మహారాష్ట్ర: బిట్‌కాయిన్ బీజేపీ ఆరోపణలపై సుప్రియా, పటోలే ఫైర్..
x

మహారాష్ట్ర: బిట్‌కాయిన్ బీజేపీ ఆరోపణలపై సుప్రియా, పటోలే ఫైర్..

‘‘ఆ వాయిస్ నోట్స్‌లోని గొంతు సుప్రియదేనని గట్టిగా చెప్పగలను. దీనిపై విచారణ కూడా జరిపిస్తాం.’’ - మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్


మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరత్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలేపై ‘బిట్‌కాయిన్ కుంభకోణం’ ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు సుప్రియా, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. పటోలే, సుప్రియా మధ్య జరిగినట్లుగా చెబుతున్న సంభాషణ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

‘కుట్రలో భాగం’

‘బిట్‌కాయిన్ కుంభకోణం’ ఆరోపణలను సుప్రియా కొట్టిపడేశారు. కొంతమంది కావాలని చేసిన పని అని చెప్పారు. బుధవారం ఆమె పూణె జిల్లా బారామతిలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత విలేఖరులతో మాట్లాడారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం దురదృష్టకరమన్నారు.

ప్రచారంలో ఉన్న వాయిస్‌ నోట్స్‌, సందేశాలన్నీ నకిలీవని, అది తన వాయిస్‌ కాదని స్పష్టం చేశారు. ఆ వాయిస్ వెనుక సూత్రధారి ఎవరో పోలీసులే కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ECI, సైబర్ క్రైమ్ విభాగానికి కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు.

భగ్గుమన్న నానా..

ఆరోపణలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని మండిపడ్డారు. తనకు బిట్‌కాయిన్‌లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. భండారా జిల్లాలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న క్లిప్‌లోని వాయిస్ నాది కాదు. (ప్రధాని) నరేంద్ర మోదీ కూడా నా వాయిస్‌ని గుర్తిస్తారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ నేత సుధాన్షు త్రివేది తదితరులపై ఫిర్యాదు చేశాం. పరువు నష్టం దావా కూడా వేస్తా.’’ అని కౌంటర్ ఇచ్చారు.

వాటిని పట్టించుకోనక్కర్లేదు..

ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కూడా తన కూతురు సులే, కాంగ్రెస్ నేత పటోలేపై బీజేపీ చేసిన ఆరోపణలను కొట్టిపడేశారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఆ గొంతు మా సోదరిదే..

కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాత్రం ఆ గొంతు తన సోదరిదేనని చెబుతున్నారు. ‘‘ఆ వాయిస్ నోట్స్‌లోని స్వరాలు నిజంగా సుప్రియ, పటోలే అని గట్టిగా చెప్పగలను. దీనిపై విచారణ కూడా జరిపిస్తాం.’’ అని పేర్కొన్నారు.

2018లో సుప్రియా సూలే, పటోలే బిట్‌కాయిన్‌ల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ డబ్బును మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వాడారని మాజీ IAS అధికారి రవీంద్ర పాటిల్ ఆరోపించారు.

Read More
Next Story