మరొక్కసారీ అంటే... సారీ.. సారీ అంటున్నారా?
x
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ముఖ్యమంత్రి

మరొక్కసారీ అంటే... సారీ.. సారీ అంటున్నారా?

నేను అంతా సాధించాను... తెలుగు రాష్ట్రాల్లో నా అంత కాలం పాలించిన నాయకుడు లేరు. సొంత రాష్ట్రాన్ని సాధించాను. నా కీర్తి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. ఇంక నేను బాకీ ఉన్నది ఏంలేదు. మీ కోసమే నా ఆరాటం. తెలంగాణలో పేదరికం ఉండద్దు... 100 శాతం అక్షరాస్యత సాధించాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ అన్న మాటలు ఇవి. మాట్లాడి.. మాట్లాడకుండా తన వ్యూహలతో ప్రత్యర్థులను తల కిందులుగా చేసే కేసీఆర్ మాటల్లో ఏదో నిరాశ. బహూశా ఓటమిని ముందే ఊహించారా?


తానోకటి తలిస్తే ప్రజలు( ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు) మరొకటి తలిచినట్లు కేసీఆర్ కు అర్ధమైంది. దాంతో తన అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రాన్ని తీసి సంధించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఎన్ టీ ఆర్ ను బయటకు తీశాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకలని విమర్శించారు. తనే చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని ప్రతి సభలో ప్రజలకు గుర్తు చేస్తున్నారు.

కానీ ఎక్కడా అనుకున్న విధంగా స్పందన రావట్లేదు. అందుకే మదనపడుతున్నారా? ‘ రాజకీయంలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు తప్ప’ అన్న పాత నానుడి ఇప్పుడు మరోసారి గుర్తుకు రాకమానదు. కేసీఆర్ అంటే అహంకారి అనే మాట ప్రత్యర్థులు బాగా ప్రచారం చేశారు. ఆ మాటను చెరుపుకునే ప్రయత్నం ఒకసారి కూడా కేసీఆర్ చేయలేదు.

ఎవడేం అంటే నాకేంది అన్నట్లుండేది వ్యవహరం. ఎన్నికల సభలు, మీటింగ్ లు, పార్టీ సమావేశాలు తప్పా ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ఏం కావాలో అడగలేదు.. పెట్టింది తింటారు.. పోసింది తాగుతారు అనుకున్నారా? తను కావాలి.. కలవాలి అనుకుంటే తప్ప ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు తెరవలేదు. ఎనుకట దొరల గడీని మళ్లోసారి గుర్తుకు తెచ్చేలా చేస్తున్నావని ఎందరు చెప్పినా చెవికెక్కలేదు. ఎక్కించుకోలేదు,ఏం చేద్దాం.

అధికారం పోయే ముందు అందరూ ఇలా చేస్తారనేది అపోహ కాదని మరోసారీ గుర్తుకు తెచ్చారు. ఆ తత్వం ఇప్పుడు బోధ పడిందని ప్రసంగాల్లో తెలుస్తోంది. అందుకే సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా? ఓటమిని ఒప్పుకునే హుందాతనం కూడా కేసీఆర్ కి లేదా అనే ప్రశ్న వస్తోంది. మరోసారీ సీఎం అవుతా అంటే ఓటేస్తారా అనే ప్రశ్న కేసీఆర్ మదిలో మొలకెత్తినట్లుంది.

ఒకటా, రెండా ఎన్ని వైఫల్యాలు..తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు, నిధులు, నియామాకాలనే ట్యాగ్ లైన్. 2022 ఏప్రిల్ లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్ష డేట్లు ఎన్నిసార్లు మార్చారు. అయినా పరీక్ష పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చారా అంటే అది లేదు. రెండుసార్లు పరీక్షలు.. ఓసారీ పేపర్ లీక్, మరోసారీ హైకోర్టు రద్దు. గ్రూప్ 2 పరీక్ష తేదీ ఎన్నిసార్లు మారింది.

80 వేల పుస్తకాలు చదివినోళ్లు.... పాలిస్తే.. మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే పరిస్థితి ఏమైంది. ఎన్నిసార్లు చదవాలి, ఉద్యోగం సంగతి తరువాత అసలు పరీక్ష అయినా రాస్తామా? ఇప్పటి వరకూ రాసిన పరీక్షలు ఫలితాలు ఎప్పుడు వస్తాయి? నిరుద్యోగుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవన్నీ. తెలంగాణ వచ్చిన తరువాత ఇచ్చిన గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడూ పెట్టారు, ఫలితాలు ఎన్నడు ఇచ్చారో సార్ కి యాద్ ఉందా? తహసీల్దార్ కి సెలెక్ట్ అయిన వారికి ఎప్పుడు పోస్టింగ్ ఇచ్చారో గుర్తుందా? కానీ ఇవన్నీ జనానికి గుర్తున్నాయి.. ఇప్పుడు ఇంకా గుర్తుకు వస్తున్నాయి.

తెలంగాణ అంటేనే రైతు ఆత్మహత్యలు. వ్యవసాయం దండగ అనే మాటలు. వీటన్నింటి నడుమ కాళేశ్వరం ప్రాజెక్ట్ నే పరిష్కారంగా చూపించారు. అదే సర్వ ఔషధం అంటూ ప్రచారం చేశారు. కానీ ప్రస్తుతం అదే ఎదురు తిరిగింది. కేసీఆర్ డిజైన్ అంటూ కట్టిన ప్రాజెక్ట్ ల వల్ల వేల మంది ప్రజలు తమ గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. గౌరవెల్లి డ్యాం నిర్వాసితులు న్యాయం కావాలంటే లాఠీచార్జీ చేశారనే అపవాదు.

ఇప్పటి వరకూ మల్లన్న సాగర్ ఒక్కసారి కూడా నింపలేదు. అసలు కాళేశ్వరం బ్యారేజ్ కుంగడంతో కేసీఆర్ అధికార ఆశల సౌధం ఒక్కసారిగా ఒకవైపుకు ఒరిగింది. దాన్ని లేపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన సాధ్యం కావట్లేదు. పైగా తమ ఎన్నికల్లో ఎవరైనా ఆంధ్రనేతలు వేలు పెడితే బాగుండు అనే ప్రయత్నం ప్రసంగాల రూపంలో చేసిన ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇదే, ఈ నిరాశ ప్రసంగాలకు కారణం కావచ్చు. సర్వేలు, మీడియా మేనేజ్ మెంట్ ఎన్నికల్లో గెలిపించలేవు. ఒక వేళ కేసీఆర్ గెలిస్తే తన చరిష్మా తగ్గలేదని సగర్వంగా మళ్లీ పీఠం మీద కూర్చోవచ్చు.

Read More
Next Story