బీజేపీ వదంతులకు చెక్ ..సెల్జా ప్రచారం చేస్తారన్న కాంగ్రెస్
పార్టీ టిక్కెట్ల కేటాయింపులో మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుదాకు పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సెల్జా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
బీజేపీ తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ చెక్ పెట్టింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ సెల్జాను కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టిందన్న వార్తలు రావడంతో.. పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ఆమె ప్రచారంలో పాల్గొంటుందని క్లారిటీ ఇచ్చారు. హర్యానాలోని నర్వానాలో సెల్జా ప్రచారం చేస్తారని తెలిపారు. సెప్టెంబరు 26న నర్వానాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్టీ టిక్కెట్ల కేటాయింపులో మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుదాకు పార్టీ అధిష్టానం అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సెల్జా గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
గెలుపుపై ధీమా..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని సుర్జేవాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నర్వానాలో కాంగ్రెస్ అభ్యర్థి సత్బీర్ డబ్లెయిన్ కోసం నేను 22 బహిరంగ సభలలో ప్రసంగిస్తానని చెబుతూనే.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని పేర్కొన్నారు. సుర్జేవాలా కుమారుడు ఆదిత్య కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గతంలో రణ్‌దీప్ సూర్జేవాలా ప్రాతినిధ్యం వహించిన కైతాల్ నుంచి ఆయనను బరిలోకి దింపారు.
సెల్జాను బీజేపీలో ఆహ్వానించిన ఖట్టర్..
కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సెల్జాను బిజెపిలో రావాలని ఆహ్వానించారు. దాంతో కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడింది.
హుడా విధేయులే ఎక్కువ..
17 రిజర్వ్ (SC) స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా విధేయులు కూడా ఉన్నారు. హర్యానా ఎన్నికల మేనిఫెస్టోను న్యూఢిల్లీలో కాంగ్రెస్ విడుదల చేసినప్పుడు సెల్జా గైర్హాజరయ్యారు. దాంతో ఆమె పార్టీకి దూరమయ్యారన్న వార్తలు వచ్చాయి. దళితుల ఓట్లను ఆకర్పించేందుకు సెల్జాను ప్రచారంలోకి దించినట్లు సమాచారం. బీజేపీ పుకార్లను కొట్టిపడేస్తూ.. హర్యానా కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం గత వారం ప్రకటించారు.