మహారాష్ట్రలో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..
99 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎప్పటిలాగే నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్‌లో 99 మంది పేర్లను ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎప్పటిలాగే నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ (నైరుతి) స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. వాండ్రే వెస్ట్ నుంచి ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ సెలార్, సీనియర్ పార్టీ నాయకుడు, లోక్‌సభ ఎంపీ నారాయణ్ రాణే కుమారుడు నితీష్ రాణే ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కన్కావ్లీ నుంచి పోటీ చేయనున్నారు. జామ్నర్ స్థానం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరీష్ మహాజన్, బల్లార్‌పూర్ నుంచి సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్, మలబార్ హిల్ నుంచి పర్యాటక మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, కొలాబా నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, సతారా నుంచి ఛత్రపతి శివేంద్ర రాజే భోసలేను పార్టీ బరిలోకి దింపింది. కమ్తీ నుంచి మహారాష్ట్ర యూనిట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, కోత్రుడ్ నుంచి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, భోకర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ తలపడతారు.
BJP releases first list of 99 candidates for Maharashtra assembly polls, fields Deputy Chief Minister Devendra Fadnavis from Nagpur South West. (n/1)#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/PrMMrw5ir7
— Press Trust of India (@PTI_News) October 20, 2024
ఎవరికి ఎన్ని సీట్లు..
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యులు 288. ప్రస్తుత శాసనసభలో 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. అయితే 150-155 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు అంచనా. మహాయుతి కూటమి భాగస్వామి శివసేన (షిండే) గరిష్టంగా 85-90 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 45 - 50 స్థానాల్లో పోటీ చేస్తుందని సమాచారం.
ప్రతిపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు..
గత కొన్ని రోజులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లతో చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మహాయుతి కూటమి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష ఎంవీఏ కూటమిలో సీట్ల సర్దుబాటులో ఇంకా కొలిక్కిరాలేదు. 260 సీట్లపై క్లారిటీ వచ్చినా .. మిగిలిన 28 సీట్లపై చర్చలు జరుగుతున్నాయి.