సైకిల్ రిపేరి షాపు నుంచి కేంద్ర మంత్రిగా..
x

సైకిల్ రిపేరి షాపు నుంచి కేంద్ర మంత్రిగా..

ఆయన సాధారణ కుటుంబం నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు. క్యాబినెట్ మంత్రి అయ్యాక కూడా ప్రయాణం చేసేటప్పుడు ఇప్పటికీ తన బట్టలు తానే ఉతుకుంటారు. ఆయనే..


ఆయన బీజేపీ నుంచి వరుసగా 8 సార్లు గెలిచిన ఎంపీ. 1996 నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సీనియర్ ఎంపీలలో ఈయన ఒకరు. స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని సాగర్. సొంత సైకిల్ రిపేర్ షాపులో తన తండ్రికి సాయపడేవారు. ఇప్పుడు ఏకంగా నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రి పదవి అందుకున్నారు. ఆయనే వీరేంద్ర కుమార్.

71 ఏళ్ల వీరేంద్ర కుమార్ ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తికమ్‌గఢ్ (SC) నియోజక వర్గం స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 2017లో మోదీ ప్రభుత్వంలో మొదటిసారి కేంద్ర సహాయ మంత్రిగా, 2019లో లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు.

ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వీరేంద్ర కుమార్ ఎప్పుడూ తన గతాన్నిమరువలేదు. ఇప్పటికీ కుమార్ స్వగ్రామం సాగర్, తన నియోజకవర్గం టికమ్‌ఘర్‌కు వెళ్లినపుడు.. సాధారణ టీ దుకాణంలో టీ తాగుతూ జనం సమస్యలను తెలుసుకుంటారు. అందుకే ఆయనకు 'సామాన్యుల నాయకుడు'గా పిలుస్తారని తన స్నేహితులు, తోటి బిజెపి నాయకులు చెబుతున్నారు.

మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ తాను "సాధారణ కుటుంబం" నుంచి వచ్చానని, తనది ఇప్పటికీ సాధారణం జీవనశైలి అని పేర్కొన్నారు. ఇప్పుడు మంత్రి అయ్యాక కూడా ప్రయాణం చేసేటప్పుడు తన బట్టలు తానే ఉతుకుంటానని చెప్పారు.

పదవులు ముఖ్యం కాదని, జనం సమస్యలను తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, వారికి అండగా నిలవడం ముఖ్యమని పేర్కొన్నారు వీరేంద్ర కుమార్.

వీరేంద్ర కుమార్ ఈసారి 4 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. గతంలో ఏడు సార్లు వచ్చిన మెజార్టీ కంటే ఇది ఎక్కువ.

రాజకీయ ప్రయాణం..

డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి కుమార్ ఆర్థికశాస్త్రంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వీరేంద్ర ఛైల్డ్ లేబర్‌లో పిహెచ్‌డి కూడా చేసారు.

బాల్యం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉండడం వల్ల 1977లో సాగర్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కన్వీనర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతకుముందు 1975లో లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ప్రారంభించిన 'సంపూర్ణ క్రాంతి ఆందోళన్‌' ఉద్యమంలో పాల్గొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 16 నెలల పాటు జైలుకు వెళ్లారు.

1996లో మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి మధ్యప్రదేశ్‌లోని సాగర్‌, తికమ్‌గఢ్ (SC) నియోజకవర్గాల నుంచి ఎనిమిది సార్లు వరుసగా గెలుపొందారు.

సెప్టెంబరు 2017లో మొదటిసారి మోదీ ప్రభుత్వంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత 2021లో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖకు మంత్రిగా పనిచేశారు.


Read More
Next Story