ప్రభుత్వ ఏర్పాటు దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

ఢిల్లీకి రావాలని భట్టి విక్రమార్క్కు అధిష్టానం పిలుపు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన కేసీఆర్


ప్రభుత్వ ఏర్పాటు దిశగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
x
TPP President Revanth Reddy and CEC Members

తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో సెంటిమెంట్ త‌గ్గిందా..? లేక కేసీఆర్‌పై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిందా అని అనుమానం క‌లుగుతోంది. ప‌దేళ్ల‌పాటు తెలంగాణ ఉద్య‌మ నేత‌గా, కేసీఆర్ మాటే వేదం అన్న‌ట్లున్న తెలంగాణాలో ఉన్న‌ట్టుండి అధికార‌మార్పిడి వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌పార్టీ విజ‌యం వైపు శ‌ర‌వేగంతో దూసుకుపోతుంది. న‌వంబ‌రు 30వ తేదీన 70 శాతం పైచిలుకు పోలింగ్ న‌మోదైన త‌రువాత విజ‌యం త‌మ‌దేనంటూ కేసీఆర్‌, కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. టి.పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌టి రోజు నుండీ తెలంగాణాలో కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగ‌రేస్తామ‌ని చెప్పిన రేవంత్ మాటే ఈ ఎన్నిక‌ల్లో నెగ్గింది. సుమారు 30మందికి పైగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ అభ్య‌ర్థులు 11 మంది గెలుపొందారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు స్ప‌ష్ట‌మైన మెజార్టీ దిశ‌గా కాంగ్రెస్‌పార్టీ గెలుపొందుతున్న స‌మయంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అపాయింట్మెంట్ కోరారు. గ‌వ‌ర్న‌ర్ అపాయింట్మెంట్ ఖ‌రారైతే కేసీఆర్ ప్ర‌భుత్వం రాజీనామా స‌మ‌ర్పిస్తారు.

ఎన్నిక‌ల ముందు కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ద‌ళిత‌బంధు, రైతుబంధు ప‌థ‌కాలు ఓట్ల‌ను సాధించ‌లేక‌పోయాయి. అలాగే కాంగ్రెస్‌పార్టీ గెలిస్తే ధ‌ర‌ణి పోర్ట‌ల్ ర‌ద్దు అవుతుంద‌ని, ఎవ్వ‌రికీ ద‌ళిత‌బంధు, రైతుబంధు రాదంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన విమ‌ర్శ‌ల‌ను తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌లేద‌ని ఈ ప‌రిణామంతో తేలిపోయింది.

కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే 6 వాగ్దానాల‌ను నెర‌వేరుస్తామ‌ని రాహుల్‌, ప్రియాంక‌గాంధీ, మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డి.కే.శివ‌కుమార్‌లు ప‌దేప‌దే ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తూ వ‌చ్చారు. ఇందిర‌మ్మ ఇళ్లు, చేయూత‌, గృహ‌జ్యోతి, క‌ళ్యాణ‌మ‌స్తు, మ‌హాల‌క్ష్మి ప‌థ‌కాలు ఓట్ల పంట‌ను పండించాయి.

అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి భ‌ట్టి విక్ర‌మార్క్

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శాస‌న‌స‌భాప‌క్ష నేత భ‌ట్టివిక్ర‌మార్క్ ను వెంట‌నే ఢిల్లీకి రావాల‌ని స‌మాచారం పంపించారు. దీంతో భ‌ట్టి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన అభ్య‌ర్ధులు ఎక్కువ మంది ఓట‌మిపాలైయ్యారు.


యాదాద్రిలో కాంగ్రెస్ రికార్డు.

యాదాద్రి జిల్లా, భువనగిరి లో చరిత్ర తిరగ రాసిన కాంగ్రెస్. గ‌త 40 ఏళ్లుగా విజయం సాధించని కాంగ్రెస్ పార్టీ సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి పైళ్ళ శేఖర్ రెడ్డి పై 25,761 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనీల్ కుమార్ రెడ్డి విజయం..


సంచలన నిర్ణయం..

భద్రాచలం నుంచి గెలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఈనెల 8వ తారీఖున నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెల్లం వెంకట్రావు ప్రకటించినట్లు ప్ర‌ట‌కించి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయ‌మ‌వ‌డంతో భ‌ద్రాచ‌లం నుండి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు అనూహ్య నిర్ణ‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌ని ఆయ‌న చెప్ప‌డం కొస‌మెరుపు.

ఓడిపోయిన అభ్యర్ధులు వీరే :

వనమా వెంకటేశ్వర్ రావు-కొత్తగూడెం, సండ్ర వెంకటవీరయ్య- సత్తుపల్లి, రేగా కాంతారావు-పినపాక, హరిప్రియ నాయక్-ఇల్లందు, చిరుమర్తి లింగయ్య- నకిరేకల్, గండ్ర వెంకట రమణ రెడ్డి - భూపాల పల్లి, అశ్వారావు పేట -మెచ్చ నాగేశ్వరరావు, ఉపేందర్ రెడ్డి-పాలేరు, సురేందర్ - ఎల్లారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి-కొల్లాపూర్, పైలెట్ రోహిత్ రెడ్డి-తాండూర్.

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఓటమి

2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఆర్ఎస్‌ వెనుకంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది.

తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భువనగిరిలో కుంబం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్‌లో కుందూరు జైవీర్ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తిలో మందుల సామెల్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. అనీల్ కుమార్ రెడ్డి మినహా కొత్త అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలోకి దింపి విజయం సాధించింది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి బోల్తా పడింది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది. ఇప్పటికే 27 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే అధికార బీఆర్‌ఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించగా 26 స్థానంలో ముందంజలో ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్

తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా స్పీకర్‌గా పని చేసిన వారు ఇప్పటి వరకూ గెలిచిన పాపాన పోలేదు. తొలిసారిగా ఆ చరిత్రను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తిరగరాయబోతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రను పోచారం తిరగ రాశారు. 13 రౌండ్లలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి 1107 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి నిన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను పరీక్షిస్తే ఒకసారి స్పీకర్‌గా పని చేసిన నాయకులు తదుపరి ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన దాఖలాలే లేవు. గత తెలంగాణ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి పోటీ చేసిన అప్పటి స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక రాష్ట్ర విభజన సమయంలో స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అసలు 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా గెలిచింది లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక.. అప్పటి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ సెంటిమెంటుకు భయపడే గత స్పీకర్ మధుసూధనాచారి తన నియోజకవర్గంలో నిత్యం క్యాడర్‌తో ఉంటూ విపరీతంగా పర్యటించినా కూడా ఫలితం దక్కలేదు. మొత్తానికి పోచారం అయితే హిస్టరీని తిరగరాయబోతున్నారు.

Next Story