హైదరాబాద్లో 2600 పోలింగ్ బూత్లకు రాపిడో ( Rapido) ఉచిత రైడ్లు
హైదరాబాద్లో 2600 పోలింగ్ బూత్లకు రాపిడో ( Rapido) ఉచిత రైడ్లు
ఐదేళ్లకోసారి వచ్చే పండుగ... ఓట్ల పండుగ. రాజకీయ నాయకుల భవిష్యత్తును నిర్ణయించేది ఈ పండగ అయితే. సామాన్యుడి తలరాతను మార్చేది కూడా ఓట్లపండగే. ఎన్నికల్లో గెలుపోందాకా మళ్లీ ఐదేళ్లదాకా కంటికి కనిపించని నేతలంతా ఇప్పుడు ఇబ్బడిముబ్బడి హామీలతో ప్రజల ముందుకు వస్తూనే ఉంటారు. ఐదేళ్ల క్రితం నాటి హామీలన్నీ నీటిమీద రాతలే అని నాయకులు చెప్పకనే చెబుతున్నా... ఓటరు మాత్రం అవన్నీ మదిలోకి తేకుండా మళ్లీ కొత్త ఒట్టుకు ఓటు వేయడానికి సిద్ధమవుతుంటాడు. ఇక ఓట్లు దండీగా ఉన్న ఇంటివైపు నేతల కళ్లు పడతాయి. ఒక్క ఓటుతో గెలుపొందిన వారి సంఖ్య మనం రికార్డుల్లో చూడొచ్చు. ఆ ఒక్క ఓటు కోసం రంగురంగుల జెండాలేసుకొని తిరిగిన నేతలు దిక్కూమొక్కూలేని సామాన్యుడి కాళ్లకాడికి వచ్చి మరీ ఓటు కోసం పడారిని పాట్లు పడుతుంటాడు. నేతల పరిస్థితి అలా ఉంటే.. చివరి రోజు ఓటు వేసే సమయం రానే వచ్చేసింది. అప్పట్లో పల్లెల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఓటర్లకు నేతలు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసే వారు. ఎన్నకల సంఘం కఠినమైన నిబంధనలు అమలు చేస్తుండటంతో ఇప్పుడా పరిస్థితి కనుమరుగైంది. అయినా కూడా ఇప్పుడు పక్కదారిలో ఓటర్లను పోలింగ్ బూత్‌కి తరలించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఒక ప్రయోగం చేయడానికి రాపిడ్ రైడ్ తెరతీసింది. సామాన్యుడు ఇంటి నుండి పోలింగ్ బూత్‌కు పోవడానికి ఉచిత సేవలు అందించింది. మరి వీరికి పైకం ఎవరు ఇస్తారన్నది మాత్రం ఆ సంస్థ చెప్పనేలేదు. ఇదేంటో మతలబు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకని రాపిడో రైడ్ సంస్థ ఎన్నికలకు చేసిన సేవల ఫలితాలు మరో రెండు రోజుల్లో తేలనున్నాయి.
ఇక ఆ రాపిడో రైడ్ కథేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. !
"హైదరాబాద్ ఓటర్లను బ్యాలెట్ బాక్స్‌ల దగ్గరకు చేర్చేందుకు రాపిడో బైక్ టాక్సీ కెప్టెన్లు ఉచిత సేవలు అందించారు. - *వోట్ నౌ* (VOTENOW) కోడ్ నమోదు చేయడం తో రాపిడో ఓటర్లను వారి పోలింగ్ బూత్‌లకు చేర్చింది.
నవంబర్ 30 న జరిగిన తెలంగాణల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం యొక్క గుండె చప్పుడు పెరిగింది. దేశంలోని ట్రైల్‌బ్లేజింగ్ రైడ్-షేరింగ్ ప్లాట్ ఫారమ్ అయిన రాపిడో , ఒక సాహసోపేతమైన చర్యతో ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడానికి పూనుకుంది. పౌర సాధికారత యొక్క సాహసోపేత ప్రదర్శనలో, రాపిడో ఎన్నికల రోజున హైదరాబాద్‌లోని 2600 పోలింగ్ స్టేషన్‌లకు ఉచిత రైడ్‌లను అందించి, నిరుపేద ఓటర్లతో శభాష్ అనిపించుకుంది. ఓటు వేయడానికి ఎదురయ్యే రవాణా ఇబ్బందులను, అవరోధాల సంకెళ్ల నుండి రాపిడో విముక్తి చేసింది.
