జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే యూసీసీ అమలు: అమిత్ షా
x

జార్ఖండ్‌లో అధికారంలోకి వస్తే యూసీసీ అమలు: అమిత్ షా

జార్ఖండ్ రాష్ట్రంలోని 81 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.


జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసీసీ)ని ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీలో ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలను ఆయన ప్రకటించారు.

"యుసీసీ గిరిజన హక్కులు, సంస్కృతిపై ప్రభావం చూపుతుందని జెఎంఎం ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. గిరిజనులకు మినహాయింపు ఇస్తూ మా ప్రభుత్వం యూసీసీని ప్రవేశపెడతాం.

బీజేపీ వాగ్దానాలివి..

"జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సర్నా మతపరమైన కోడ్ సమస్యపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. పరిశ్రమలు, గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజల పునరావాసం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తాం. 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తా్ం. పేపర్ లీకేజీలపై సీబీఐ, సిట్‌తో విచారణ జరిపించి దోషులను శిక్షిస్తాం’’ అని చెప్పారు.

అక్రమ వలసదారులు

జార్ఖండ్‌లో చొరబాటుదారుల నుంచి భూమిని వెనక్కి తీసుకునేలా, అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించేందుకు బీజేపీ చట్టాన్ని తీసుకువస్తుందని హోంమంత్రి చెప్పారు. జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అక్రమ వలసదారుల నుంచి ముప్పు పొంచి ఉందని, స్థానిక ప్రజలకు బీజేపీ భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా జార్ఖండ్‌కు పేరు ఉందన్నారు.

షా శనివారం రాత్రి రాంచీకి చేరుకున్నారు. ఘట్‌శిలా, బర్కతా, సిమారియా అసెంబ్లీ నియోజకవర్గాలలో మూడు ర్యాలీలలో షా ప్రసంగించాల్సి ఉంది. రాష్ట్రంలోని 81 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More
Next Story