. నవంబర్ 30. ఓట్ల పెద్ద పండగ. ఎక్కడెక్కడోళ్లు భాగ్యనగరం బాట పట్టారు. తెలంగాణను తల్లకిందులు చేస్తానంటోంది కాంగ్రెస్. ఆ పార్టీ అగ్రనేత, తెలంగాణ తల్లి అంటున్న సోనియమ్మ కొడుకు, కూతురు వరంగల్ వచ్చారు. కాకతీయ సామ్రాజ్య వైభవానికి గుర్తయిన రామప్ప ఆలయంలో పూజలు పునస్కారాలు చేశారు. రోడ్డు మీదకు వచ్చి జనం బాట పట్టారు.

....

ముందున్న బస్సు మీద గద్దర్ పాట మార్మోగుతోంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. తెలంగాణమా.., యంత్రమెట్లా నడుస్తు ఉందంటే.. ఓరయ్యో, ఓలమ్మో.. అనుకుంటూ అన్నా చెల్లెలు రాహుల్, ప్రియాంక జనంతో చేయి చేయి కలిపారు. కదం తొక్కారు. పాట పాడారు. డాన్స్ చేశారు. ఉండమ్మా బొట్టు పెడతా.. అంటే నుదురు వంచి బొట్టు పెట్టించుకున్నారు. బొట్టు పెట్టారు. బోనం ఎత్తారు. జై బోలో తెలంగాణ అన్నారు. బస్స్ ఎక్కారు. మైకందుకున్నారు. మీటింగ్ చెప్పారు. స్కూటర్లు ఎక్కారు. ఆటోలు నడిపారు. డొంకల్లో తిరిగారు. దొరువుల్లో కూర్చున్నారు. కొలుముల్లో కాయకష్టం చేసే కూలోళ్లతో మాటా మాటా కలిపారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. రోడ్ల పక్క చాయ్ బంకుల్లో చాయ్ తాగారు. ఇడ్లీ బండ్లపై దోశలేశారు. చీమిడి ముక్కుల్తో ఉన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు. బుడతలకు బిస్కెట్లు పంచారు. ట్రాక్టర్లపై నడిచే వాళ్లకు చేతులూపారు. చేలల్లో పని చేసే వాళ్లకు దండాలు దస్కాలు పెట్టారు. అవ్వా, తాతల భుజాలపై చేతులేసి చిందేశారు. కుర్రపిల్లలతో సెల్ఫీలకు పోజులిచ్చారు. కర పత్రాలు పంచారు. పల్లెల్లో పొద్దుపొడుపులు, మబ్బు మసకేయడాలు చూశారు.

నిజానికి కాంగ్రెస్ దొరలు ఈ తరహా ప్రచారం మరిచి చాలా ఏళ్లయింది. ఢిల్లీ పెద్దలైతే నేరుగా విమానం దిగుతారు. చేతులూపుకుంటూ.. కళ్లకు గంతలు కట్టుకుని వందిమాగదుల మధ్య నడుచుకుంటూ వెళ్లి వేదికెక్కుతారు. ఊకదంపుడు ముచ్చట చెబుతారు. చాలా ఏళ్లుగా ఇలా సాగుతోంది. చెప్పిందే చెప్పుడు.. దంచిందే దంచుడు.. వినేవాళ్ల చెవుల్లోంచి నెత్తురు కారుతున్నా పట్టించుకునే పనే ఉండదు. ఓడినా గెలిచినా పట్టింపులేని మోటు తనం వచ్చింది. ఓటమిలోనూ రాటు దేలడం అలవాటైంది. ఈలోగా పార్టీ అడుగంటింది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 29 రాష్ట్రాలు, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇదో రాజకీయ పార్టీ అని, దానికో చరిత్ర ఉందని, దానిపై ఓ సామాజిక బాధ్యత ఉందని తెలియడానికి ఇంతకాలం పట్టింది. బడా నేతల రాక్షస ఆశయాలు"కాంగ్రెస్ ను, సీనియర్ పార్టీ నాయకులను నాశనం చేశాయని కాకా లాంటి కాంగ్రెస్ వాదులు ఊరికే చెప్పలేదు. ఆ తప్పు తెలిసి ఆకాశ మార్గం పట్టిన కాంగ్రెస్ నేతల్ని భూమ్మీదకు దించడానికి రాహుల్ గాంధీ, వాళ్లమ్మ చాలా వాటిని వదులుకోవాల్సి వచ్చింది. రాహుల్ అయితే పప్పు వంటి ఎగతాళి మాటల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పార్టీని బదులు ఎన్జీవోను నడుపుకుంటే మంచిది కదా అనే ఎకసెకం కామెంట్లనీ భరాయించాల్సి వచ్చింది.

మొత్తానికి ఇంతకాలానికి రాహుల్ గాంధీ పోయిన చోటే వెతుకులాట మొదలుపెట్టాడు. పప్పు కాదు నిప్పు అన్పించుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఇవన్నీ ఎట్టున్నా.. కమ్యూనిస్టు పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కన్హయ్య కుమార్ చెప్పినట్టు.. రాహుల్ గాంధీ ఎన్నిక ప్రచార సరళిని మార్చేశాడు. ఇప్పుడందరూ తన బాటే పట్టేలా చేస్తున్నాడు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు కేటీఆర్, హరీశ్ కూడా ఊరూరా వీధి మీటింగులు, కుల సంఘాల భేటీలు, రైతు, రైతు కూలీలతో ముచ్చట్లు పెట్టమని తమ శ్రేణులకు హితవు పలికారంటే ఎంతోకొంత రాహుల్ గాంధీ ఎఫెక్ట్ లేకపోలేదు. చివర్లో ఓ మాట.. ఓనాటి కమ్యూనిస్టుల ఎన్నికల ప్రాపగాండాను, నిన్న మొన్నటి ఉండాల్కర్ కాకా ప్రచారాన్ని గుర్తుకు తెచ్చారు రాహుల్ గాంధీ. ఫలితాలెలా ఉన్నా ఆకాశ మార్గాన పయనిస్తున్న ప్రచారాన్ని భూ మార్గం పట్టించిన వారిలో రాహుల్ ఒకడని గట్టిగానే చెప్పవచ్చు.


Read More
Next Story