ఎన్జీరంగా పార్టీని గెలిపించిన ’ఓటుపాట’!
డబ్బుకి ఓటు అమ్ముకోవద్దని, ఒక్కపూట విందు కోసం ఓటును పాడు చేసుకోవద్దని, రైతుల తరఫున పోరాడే వారికే ఓటు వేయాలని సాగే పాట అది
1932లో రైతు నాయకుడు గోగినేని రంగనాయకులు ఎలియాస్ ఆచార్య ఎన్జీ రంగా జైలు నుంచి విడుదలయ్యారు. గోదావరి, గుంటూరు, నెల్లూరు మొదలు అటు విశాఖపట్నం వరకు రైతులంతా కేరింతలు కొట్టారు. జమీందారులే అటవీ ప్రాంతంపై హక్కుదారులన్న విశ్వాసాన్ని పారదోలడానికి ఆచార్య ఎన్జీ రంగా లాంటి వాళ్లు నడిపిన ఉద్యమమే ఈ రైతులు కేరింతలు కొట్టడానికి ఓ కారణం. కృషీకార్ లోక్‌పార్టీని ప్రారంభించి ఆంధ్రదేశమంతటా తిరిగారు. ఆయన చేపట్టిన ఉద్యమానికి నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట రామానాయుడు పెట్టిన జమీన్ రైతు పత్రిక పూర్తి మద్దతు పలికింది. ఆ తర్వాత తాలూకా, జిల్లా బోర్డులకు ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టుకోమని చెప్పింది. దాంతో కృషీకార్ లోక్‌పార్టీ నాయకుడిగా ఎన్జీ రంగా పోటీకి తమ అభ్యర్థుల్ని నిలిపి పలు చోట్ల గెలిచారు. జమీందారుల అధికారం, డబ్బు అక్కడ పని చేయలేదు. పలు ప్రాంతాల్లో రంగా పార్టీకి తాలుగా బోర్డులు దక్కాయి. రైతులే అధ్యక్ష ఉపాధ్యక్షులు అయ్యారు. ఆ సందర్భంలో పాడిన పాట కృషీకార్ లోక్‌పార్టీ అభ్యర్థులకు ఓట్లు పడేటట్టు చేసింది. ఆ పాటనే తిరిగి 1951–1952 సాధారణ ఎన్నికల్లో కృషీకార్ లోక్‌పార్టీ అభ్యర్థులు తమ ప్రచార గీతంగా వాడుకున్నారు.
ఎంతో అర్థవంతంగా సాగే ఆ పాట ఇప్పటికీ చెల్లుబాటే. డబ్బు దస్కానికి ఓటు అమ్ముకోవద్దని, ఒక్కపూట విందు కోసం ఓటును పాడు చేసుకోవద్దని, రైతుల తరఫున పోరాడే వారికే ఓటు వేయాలని సాగే పాట అది.