మా నాయకుడు కేసీఆర్‌
x

మా నాయకుడు కేసీఆర్‌

మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావేనని తేల్చి చెప్పింది బీఆర్‌ఎస్‌. ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని..


మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావేనని తేల్చి చెప్పింది బీఆర్‌ఎస్‌. ఓడిపోయినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది ఆ పార్టీ నాయకత్వం. కొద్దిసేపటి కిందట సమావేశమైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శనివారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు.

కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నిక..

బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు చర్చించారు. గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

Read More
Next Story