వారణాసికి ప్రధాని మోదీ.. అక్కడ ఏం చేస్తారంటే..
x

వారణాసికి ప్రధాని మోదీ.. అక్కడ ఏం చేస్తారంటే..

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా మోదీ తన నియోజకవర్గం వారణాసిలో పర్యటించబోతున్నారు. అయితే ఆయన అక్కడ ఏం చేయబోతున్నారు తెలుసుకుందాం..


ప్రధాని మోదీ జూన్ 18న వారణాసిని సందర్శించనున్నారు. వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. అక్కడ 17వ విడత పీఎం-కిసాన్ పథకం నిధులు విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.20వేల కోట్లు చేరనున్నాయి.

సర్టిఫికెట్ల పంపిణీ..

వ్యవసాయంలో తోటి రైతులకు సాయంగా పనిచేయడానికి శిక్షణ పొందిన 'కృషి సఖి' సభ్యులకు మోదీ సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.

వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం..

మోదీ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీఠ వేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. "వ్యవసాయానికి మోదీ ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రైతుల ప్రయోజనాల కోసం ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ 17వ విడత విడుదలకు సంబంధించిన ‘‘కిసాన్ పథకం" ఫైల్‌పై తొలి సంతకం చేశారు.’’ అని చౌహాన్ తెలిపారు.

2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6 వేలు జమ అవుతుందన్నారు. పథకం ప్రారంభించినప్పటి నుండి దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్రం రూ.3.04 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిందని గుర్తు చేశారు.

వారణాసిలో జరిగే కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వివిధ రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

కృషి సఖీ పథకం గురించి క్లుప్తంగా..

రైతులకు సాయ పడుతూ అదనపు ఆదాయం ఆర్జించడం కోసం SHG మహిళలకు పారా-ఎక్స్‌టెన్షన్ అగ్రికల్చర్ వర్కర్లుగా శిక్షణ ఇచ్చారు. వారిని కృషి సఖీగా పిలుస్తారు. ఇప్పటివరకు గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ - ఈ 12 రాష్ట్రాల్లోని మహిళలు ఈ శిక్షణ పొందారు.

రైతుల సంక్షేమం వ్యవసాయ సమగ్రాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేంద్రం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Read More
Next Story