డీమోనిటైజేషన్, జీఎస్టీ 'రైతులు, కూలీలను చంపే ఆయుధాలు': రాహుల్
ద్వేష పూరిత బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలకు, ప్రేమపూరిత ఇండియా కూటమికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలలో ఓటర్లు విజ్ఞతతో తీర్పు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానాలు దేశంలోని రైతులు, కూలీలు, పేదలను చంపే ఆయుధాలని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్పూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..ద్వేష పూరిత బిజెపి-ఆర్ఎస్ఎస్ విధానాలకు, ప్రేమపూరిత ఇండియా కూటమికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలలో ఓటర్లు విజ్ఞతతో తీర్పు ఇవ్వాలని కోరారు. జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలు హింస, ఐక్యత మధ్య యుద్ధంగా అభివర్ణించారు రాహుల్. దేశంలో నిరుద్యోగం పెరిగిపోడానికి మోదీ విధానాలే కారణమని ఆరోపించారు. దేశాన్ని కులం, మతం, భాష ఆధారంగా విభజించేందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్ పనిచేస్తుంటే.. బీజేపీ-ఆర్ఎస్ఎస్లు దానిని ధ్వంసం చేసేందుకు పనిచేస్తున్నాయన్నారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు ప్రధాని మోదీ నిధులు ఇస్తున్నారని, మోదీని ఓడించి ప్రజా సంక్షేమానికి పాటుపడతామని కోరారు. ముస్లింల "అజాన్" సమయంలో రాహుల్ తన ప్రసంగాన్ని రెండు నిముషాల పాటు ఆపేశారు.