నేడు ఎన్డీఏ కీలక సమావేశం
నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న ఎన్డీఏ సమావేశం కీలకంగా మారింది.
బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) జూన్ 7న (శుక్రవారం) పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కొత్తగా ఎన్నికైన ఎంపీల సమావేశాన్ని నిర్వహించనుంది.
ఈ సమావేశంతో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం జూన్ 9న (ఆదివారం) జరిగే అవకాశం ఉంది. అయితే ఈ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారమే న్యూఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు అక్కడే జరిగే ఎన్డీఏ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా చంద్రబాబు హాజరవుతారని పార్టీ వర్గాల సమాచారం.
ఎన్‌డిఎ నాయకుడిగా మోడీని ఎన్నుకున్న తర్వాత, కూటమికి చెందిన సీనియర్ నాయకులు టిడిపి చంద్రబాబు నాయుడు, జెడియూ నితీష్ కుమార్‌తో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలుస్తారు. తనకు మద్దతిచ్చే పార్లమెంటేరియన్ల జాబితాను ఆమెకు అందజేసే అవకాశం ఉంది.
NDAకి 293 మంది ఎంపీలు ఉన్నారు, 543 మంది సభ్యులున్న లోక్‌సభలో మెజారిటీ మార్కు 272 కంటే ఎక్కువ.
అంతకుముందు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుపై అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో సహా సీనియర్ బిజెపి నాయకులు గురువారం విస్తృతంగా చర్చించారు. కాగా “కేబినెట్ బెర్త్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మా పార్టీ అధినేత నితీష్ కుమార్ జీ నిర్ణయిస్తారు. ఆ పదవులు గౌరవప్రదంగా ఉండాలి” అని బీహార్ గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు.
సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న మోదీ బుధవారం అధికార కూటమి సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహించారు. వారు తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుకు, దేశ సర్వతోముఖాభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సమావేశంలో తీర్మానం చేశారు.