వన్ నేషన్, వన్ ఎలక్షన్కు లైన్ క్లియర్
x

'వన్ నేషన్, వన్ ఎలక్షన్'కు లైన్ క్లియర్

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 'ఒకే దేశం, ఒకే ఎన్నికల' కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.


పట్టణ, పంచాయతీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 'ఒకే దేశం, ఒకే ఎన్నికల' కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? అన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏకకాల ఎన్నికలను అమలు చేయడానికి ఇంకా టైమ్‌లైన్ నిర్ణయించలేదని కేంద్ర I&B మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.

"ఈ తరహా ఎన్నికల నిర్వహణపై దేశవ్యాప్త సంప్రదింపులు జరుగుతాయి. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేసిన తర్వాత తేదీ నిర్ణయిస్తారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను మొదటి దశలో, 100 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని వైష్ణవ్ చెప్పారు.

ఆచరణాత్మకం కాదు

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏకకాల ఎన్నికలు ఆచరణాత్మకం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో "ఒక దేశం, ఒకే ఎన్నికలు" గురించి ప్రస్తావించారు. తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ధన వ్యయం బాగా పెరిగిపోతుందని చెప్పారు. "ఒక దేశం, ఒకే ఎన్నికలు" ప్రాథమిక ఆలోచన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం. ప్రస్తుతం, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల రద్దు లేదా ఇతర అంశాల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌లు మారుతూ ఉంటాయి. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఈ ఆలోచనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఆచరణాత్మకం కాదని పేర్కొంది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించే వారు తమదైన వాదనలతో ముందుకు వచ్చారు.

Read More
Next Story