మంగేష్‌ పాండిల్కర్‌పై కేసు ఏమిటి?
x

మంగేష్‌ పాండిల్కర్‌పై కేసు ఏమిటి?

ముంబై నార్త్‌వెస్ట్‌ ఎంపీ రవీంద్ర వైకర్‌ బావమరిది మంగేష్‌ పాండిల్కర్‌పై కేసు ఎందుకు నమోదు చేశారు? ఈవీఎంలతో ఈయనకు లింకేంటి?


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4న కౌంటింగ్‌ కేంద్రంలో మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించారనే ఆరోపణలతో ముంబై నార్త్‌వెస్ట్‌ ఎంపీ రవీంద్ర వైకర్‌ బావమరిది మంగేష్‌ పాండిల్కర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో కౌంటింగ్ కేంద్రం లోపల ఎంపీ బంధువు మొబైల్ ఫోన్‌ను ఉపయోగించినట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ని అన్‌లాక్ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని జనరేట్ చేసే ఫోన్‌ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ముంబై నార్త్ వెస్ట్ సీటులో శివసేన (యుబిటి)కి చెందిన అమోల్ గజానన్ కీర్తికర్‌పై శివసేన (షిండే వర్గం) ఎంపి వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితం వివాదానికి దారితీసింది. ఈ ఫలితాన్ని తన పార్టీ సవాల్ చేస్తున్నట్లు సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.

ఈసీ ఉద్యోగిపై కూడా కేసు..

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ స్థానం నుంచి పోటీ చేసిన పలువురు అభ్యర్థుల నుంచి పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి. పాండిల్కర్‌కు మొబైల్ ఫోన్‌ను అందజేసినందుకు ఎన్నికల కమిషన్ ఉద్యోగిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి అవసరమైన ఓటీపీని జనరేట్ చేసే ఫోన్ పోల్ ఆఫీసర్ దినేష్ గురవ్ వద్ద ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం.. ఆయన మాత్రమే ఫోన్ ఉపయోగించాలి. మరెవరూ ఉపయోగించకూడదు.

పాండిల్కర్‌తో పాటు ఫోన్‌ను ఉపయోగించిన ఎన్నికల సంఘం అధికారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముంబై నార్త్ వెస్ట్ సీటులో రెండు సేన వర్గాల అభ్యర్థులు తీవ్ర పోటీలో ఉన్న సమయంలో పాండిల్కర్ ఉదయం నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఫోన్‌ను ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పండిల్కర్ ఫోన్ నుంచి కాల్స్ చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వారు ఎన్నికల సంఘం ఇచ్చిన సిసిటివిని కూడా పరిశీలిస్తారు.

ఓటీపీని జనరేట్ చేసే ఫోన్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయి. ఎన్ని ఓటీపీలు వచ్చాయి అనే విషయాలను పోలీసులు విచారించనున్నారు.

టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ EVMల గురించి ఆందోళనలు చేయడంతో ఈ వివాదం ముదిరింది. ఈవీఎంలను మానవులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేసే అవకాశం ఉన్నందున వాటిని తొలగించాలని ఆయన సూచించారు.

ఈవీఎంలను 'బ్లాక్‌బాక్స్‌'గా పేర్కొన్న రాహుల్‌..

ఇదిలావుండగా.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం మాట్లాడుతూ భారతదేశంలో ఈవీఎంలు "బ్లాక్ బాక్స్" అని, వీటిని ఎవరూ పరిశీలించడానికి అనుమతించరు. భారతదేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆందోళనలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

Read More
Next Story