‘కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ చీఫ్ సురేంద్రనే కారణం’
x
సందీప్ జి వారియర్

‘కాంగ్రెస్‌లో చేరడానికి బీజేపీ చీఫ్ సురేంద్రనే కారణం’

కల్పాతి రథోత్సవం ఉత్సవం కారణంగా నవంబర్ 13 జరగాల్సిన పాలక్కాడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీని నవంబర్ 20వ తేదీకి ఎన్నికల సంఘం వాయిదా వేసింది


కేరళలో ఉప ఎన్నికకు రోజులు సమీపిస్తున్న వేళ అనుకోని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాలక్కాడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 20వ తేదీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. కేరళ బీజేపీ అసమ్మతి నాయకుడు సందీప్ జి వారియర్ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కేపీసీసీ చీఫ్‌ కే సుధాకరన్‌, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సందీప్‌ విలేఖరులతో మాట్లాడుతూ..‘‘తన నిష్క్రమణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రనే కారణమని ఆరోపించారు. కరువనూరు సహకార బ్యాంకు కుంభకోణాన్ని వ్యతిరేకించినందుకే తనను దూరం పెట్టారని పేర్కొన్నారు. ఉపఎన్నిక ప్రచారంలోనూ అవమానించారంటూ బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్ తరుపున ప్రచారానికి రానని వారియర్ తన నిర్ణయాన్ని ఈ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వారియర్ నిష్క్రమణ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పేర్కొన్నారు.

గత ఎన్నికలలో రెండో స్థానంలో బీజేపీ..

2021, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 2021లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన “మెట్రో మ్యాన్” ఇ శ్రీధరన్ కేవలం 3,859 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓడిపోయారు.

పోలింగ్ తేదీని మార్చిన ఈసీ..

కల్పాతి రథోత్సవం ఉత్సవం కారణంగా నవంబర్ 13 జరగాల్సిన పాలక్కాడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ తేదీని నవంబర్ 20వ తేదీకి ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ వడకర నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Read More
Next Story