మహారాష్ట్రలో బీజేపీ హర్యానా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అమలు చేసిందా?
x
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్రలో బీజేపీ హర్యానా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని అమలు చేసిందా?

ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్, బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ కలిసి దాదాపు వంద బహిరంగ సభలు నిర్వహించగా.. ప్రధాని మోదీ 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.


మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఈసారి కొత్త వ్యూహం అనుసరించింది. ప్రముఖ రాష్ట్ర నాయకులు నాయకత్వం వహించిన ఎన్నికల ప్రచార సభలకు జాతీయ స్థాయి నాయకులు హాజరై ప్రసంగించారు. రేపు ఎన్నికలు జరగనుండడంతో నిన్న ప్రచారానికి తెరపడింది.

ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే, ప్రముఖ OBC నాయకుడు కలిసి దాదాపు వంద బహిరంగ సభలు నిర్వహించగా.. ప్రధాని మోదీ కేవలం 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

మహారాష్ట్రలోని ప్రముఖ నాయకులలో ఒకరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విదర్భ ప్రాంతంలో పర్యటించారు. ఆయన సుమారు 20కి పైగా సభలలో ప్రసంగించారు. మోదీ కూడా ఇక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి రాష్ట్రంలో దాదాపు 50 సభల్లో పాల్గొన్నారు.

స్టార్ క్యాంపెయినర్ మాత్రం మోదీనే..

“ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్. అయితే ఎన్నికల ప్రచార బాధ్యత రాష్ట్ర నేతలపైనే ఉండడంతో వారు సాధ్యమయినన్ని బహిరంగ సభలు నిర్వహించారు. ఫడ్నవీస్ గరిష్ట సంఖ్యలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు.” అని ముంబైలోని బీజేపీ సీనియర్ లీడర్ ది ఫెడరల్‌తో అన్నారు.

హర్యానా ప్రచార వ్యూహమే మహారాష్ట్రలో..

హర్యానా ఎన్నికలలో కూడా ఇదే ప్రచార వ్యూహాన్ని ఉపయోగించారని సమాచారం. అక్కడ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోదీ దాదాపు ఆరు బహిరంగ సభలను మాత్రమే నిర్వహించారు. విస్రృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది మాత్రం ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.

“మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల వ్యూహంలో ఖచ్చితమైన మార్పు కనిపిస్తుంది. ప్రధాని మోదీ వంటి సీనియర్ నేతలు ప్రచారానికి వేగాన్ని నిర్దేశించగా.. ఫడ్నవీస్, బవాన్‌కులే నాయకత్వం వహించారు. విదర్భలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని నితిన్ గడ్కరీని రంగంలోకి దించారు” అని నాగ్‌పూర్‌కు చెందిన రచయిత, ఆర్‌ఎస్‌ఎస్ పరిశీలకుడు దిలీప్ దేవధర్ ది ఫెడరల్‌తో అన్నారు.

రెండు పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకం..

హర్యానా ఎన్నికల తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌కి ప్రతిష్టాత్మకంగా మారాయి. RSS ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించి ఇంటింటి ప్రచారంతో పాటు రాష్ట్రంలో 50 వేల కంటే ఎక్కువ సభలను నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికలు, హర్యానా ఎన్నికలలో అమలు చేసిన వ్యూహాన్ని మహారాష్ట్రలో కాషాయ నేతలు అమలు చేస్తున్నారు. మహిళలు, యువత, దళితులు, రైతులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నేరుగా ప్రచారం చేయరు..

“సంఘ్ పరివార్ - ఇది వివిధ సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం గల వ్యక్తుల సమూహం. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర, జాతీయ సమస్యలపై వీరు దృష్టి సారిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు నేరుగా ప్రచారం చేయరు. కాని ప్రచారం వ్యూహాన్ని నిర్దేశిస్తారు. మహారాష్ట్ర ఎన్నికలలో ఆర్‌ఎస్‌ఎస్, దాని 32 అనుబంధ సంస్థలు బీజేపీకి మద్దతుగా నిలిచాయి. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తక్కువ స్థానాలు పొందిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు బీజేపీకి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఇంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రచారం కనిపించింది.” అని దేవధర్ తెలిపారు.

ఇక పండుగల నిర్వహణ..

గణేష్ చతుర్థి, దీపావళి, కోజాగిరి వంటి పండుగలను సంఘ్ పరివార్ రాష్ట్రంలో భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా హిందువుల సామూహిక అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఒక రకంగా హిందువుల ఓట్లు పొందేందుకు వాడే స్ట్రాటజీ. ఈ సారి మహారాష్ట్రలో జరిగే ఎన్నికలు ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం అని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే 2025లో ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటుంది కనక.

“మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్ అత్యంత బలమైనది. ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించింది కూడా ఇక్కడే. వచ్చే ఏడాది RSS శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది. అందుకు ఈ ఎన్నికలు వారికి కీలకం. మహారాష్ట్రలో బీజేపీ విజయానికి సంఘ్ పరివార్ మద్దతు చాలా అవసరమని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా పేర్కొన్నారు.

Read More
Next Story