రాపిడో చేసిన ఈ పని గురించి ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి మాట్లాడుతూ, "భారత దేశ కీర్తి మకుటం ప్రజాస్వామ్యం, ప్రతి ఓటు ఇక్కడ అత్యంత కీలకం. ఏ ఒక్క ఓటు వృధా కాకూడదన్న ప్రయత్నంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు ఎంతో గర్విస్తున్నా.. ఓటు వేయడానికి ఎలాంటి సౌకర్యం లేదని బాధపడకుండా ఉండేలా ప్రజలు తమ ఓటు హక్కులను సద్వినియోగ పరుచుకోవడానికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. పెద్దసంఖ్యలో ఓటర్లు రాపిడో సేవలు వాడుకోవడంతో తమ వాంఛ తీరిందన్నారు. ఎన్నికల రోజున ఉచిత బైక్ రైడ్‌లను సులభతరం చేయడం ద్వారా, పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించామన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే సువర్ణావకాశం ఇది. తరతమ బేధాలు లేకుండా ప్రజలు ఒకే వరుసలో సమానంగా నిలబడి తమ ఓటు చేయడానికి కదిలివస్తుంటారు. హైదరాబాద్ అర్బన్ కథ మరింత విస్మయం కలిగించవచ్చు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అర్బన్ నియోజకవర్గాల్లో 40% నుంచి 55% వరకు మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇప్పుడా ఓటింగ్ శాతం పెరిగేందుకు మా బాధ్యత మేం నిర్వహించాం. ఎటువంటి రాజకీయపార్టీకి మేం మద్దతు ఇవ్వడం లేదు. అలాగని రైడర్ ఎవరైనా ఈ పార్టీకి, ఈ గుర్తుకు ఓటు వేయండంటూ చెప్పలేదు. అందుకు సంబంధించి ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేసి అనుకున్నట్లే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చామన్నారు. మొత్తం రాష్ట్రంలో 72% నుండి 74% వరకు అధిక ఓటింగ్ శాతం నమోదైంది.
"VOTENOW" అనే వన్-టైమ్ కోడ్‌ని నమోదు చేసి, ఓటర్లు పెద్దసంఖ్యలో రాపిడో ఉచిత సేవలు వాడుకున్నారని చెప్పారు. భాగస్వామ్యాన్ని పునః నిర్మించే ఉద్యమంలో మా సంస్థ కూడా చేరడం ఎంతో గర్వంగా ఉంది. తెలంగాణలో ముఖ్యంగా యువ వినియోగదారుల సంఖ్యను పెంచడానికి రాపిడో నిర్ధేశించింది. ఓటరు భాగస్వామ్యానికి రవాణాను ఒక కీలకమైన అంశంగా గుర్తిస్తూ, రాపిడో యొక్క ఉచిత రైడ్‌ల ఆఫర్ ఎన్నికల ప్రక్రియలో విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది, ప్రజాస్వామ్య పండుగలో ఎక్కువ మంది చురుకుగా పాల్గొనేలా చేశామని రాపిడో సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి అంటున్నారు.
మరి రాపిడో సేవలతో ఎవరికి లాభం కలిగిందో... ఏపార్టీ నేతకు నష్టం కలిగిందే చెప్పలేం కానీ, ఈ వేల సంఖ్యలో చేపట్టిన ఈ రాపిడో ఉచిత సేవలకు ఎవరు బిల్లులు చెల్లించారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలి పోయింది. ఏంటో ... ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన.. పాచిక పారిందా... గెలుపొందామా ..? అన్నదే ఇక్కడ ప్రధానం అనేది వాస్తవం.