రాజకీయాల నుంచి తప్పుకున్న వీకే పాండియన్
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌కు నమ్మిన బంటుగా ఉన్న పాండియన్ ఎందుకు రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. చివరకు ఆయన ఏం చెప్పారు?
ఐఏఎస్ మాజీ అధికారి, బిజు జనతాదళ్ (BJD) చీఫ్ నవీన్ పట్నాయక్ ముఖ్య సహాయకుడు VK పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో BJD ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
హోరా పరాజయం..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 147 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (బిజెపి) 78 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతె పట్నాయక్ 24 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసింది. బిజెడి కేవలం 51 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ 14 స్థానాలను కైవసం చేసుకోగా, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.
లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలకు 20 స్థానాలను బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ 1 స్థానంతో సరిపెట్టుకుంది. బీజేడీ ఘోర పరాజయం పాలైంది.
అధికారం దాహం లేదు...
‘‘నేనొక సామాన్య కుటుంబంలో జన్మించాను. ఐఎఎస్ అయి ప్రజలకు సేవ చేయాలన్నది నా చిన్ననాటి కల. ఒడిశా గడ్డపై అడుగు పెట్టిన రోజు నుండి నాకు ఒడిశావాసుల నుండి అపారమైన ప్రేమ ఆప్యాయత లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాను.’’ అని పేర్కొన్నారు. ఇంకా తన గురువు పట్నాయక్‌ను ప్రశంసిస్తూ.. నా గురువు నవీన్‌కు సహాయం చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా. అంతేతప్ప నేను రాజకీయ పదవిని కోరుకోలేదు. నా గురువు నవీన్ పట్నాయక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన అనుభవాలు నాకెంతో ఉపయోగపడతాయి.’’ అని వీడియో భావోద్వేగంగా మాట్లాడారు.
ఎవరీ పాండియన్..
2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ తమిళనాడు వాసి. కొంతకాలం పాటు ఒడిశాలో విధులు నిర్వహించారు. 2019 ఎన్నికల ముందు నుంచి నవీన్‌కు నమ్మకమైన అధికారిగా పనిచేశారు. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఒడిశా ప్రభుత్వం ఆయన్ను 5టీ, నవీన్ ఒడిశా అధ్యక్షుడిగా నియమించింది. క్యాబినెట్ హోదా కల్పిస్తూ సాధారణ పాలనా విభాగం ఉత్వర్వులు జారీ చేసింది. తెర వెనక ఉంటూ పాలనలో, బీజేడీలో కీలక వ్యక్తిగా మారారు.
అంతకుముందు పదవీ విరమణ చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పాండియన్‌ను ఇలా సమర్థించారు. "మిస్టర్ పాండియన్‌పై కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇది దురదృష్టకరం" అని పేర్కొన్నారు.