తగ్గేదేలే.. మళ్లీ పోటీ చేస్తా..
x

తగ్గేదేలే.. మళ్లీ పోటీ చేస్తా..

శిరీష ఓడినా తగ్గనంటున్నారు. మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తానంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేస్తారా? లేక ఎంపీగానా..


తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ పోటీచేసింది బర్రెలక్క అలియాస్‌ శిరీష. ఉద్యోగాలు లేక బర్రెలు కాసుకుంటున్నానని పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలయిన విషయం మనకు తెలిసిందే.

కొత్తగా రాజకీయాల్లోకి..

అనూహ్యంగా శిరీష రాజకీయాల్లోకి వచ్చారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఎన్నికల సంఘం ఆమెకు ఈల గుర్తు కేటాయించింది. ప్రచారం బాగానే చేసుకున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఆమెకు సపోర్టు చేశారు. ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చి మాట్లాడారు. ఎలక్షన్‌ క్యాపెయినింగ్‌లో శిరీష సోదరుడిపై దాడి జరిగింది. కోర్టును ఆశ్రయించడంతో ఆమెను ఎలక్షన్‌ కమిషన్‌ ప్రొటెక్షన్‌ కల్పించింది. ఇతర పార్టీల వారు కూడా శిరీష గట్టి పోటీ ఇస్తుందని భావించారు.

కౌంటింగ్‌ వేళ ఉత్కంఠ..

ఆమెకు ఎన్ని ఓట్లు పడిఉంటాయన్న దానిపై నియోజకవర్గంలో చర్చ జరిగింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో శిరీష ముందంజలో ఉన్నారు. ఇక పుంజుకుంటుందని అందరూ భావించారు. కాని ఈవీఎమ్‌ ఓట్ల లెక్కింపులో వెనకబడిపోయారు. తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు , మూడో రౌండో ..మొత్తం 735 ఓట్లు వచ్చాయి. రౌండ్లన్నీ పూర్తయ్యే సరికి ఆమెకు 5,742 ఓట్లు పడ్డాయి.

గెలిచిన జూపల్లి..

నియోజకర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపలి కృష్ణరావు గెలిచారు. ఆయన 29,931 ఓట్ల మెజార్టీ సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హర్షవర్దన్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు.

అసలు ఓటర్లు ఎంతమంది?..

కొల్లాపూర్‌ నియోజకవర్గంంలో మొత్తం ఓటర్లు 2.34,167. పోలైన ఓట్లు 1,87,085, ఓటేసిన పురుషులు 95,876, మహిళలు 91,209. పోలింగ్‌ శాతం 79.89.

పార్లమెంట్‌కు పోటీచేస్తా..

కౌంటింగ్‌ అనంతరం శిరీష మాట్లాడారు. ‘‘ఓడిపోయినంత మాత్రాన ఖాళీగా ఉండను. సమస్యలపై పోరాడతా. నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడతా. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’నని చెప్పారు. మరో విషయం కూడా చెప్పారు.

కాస్త రాజకీయ పరిజ్ఞానం సంపాదించి ఎంపీగా పోటీచేస్తానన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ నీడన చేరనన్నారు. ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

Read More
Next Story