‘వయనాడ్ వాసులకు ప్రియాంక ఓ అతిథి మాత్రమే’
వయనాడ్ స్థానానికి యూడీఎఫ్ నుంచి ప్రియాంక, అధికార ఎల్‌డిఎఫ్ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ నుంచి నవ్య హరిదాస్ ఎన్నికల బరిలో ఉన్నారు.
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నికకు వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. యూడీఎఫ్ నుంచి ప్రియాంక గాంధీ, అధికార ఎల్‌డిఎఫ్ నుంచి సత్యన్ మొకేరి, ఇక బీజేపీ నుంచి నవ్య హరిదాస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మూడు (మణంతవాడి, సుల్తాన్ బతేరి, కాల్పెట్ట) వయనాడ్ జిల్లాలో, మరో మూడు (ఎరనాడ్, నీలంబూర్, వండూర్) మలప్పురం జిల్లాలో, మరో అసెంబ్లీ నియోజకవర్గం తిరువాంబాడి కొజికోడ్ జిల్లాలో ఉంటుంది. ప్రియాంక మంగళవారం మలప్పురం, కొజికోడ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగియగానే ఆమె ఢిల్లీకి తిరిగి వెళ్లిపోవడాన్ని ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరి ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ప్రియాంక నియోజకవర్గాన్ని విడిచిపెట్టారని, ఒక వేళ గెలిచినా ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రచారం మొదలుపెట్టారు.
తన సోదరుడు రాహుల్ గాంధీలాగే ప్రియాంక కూడా ఇక్కడికి అతిథిగా వచ్చి వెళ్తుంటారని ఆరోపించారు. పోయినసారి రాహుల్ గాంధీని ఎన్నుకున్న చాలామంది ఓటర్లు గడిచిన ఐదేళ్లలో ఆయన మోహం కూడా చూడలేదని విమర్శించారు. రెండోసారి ఎన్నికైన మరుసటి రోజే వాయనాడ్‌ను విడిచిపెట్టారని ఆరోపించారు. ‘‘నామినేషన్ దాఖలు చేసిన రోజే నియోజకవర్గం నుంచి వెళ్లిపోయారంటే.. ప్రియాంక కూడా ఏ సమయంలోనైనా నియోజకవర్గాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఓటర్లు అర్థంచేసుకోవాలని కోరారు. కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా నష్టపోయిన వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ, ప్రియాంక ఏం చేశారని ప్రశ్నించారు.
ఇక బీజేపీ తరపున కోజికోడ్ కార్పొరేషన్‌కు రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన నవ్య హరిదాస్ ఎన్నికల బరిలో ఉన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఆయన ఒక స్థానం నుంచి మాత్రమే పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండడంతో వయనాడ్‌కు ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది.