ఈ ఎన్నికల్లో తెలంగాణ ముస్లిం ఓటర్లు ఈ సారి ఎటువైపు?
ప్రధాన పార్టీల భవిష్యతుకే కాదు ఓటర్లకు కూడా 2023 తెలంగాణ ఎన్నికలు ముఖ్యమయనవి. ఈ ఎన్నికలు వారు ఎటువైపు ఉన్నారో కూడా నిరూపించబోతున్నాయి.
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు చాలా విధాలుగా ప్రత్యేకమయినవి. ప్రధాన పార్టీల భవిష్యత్తుకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిఆర్ ఎస్, అధికారం కోసం పోటీపడుతున్న కాంగ్రెస్, ఏదో విధంగా తాను తెలంగాణలో ఉన్నానని నిరూపించేందుకు తాపత్రయపడుతున్న బిజెపికి, ఈ ఎన్నికలు చాలా ముఖ్యమయినవి. అదే విధంగా చాలా మంది ఓటర్లకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమయనవి. ఈ ఎన్నికలు వారు ఎటువైపు ఉన్నారో నిరూపించబోతున్నాయి. ఇపుడు ముస్లిం ఓటర్ల విషయం చూద్దాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఒక బలమయిన ముస్లిం పార్టీ ఆల్ ఇండియా మజ్టిస్ ఇ ఇత్తే హదుల్ ముస్లిమీన్ (AIMIM). ఈ పార్టీ హైదరాబాద్ బయట ఎపుడూ ఒక ఎమ్మెల్యేని కూడా గెలవలేకపోయినా, రాష్ట్రంలో ముస్లింలను ప్రభావితం చేసే పార్టీగా అంతా భావిస్తారు. ఈ పార్టీనిజానికి హైదరాబాద్ పాతబస్తీ దాటి రాలేకపోతున్నది. అయితే, ముస్లిం ప్రతినిధిగా ముస్లింల పార్టీగా ప్రచారం చేసుకుని అంతో ఇంతో హైదరాబాద్ బయటి ముస్లిం వోటర్లను కూడా ప్రభావితం చేస్తుంది
కాబట్టి ఈ పార్టీ తో స్నే హానికి ప్రధాని పార్టీలు ఎపుడు తహతహ లాడుతూ ఉంటాయి. 2014 కు ముందు ఈ పార్టీకి కాంగ్రెస్ వత్తాసుపలికింది. తెలంగాణ ఏర్పడ్డాక కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ ఎస్ కు ఈ పార్టీతో మంచి అనుబంధం ఏర్పడింది. బిఆర్ ఎస్ ను ఎంఐఎం భుజానేసుకుని కెసిఆర్ దేశానికి ప్రధాని అయితే బాగుంటుంది అధినేత అసదుద్దీ ఒవైసీ చాలా సార్లు అన్నారు. ఇక కెసిఆర్ ఆ పార్టీని నొప్పించే విధంగా పల్లెత్తు మాట అనరు.
ఇపుడు తెలంగాణలో ఒక టాక్ వినబడుతూ ఉంది. అందేంటే బిఆర్ ఎస్ కు బిజెపికి లోపాయకారి ఒప్పాందం జరిగింది, రేపు ఎన్నికలయ్యాక బిఆర్ ఎస్, కాషాయపార్టీకి బాగా దగ్గరవుతుందనేది ఆ విమర్శ. దీనికి బలమయిన సాక్ష్యాలను కూడా చూపిస్తున్నాను. కెసిఆర్ కుటుంబ సభ్యుల మీద ఐటి ఇడి దాడులుజరగకపోవడం, కెసిఆర్ బిడ్ద కవితని ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టు చేయకపోవడం.. సాక్ష్యం అని చెబతారు.
బిజెపి నేతలు కూడా లోలోన దీనికి అంగీకరిస్తారు. దీనితో బిఆర్ ఎస్ బిజెపికి బి టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. అంతేకాదు, బిఆర్ ఎస్, బిజెపి, ఎంఐఎం ఒక ముఠా అని కూడా చెబుతున్నది. ఈ నేపథ్యం తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటపుడు ముస్లిం ఓటర్లు ఎటువైపు ఉంటారు?
హైదరాబాద్ లో ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న7 స్థానాల్లోనే కాకుండా తెలంగాణలో మరో 25కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు.
రాష్ట్ర జనాభాలో వారి వాటా 13 శాతం దాకా ఉంటుంది. ఉమ్మడి నల్గొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో చాలా నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలవాలన్నా ముస్లిం ల మద్దతు తప్పనిసరి. ఉదాహరణకు కరీంనగర్ లో ముస్లింలే అతి పెద్ద కమ్యూనిటీ.
2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వీరు బీఆర్‌ఎస్ కు మద్దతుగా నిలిచి గులాబీ పార్టీ పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ముస్లిం రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినా బిఆర్ ఎస్ కేవలం ముగ్గురు ముస్లింలకే సీటు ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా అట్టహాసం ముస్లిం డిక్లరేషన్ ప్రకటించింది. దానికి కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ వంటి ముస్లిం లీడర్ ఉన్నారు. బిఆర్ ఎస్ లో ముస్లిం లీడర్లు ఎవరూ తయారుకాలేదు.
పాత బస్తీ వస్తాదుగా పేరున్న ఎఐఎంఐఎం తో బీఆర్‌ఎ్‌సకు కుదిరిన స్నేహం గులాబీ పార్టీకి పెద్ద బలమయింది.
ఇటీవల బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒక్కటేనని.. బీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేననే ప్రచారం మొదలయింది. దీనిని కాంగ్రెస్ పార్టీ ముస్లింల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. బిజెపి, బిఆర్ ఎస్ రహస్య ఒప్పందం అనేది కూడా బాగా ప్రచారం అయింది. అందువల్ల ఈ పరిణామం ముస్లింల మీద చూపుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే, ఈ సారి ఎంఐఎం కూడా చిక్కుల్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పార్టీకి కి చెందిన ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు చేస్తున్నారు. ఎంఐఎం చేతిలో ఉన్న నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇస్తోంది.
అందువల్ల ముస్లింల ఓటు ఎటు మళ్లుతుందో ననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది.