భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయల్దేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో స్ఫష్టమైన మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సాధించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయల్దేరారు. గాంధీ భవన్ కు రావడానికంటే ముందే ఆయన ను తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ యాదవ్ కలిసి పుష్ఫగుచ్ఛం అందించారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి 32000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం గాంధీ భవన్ కు బయలుదేరారు. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలుపొందగా, మరో 61 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం పై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్పందించారు. తెలంగాణలో ఏకపక్ష విజయం సాధిస్తామని ముందే తెలుసని అన్నారు. సోనియా గాంధీకి బర్త్ డే గిప్ట్ ను తెలంగాణ ప్రజలు ఇచ్చారని చెప్పారు.
కాగా ఉత్తరాది రాష్ట్రాలైన చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందించిన సమాచారం ప్రకారం రాజస్తాన్ లో ఏకపక్షంగా బీజేపీ స్వీప్ చేసింది. 199 స్థానాలకు గాను కాషాయదళం 112 చోట్ల ఆధిక్యంలో ఉంది . అలాగే మధ్యప్రదేశ్ 230 స్థానాలకు 164 ఆధిక్యం సాధించింది.