సందిగ్ధంలో రాహుల్
x

సందిగ్ధంలో రాహుల్

గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకదాన్ని రాహుల్ వదులుకోవాల్సిందే. దేని వదులుకుంటారన్న దానిపై కాంగ్రెస్ అధినేత క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన ఏమన్నారంటే..


వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఉత్తర కేరళ జిల్లా మలప్పురంలో బుధవారం (జూన్ 12) రోడ్ షో నిర్వహించారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. వయనాడ్ నియోజకవర్గంలో భాగమైన ఎడవన్న వద్ద వేలాది మంది యుడిఎఫ్ కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు.

మలప్పురంలో రాహుల్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను డైలమాలో ఉన్నా. రాయ్‌బరేలీ లేదా వాయనాడ్‌.. రెంటిలో దేన్నివదులుకోవాలి అని.. ఎందుకంటే నేను ఒక్క సీటు నుంచి మాత్రమే పార్లమెంటులో ప్రాతినిథ్యం వహించగలను. నరేంద్ర మోదీలాగా నాకు దేవుడి మార్గదర్శకత్వం లేదు. తాను జీవ సంబంధమైన జీవిని కాదని, దేవుడు తనతో పనులు చేయిస్తున్నాడని మోదీ పేర్కొన్నారు. కాని నాకు పేద ప్రజలే దేవుడు. వాయనాడ్ ప్రజలే దేవుళ్లు. నేను మీకు హామీ ఇస్తున్నా. నేను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడానికి ఏ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా.. ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా’ అని పేర్కొన్నారు.

రెండు స్థానాల్లో దేన్ని వదులుకుంటారన్న దానిపై కాంగ్రెస్ ఎంపీ నేరుగా వ్యాఖ్యానించలేదు. మంగళవారం రాయ్‌బరేలీలో కూడా ఇదే రకంగా మాట్లాడారు. తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడానికి ఏ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా.. ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు.

రాహుల్ గెలిచిందెవరిపై...

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో (వాయనాడ్‌, రాయ్‌బరేలీ) గెలుపొందారు. ఇందులో ఏదో ఒకదాని నుంచే మాత్రమే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రెండు స్థానాల్లో దేనికి ప్రాతినిధ్యం వహించాలనేది మూడు, నాలుగు రోజుల్లో రాహుల్ నిర్ణయించుకోనున్నారు.

కాంగ్రెస్ మాజీ చీఫ్ కేరళలోని వయనాడ్ నుంచి రెండవసారి ఎన్నికయ్యారు. రాహుల్ 6,47,445 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి సీపీఐకి చెందిన అన్నీ రాజా గెలుపొందారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో రాహుల్‌కు 6,87,649 ఓట్లు రాగా, అతని సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్ 2,97,619 ఓట్లు సాధించారు. రాహుల్ తల్లి, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీ తన స్థానాన్ని ఖాళీ చేయడంతో రాయ్‌బరేలీ నుండి పోటీ చేశారు. ఆరోగ్య కారణాల వల్ల ఫిబ్రవరిలో రాజ్యసభకు సోనియా ఎన్నికయిన విషయం తెలిసిందే.

2019 సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధీ యుపిలోని అమేథీతో పాటు వాయనాడ్ నుండి పోటీ చేశారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో అమేథీలో బిజెపికి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు.

Read More
Next Story