బీజేపీ సీనియర్లు ఎందుకు మొహం చాటేశారు

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పెద్ద నాయకుడూ ఎందుకు పోటీ చేయడం లేదు.. మిలియన్ డాలర్ల ప్రశ్న. బీసీని ముఖ్యమంత్రి ని చేయాలనా, ఓటమి భయమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడారా..


(TELANGANA ELECTIONS)

బీజేపీ సీనియర్లు ఎందుకు మొహం చాటేశారు..

ఓటమి భయమా.. బీసీ తంత్రమా..

(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)

గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటే ఇదేనా! ఎలాగూ గెలవని దానికి పోటీ చేయడం ఎందుకనుకున్నారా? అదే అయితే మోదీ మొదలు షా వరకు ఈ షో ఏమిటీ? ఇదేమైనా వ్యూహమా! బలమా లేక బలహీనతా! ! తెలంగాణ ఎన్నికల్లో ఒక్క పెద్ద నాయకుడూ ఎందుకు పోటీ చేయడం లేదు.. మిలియన్ డాలర్ల ప్రశ్న.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీల మహామహులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి నుంచి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి, సీపీఐ నేత కూనంనేని కొత్తగూడెం నుంచి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి.. ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడోచోట నుంచి పోటీ చేస్తుంటే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ఎక్కడా పోటీ చేయడం లేదు. ఆయనే కాదు బీజేపీ సీనియర్లుగా ఉన్న రాష్ట్రనేతలందరూ పోటీకి దూరంగానే ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని తెర పైకి తెచ్చారు. దీని వెనకున్న మతలబు ఏమిటో తేలాల్సి ఉంది.

పోటీకి దూరంగా పెద్ద నేతలు...

బీజేపీ తెలంగాణ అగ్రనేతలు ఎన్నికల బరిలోకి దిగలేదు. పోటీకి దూరంగానే ఉన్నారు. ఈ తీరు పార్టీ జాతీయ నేతల్నీ ఇరకాటంలో పడేసింది. కింది కార్యకర్తల్నీ, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకైనా పెద్ద నాయకుల్ని పోటీకి పెడుతుంటారు. అలాంటిది ఇక్కడ ఉల్టా పుల్టా అయింది. ఈ నాయకుల "వ్యూహాత్మక తిరోగమనం" అర్థమేమిటో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు.

తెలంగాణ నేతల్లో చాలామందికి బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నాయి. సీనియర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లందరూ తప్పనిసరిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని గతంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. కారణాలేంటో తెలియదు గాని తెలంగాణలోఆ నిర్ణయాలేవీ అమలు కాలేదు. కొందరు ఎన్నికలను ఎదుర్కోవటానికి భయపడుతున్నారు, మరికొందరికేమో గెలుపు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ అగ్ర నాయకుడొకరు చెప్పారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనకు ఇచ్చిన ఐదారు సీట్లు తప్ప మిగతా నియోజకవర్గాలన్నింటికీ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ముగ్గురు లోక్‌సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ (కరీంనగర్ అసెంబ్లీ), ధర్మపురి అరవింద్ (కోరుట్ల), సోయం బాపురావు (బోథ్ ఎస్టీ), ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్) రఘునందన్ రావు (దుబ్బాక), టి.రాజా సింగ్ (గోషామహల్)ను రంగంలోకి దించారు.

బీజేపీ రాష్ట్ర చీఫ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ విభాగం చీఫ్ కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఇంఛార్జ్‌ ఎంపీ మురళీధర్‌రావు, జితేందర్‌ రెడ్డి లాంటి వాళ్ల జాబితాలో లేవు. విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్లు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. మరో సీనియర్ నేత ఎన్.రామచంద్రరావుకు చివరి నిమిషంలో మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చారు. ఇంకో సీనియర్ నేత జితేందర్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది (ఈ కథనం రాసే సమయానికి).

ఎందుకీ పరిస్థితి...

అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చేంత వరకు ఓ రేంజ్ లో ఉన్న బీజేపీ గ్రాఫ్ ఆ తర్వాత ఢమాల్ అంది. గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేననే నినాదం ఊపందుకుంది. పార్టీ నేతలు కూడా ఆ అనుమానాల్ని పారదోలే పని చేయలేదు. పార్టీలోని పాత, కొత్త తరం నేతలు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఏ విషయం మీద స్పష్టత లేకపోయింది. ఎన్నికల ఖర్చు ఉండనే ఉంది. గెలిచే అవకాశం లేనప్పుడు పోటీకి దూరంగా ఉండి ప్రచారం చేయడమే ప్రధానమన్నది సీనియర్ల మనసులోని మాటగా చెబుతున్నారు. “ఎన్నిక ఏదైనా పెద్ద మొత్తంలోనే డబ్బు కావాలి. నియోజకవర్గాల క్యాటగిరీలను బట్టి అంటే గెలిచే అవకాశాల్ని బట్టి పార్టీ ఎన్నికల ఫండ్ ఇస్తుంది. ఏ క్యాటగిరీకి ఇంత, బీ కి ఇంత, సీ కి ఇంతని నిధులు వస్తాయి. అవి ఎంతన్నది చివరి నిమిషం వరకు తేలకపోవడమే సీనియర్లు పోటీకి దూరంగా ఉండడానికి కారణం’’ అని బీజేపీలోని ఓ కీలక కార్యకర్త అన్నారు.

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గ టిక్కెట్ ను బీజేపీ నాయకత్వం.. డీకే అరుణకు ఇచ్చింది. అయితే ఆమె పోటీ చేయనని తేల్చి చెప్పింది. గద్వాల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలుకుబడి ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె టికెట్ ను ఎందుకు వద్దందో పార్టీ నేతలకు సైతం అంతుబట్టలేదు. ఆమె సోదరుడు అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అని, అందుకే ఆమె పోటీకి దూరంగా ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఆమె బంధువులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కడం కూడా ఓ కారణమై ఉండవచ్చునని బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. అయితే ఆమె వాటన్నింటినీ కొట్టిపారేశారు. బీజేపీలో ఉంటానని ప్రమాణం చేశారు.

మురళీధర రావుదీ అదే తీరు...

బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి పొలసాని మురళీధర్ రావును మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అధిష్టానం కోరింది. అయితే ఆయన అందుకు ఇష్టపడలేదు. తాను కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతానని కేంద్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు. తనను అడక్కముందే మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత ఎన్.రామచందర్ రావు మర్యాదపూర్వకంగా ‘నో’ చెప్పారు. అయితే చివరి నిమిషంలో ఆయన్నే మల్కాజిగిరిలో పోటీకి దింపాల్సివచ్చింది. మల్కాజిగిరిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు ఇద్దరూ బలమైన వారే. ఈ పరిస్థితుల్లో అక్కడ పోటీ చేయడం వృధా ప్రయాసని, డబ్బు ఖర్చు తప్ప ఫలితం ఉండదని మురళీధర రావు, రామచంద్రరావు వాదించినట్టు సమాచారం. మరి అలాంటప్పుడు మళ్లీ టికెట్ ఎలా తీసుకున్నారని ఎన్.రామచంద్రరావును అడిగినప్పుడు పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని, తాను నిబద్ధతకలిగిన బీజేపీ కార్యకర్తనని వివరణ ఇచ్చారు.

కిషన్ రెడ్డికి కారణం ఇదట!

కిషన్ రెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రచారానికి నాయకత్వం వహించాలనే కారణంతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తాను పోటీ చేస్తూ వస్తున్న అంబర్ పేట సీటును స్టాంపుల కుంభకోణంలో చిక్కుకుని బయటికి వచ్చిన కృష్ణయాదవ్ కి ఇప్పించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. కిషన్ రెడ్డి ఓబీసీ వర్గానికి చెందిన నేత. ఆయన పోటీలో ఉంటే తప్పుడు సంకేతం ఇచ్చినట్టవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో పార్లమెంటేరియన్ సుదీర్ఘ పదవీ కాలాన్ని పేర్కొంటూ తన అశక్తతను వ్యక్తం చేశారు. బీజేపీ గెలిస్తే అటు ఈటల రాజేందరో, ఇటు బండి సంజయో ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం జరుగుతున్నా అసలు కమలం గెలవాలి కదా ముందు అన్నది పార్టీ కురువృద్ధుడొకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇదేదో తేలాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.


Read More
Next Story