ఊగుడు ఊగుడే... తాగుడు తాగుడే... ఐదేళ్లకో పండుగ... అదే ఓట్ల సంబరం
తెలంగాణలోన మద్యం అమ్మకాలు ప్రత్యేక పండుగల్లో దేశంలోనే రికార్డులను నమోదు చేస్తుకోవడం ఆనవాయితీ. ఎన్నికల సమయంలో గత 9 ఏళ్లలో ఎప్పుడూ జరగని అమ్మకాలు జరిగాయి.
ఒకవైపు ఎన్నికలు మరోవైపు ఏరులై పారిన మద్యం అమ్మకాలు
ఎన్నికల సందడిలో కొత్త పుంతలు తొక్కిన మద్యం అమ్మకాలు
ఓటరు నాడి బాగా పసిగట్టినట్టున్నారు నేతలు. ప్రజల బలహీనతే నాయకుల ఐదేళ్ల భవిష్యత్తుకు బలమైన పునాది వేసేది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో ముందే పసిగట్టిన చోటా...బడా నేతలు పడే పాట్లు చెప్పనవసరం లేదు. ఈసారి ఎన్నికల్లో అయినా సీటు సంపాధించాలన్న ఆత్రుత, తాపత్రయంలో కోట్లకు కోట్లు... కట్టలకు కట్టలు ముట్టజెప్పి ఎలాగోలా... అధిష్టానం కాళ్లుమొక్కైనా సీటు తెచ్చుకోవడం ఒక ఎత్తు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు వచ్చిందంటే చాలు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇక నానాయాతన పడాల్సిందే. ఇప్పటి వరకూ దేశ చరిత్రలో పోలింగ్ శాతం పరిశీలిస్తే... బాగా చదువుకున్న వారికంటే... నిరుపేదలే పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్న సంఘటనలు అనేకం. దీంతో నిరుపేదలు, నిరక్షరాస్యులే లక్ష్యంగా నేతలు పావులు కదపడం మొదలెడతారు. మురికివాడలు మొదలుకొని పట్టణాల్లోని గల్లీగల్లీలు కాళ్లరిగేలా తిరిగి గెలుపు గుర్రం ఎక్కడానికి ఎత్తులు వేస్తారు. అలాంటి ఎత్తుల్లోనే ఇప్పుడు తెలంగాణాలో మద్యం ప్రియుల్ని ప్రసన్నం చేసుకోవడానికి కేసులకు కేసులు... గంపగుత్తా కింద కొనుగోలు చేసి, గల్లీ లీడర్ల సహాయంతో ఓటరు గడపకు చేరవేయడం ఫ్యాషన్ అయ్యింది ఇప్పుడు. అక్టోబరు నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ప్రకటించడానికి ముందే మద్యం ప్రియులను లెక్కించి, వారికి అవసరమైన సరుకు మార్కెట్ నుండి తెప్పించుకున్న పార్టీలు కొన్నయితే. అభ్యర్థుల లెక్కతేలిన తరువాత వైన్‌షాపుల్లో ఖాతాలు, బారుల్లో బల్క్ బుకింగ్స్ మొదలైయ్యాయి. నవంబరు 30న జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రెండు నెలల్లో మద్యం అమ్మకాలు రికార్డులు నమోదు చేసుకుంది.
2022 అక్టోబరు నెలతో పోలిస్తే... 6% మద్యం విక్రయాలు పెరిగాయి. ఇక అక్టోబరు నెల్లో ఏకంగా 11 శాతానికి పైగా మద్యం అమ్మకాలుండటంతో రాష్ట్ర ఖజానాకు ఇబ్బడిముబ్బడిగా సొమ్మొచ్చి పడింది. తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రత్యేక పండుగల్లో దేశంలోనే రికార్డులను నమోదు చేస్తుకోవడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో గత 9 ఏళ్లలో ఎప్పుడూ జరగని అమ్మకాలు జరిగాయి. ఇప్పటికే మద్యం అమ్మకాలు 4% పెరిగాయి.
ముఖ్యంగా బీర్ అమ్మకాలు 13% పెరగడంతో విక్రయాలు 1,965 కోట్ల నుంచి 3500 కోట్లకు పెరిగాయి. అయితే, ఈ గణాంకాలు నవంబరు వరకు ఉన్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో (డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి) ఈ ట్రెండ్ భిన్నంగా ఉంది.
రవాణాపై ఉక్కుపాదం మోపినా.. విక్రయాలు జోరు :
మద్యం రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపడంతోపాటు మద్యం దుకాణాలపై జరిమానాలు విధిస్తున్నా, విక్రయాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలే ఏకైక కారణమా కాదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అమ్మకాలు మరింత పెరుగుతాయనే నమ్మకం ఉంది. ముఖ్యంగా సరిహద్దు కదలికల కారణంగా
అక్టోబరు 2023లో 19.5 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 13% పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 24న రోజువారీ విక్రయాలు దాదాపు 188 కోట్లకు చేరుకోగా, త్వరలో 200 కోట్లను అధిగమించవచ్చని అంచనా. మద్యం అమ్మకాలు హోరెత్తుతున్న తరుణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (T-PCC) ఎన్నికల సమయంలో ప్రచారం ముగిసాక రెండు రోజులు మద్యం అమ్మకాలను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని భారత ఎన్నికల కమిషన్ (ECI)ని కోరింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలింగ్ తేదీకి 48 గంటల ముందే మద్యం షాపులతో పాటు బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా మూతపడ్డాయి.
ఎక్కువ మంది యవ్వనస్తులే మద్యానికి అలవాటు పడుతున్నారు
తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలను పాటించడంలో ముందుంటారు. ఏ కుటుంబంలో అయినా ఇద్దరు ముగ్గురు కలుసుకున్నారంటే... దావత్ జరగాల్సిందే. దావత్ అంటూ అంతా కలిసికట్టుగా కాస్తంత మద్యం తీసుకోవడం. సహపంక్తి భోజనాలు చేయడం సర్వసాధారణం. అది పుట్టుకైనా... చావైనా.. పెళ్లైనా... మరేదైనా సరే దావత్ మాత్రం తప్పనిసరి. ఒక దసరా పండుగ వచ్చిందంటే ఏటలు తెగాల్సిదే. మందు ఏరులై పారాల్సిందే. అందుకనే తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో ఎక్కడా చీప్ లిక్కర్ అమ్మకాలు లేకుండా పూర్తిగా కట్టడి చేసిన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మద్యంపై మక్కువున్నవారి శాతం కాస్త ఎక్కువగానే ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అంచనా. పర్యాటక ప్రాంతమైన గోవాతో సమానంగా ఇక్కడ ఒక్కొక్క సందర్భంలో మద్యం విక్రయాలుంటాయని ఈ అంచనా. తెలంగాణాలో 18 ఏళ్ల నుండే బీర్లు తాగడానికి అలవాటు పడ్డ వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. 2023 మార్చి నాటికి ప్రభుత్వ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం (20 నుండి 24 ఏళ్ల వయస్సు) 17 లక్షల 04 వేల 823 మంది బాలురు ఉంటే.. బాలికలు 16 లక్షల 75వేల 709 మంది ఉన్నారు. ఇక 25 ఏళ్ల నుండి 29 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో పురుషులు 16 లక్షల 89 వేల, 207 మంది, మహిళలు 15 లక్షల 74వేల 141 మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక మద్యం అలవాటు చేసుకునే వారు ఈ వయస్సులోనే ఎక్కువ మంది ఉంటారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 30 నుండి 64 ఏళ్ల వయస్సున్న వారిలో మగవారు 68 లక్షల, 37వేల 358 మంది ఉంటే, ఆడవారు 71లక్షల, 89వేల, 714 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలినాలీ చేసుకొనే వారి కుటుంబాల్లోని ఆడవారు కూడా సందర్భానుసారంగా తక్కువ మోతాదులో మద్యం సేవింస్తారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలతో పాటు ఖజానాకు దండీగా సొమ్ము వచ్చిపడుతోంది. ఏది ఏమైనా ఏటా జరిగే మద్యం విక్రయాలతో పోలిస్తే... 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా మద్యం కొనుగోళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయంటే రాజకీయపార్టీలు ఓటర్లను మందుతో కొంటున్నారా..? అనే అనుమానం కలుగుతోంది.