రాజస్థాన్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
x

రాజస్థాన్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

రాజస్థాన్‌లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 25. నవంబర్ 13న పోలింగ్, 23న ఫలితాలు వెల్లడిస్తారు.


రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను బుధవారం అర్థరాత్రి ఏఐసీసీ విడుదల చేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బ్రిజేంద్ర ఓలా కుమారుడు అమిత్ ఓలాను ఝుంజును నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. కాగా తండ్రి జుబేర్ ఖాన్ మరణంతో ఖాళీ అయిన రామ్‌గఢ్ స్థానం నుంచి ఆర్యన్ ఖాన్‌ పోటీ చేస్తున్నారు. దౌసా నుంచి దీనదయాళ్ బైర్వాను ప్రకటించింది. కస్తూర్ చంద్ మీనా, రతన్ చౌదరి, మహేష్ రోట్, రేష్మా మీనా వరుసగా డియోలీ-యునియారా, ఖిన్వ్‌సర్, చోరాసి, సలుంబర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఉప ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది.

కాగా బీజేపీ ఏడు స్థానాలకుగాను ఆరు స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. చోరాసి స్థానానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ఉపఎన్నికలు ఎందుకు?

సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన జుబేర్ ఖాన్ (రామ్‌ఘర్), బీజేపీకి చెందిన అమృతలాల్ మీనా (సాలుంబర్) మరణంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన ఐదు నియోజక వర్గాల ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలవడంతో ఆ స్థానాలు కూడా ఖాళీ అయ్యాయి.

ఎంపీలయిన ఎమ్మెల్యేలు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బ్రిజేంద్ర ఓలా (ఝుంజును), హరీష్ చంద్ర మీనా (డియోలీ-ఉనియారా), మురారి లాల్ మీనా (దసౌ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే హనుమాన్ బేనివాల్ (ఖిన్వసార్), భరత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ) ఎమ్మెల్యే రాజ్‌కుమార్ రోట్ (చోరాసి) ఎంపీలుగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం 200 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 114, కాంగ్రెస్‌కు 65, భారత్ ఆదివాసీ పార్టీకి ముగ్గురు, బీఎస్పీకి ఇద్దరు, ఆర్‌ఎల్‌డీకి ఒకరు, ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 25. నవంబర్ 13న పోలింగ్, నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తున్నారు.

Read More
Next Story