మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం..
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ప్రధాని కావడం వరుసగా ఇదో మూడో సారి. గతంలో కూడా ఒకరు వరుసగా మూడుసార్లు పీఎం అయ్యారు. ఆయన ఎవరంటే..
నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా ఆయన పీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడో సారి. ఇది ఒక రికార్డు. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా వరుసగా మూడు సార్లు ఆ పదవిలో కొనసాగలేదు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ మాత్రమే వరుసగా 1952, 1957, 1962 లో మూడుసార్లు ప్రధాని కాగలిగారు. ఆ ఘనతను 73 ఏళ్ల మోదీ సమం చేశారు.
బీజేపీ గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో రెండు సార్లు అత్యధిక స్థానాలు సంపాదించింది. దశాబ్దకాలం పాటు పాలన కొనసాగించింది. కాని ఈ సారి బీజేపీకి కేవలం 240 స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు. పార్లమెంట్‌లో మెజారిటీ మార్క్ 272. దాంతో ఈ సారి పొత్తు అనివార్యమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇటు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌తో జతకట్టి అధికారంలోకి రాబోతున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు?
సాయంత్రం 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారతదేశం పొరుగు దేశాధి నేతలు, వివిధ దేశాల నుంచి ప్రధానులు, ప్రముఖులు హాజరుకానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ', భూటాన్ ప్రధానమంత్రి టోబ్గే హాజరుకానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే న్యూఢిల్లీ చేరుకున్నారు.
వివిధ రంగాలకు చెందిన వారిని కూడా ఆహ్వానించారు. భారతీయ రైల్వేల 10 మంది లోకో పైలట్లకు ఆహ్వానాలు అందాయి. ఇందులో మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-సోలాపూర్ వందే భారత్ రైలు పైలట్ సురేఖ యాదవ్ కూడా ఉన్నారు.
భారీ బందోబస్తు..
రాష్ట్రపతి భవన్ వద్ద ఇప్పటికే మూడంచెల భద్రత కొనసాగుతోంది. జూన్ 9 మరియు 10 తేదీల్లో ఢిల్లీని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.
అతిథులు బస చేసే వివిధ హోటళ్ల వద్ద భద్రత పెంచారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కుర్చీలు, రెడ్ కార్పెట్ ఇతర సామాగ్రికి సిద్ధం చేశారు.
విపక్ష నేతలకు అందని ఆహ్వానం..
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలకు ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానం ఇంకా అందలేదని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. "మాకు ఎటువంటి ఆహ్వానం రాలేదు లేదా మేము హాజరుకావడం లేదు" అని బెనర్జీ కోల్‌కతాలో చెప్పారు.