ఎట్టకేలకు వల్లభనేని బాలశౌరి ఛాన్స్ కొట్టేశారు!
వారం రోజులఉత్కంఠకు తెర పడింది. మచిలీపట్నం పార్లమెంటరీ సీటు వల్లభనేనికి దక్కుతుందా లేదా అనే దానికి తెర దించడానికి పవన్ కల్యాణ్ వారం రోజుల సమయం ఎందుకుతీసుకున్నారు
మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనేక మలుపులు తిరిగిన జనసేన సీటు చిట్టచివరికి ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరికే దక్కింది. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ రెండు లోక్‌సభ స్థానాలు, 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు మచిలీపట్నం అభ్యర్థిని ప్రకటించారు.
1968 సెప్టెంబర్ 18న జన్మించిన వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గెలిచిన బాలశౌరి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఓ దశలో ఆయనకు టికెట్ ఉంటుందా ఉండదా అనే ఉత్కంఠ కొనసాగింది. గతంలో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రస్తుత వైసీపీ నేత ఆనాటి టీడీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై సుమారు 80 వేల మెజారిటీతో గెలిచారు. క్రిస్టియానిటీ తీసుకున్న కాపు సామాజిక వర్గ అభ్యర్థి వల్లభనేని. సినీనిర్మాతగా ఉన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన లేతమనసులు సినిమాను కూడా నిర్మించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మోర్జంపాడు గ్రామానికి చెందిన ఈయన వ్యాపారవేత్త. 55 ఏళ్ల వయసున్న బాలశౌరి భార్య భానుమతి. వారికి ఇద్దరు పిల్లలు అనుదీప్, అరుణ్. బాలశౌరి తల్లిదండ్రులు జోజయ్య నాయుడు, తమసమ్మ.
2024 మే 13న జరిగే ఎన్నికల్లో ఆయన మరోసారి మచిలీపట్నం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Next Story