ఢిల్లీవాసులకు కేజ్రీవాల్ వినతి..
x

ఢిల్లీవాసులకు కేజ్రీవాల్ వినతి..

మనీ ల్యాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి జైలుకు వెళ్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ ప్రజలను ఏమని కోరారు.


తాను అకస్మాత్తుగా బరువు తగ్గానని, వైద్యుల సూచన మేరకు కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ‘‘ఈ సారి నన్ను ఎంతకాలం జైలులో ఉంచుతారో నాకు తెలియదు. అనారోగ్యంతో బాధపడుతున్న నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి’’ అని ఢిల్లీ ప్రజలను కోరారు.

మద్యం కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం ఆయన అభ్యర్థన మేరకు సుప్రీం కోర్టు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1తో ఆ గడువు పూర్తవుతుంది. 2న తిరిగి కేజ్రీవాల్ తీహార్ జైలుకు తిరిగి వెళ్లాల్సి ఉంది.

ప్రజల కోసం జైలుకెళ్లడం గర్వంగా ఉంది..

“దేశాన్ని నియంతృత్వ పాలన నుంచి కాపాడేందుకు జైలుకు వెళ్లడం గర్వంగా ఉంది. నన్ను అనేక రకాలుగా దెబ్బతీయాలని చూస్తున్నారు. చాలా కేసుల్లో ఇరికించాలని చూశారు. కానీ ఫలించలేదు. జైల్లోనూ అనేక రకాలుగా హింసించారు. నాకు మందులు ఇవ్వడం ఆపేశారు. అసలు వారికి ఏం కావాలో నాకు తెలియదు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలియదు?" అని ఢిల్లీ సీఎం అన్నారు.

జైలులో బరువు తగ్గా..

జైలుకు వెళ్లినప్పటి నుంచి బరువు తగ్గానని కేజ్రీవాల్ చెప్పారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి బరువు పెరగలేదన్నారు. ‘‘జైలుకు వెళ్లినప్పుడు నా బరువు 70 కేజీలు.ఈరోజు 64 కేజీలు. బెయిల్‌పై బయటికి వచ్చాక కూడా నేను బరువు పెరగ లేదు.ఇది తీవ్రమైన జబ్బుకు సంకేతం. చాలా పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు’’ అని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.

అకస్మాత్తుగా బరువు తగ్గడం క్యాన్సర్‌కు సంకేతమని చెప్పిన కేజ్రీవాల్.. జైలు లోపల నుంచి కూడా ప్రజల కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు.

"ఈసారి వారు నన్ను మరింత హింసించే అవకాశం ఉంది. నేను లోపల ఉన్నా.. బయట ఉన్నా.. ఢిల్లీ ప్రజల కోసం పనిచేస్తా" అని ప్రకటించారు.

రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ గురువారం ఢిల్లీలోని కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

Read More
Next Story