ఖర్గే వైరల్ వీడియోపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం..
వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్ వేసే సమయంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే గది బయట ఉన్నారా? వైరల్ వీడియోపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎక్స్ వేదికగా ఎలా స్పందిస్తున్నారు?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. అయితే నామినేషన్ గది వెలుపల ఖర్గే నిలుబడి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో క్లిప్ చుట్టూ కాంగ్రెస్, బీజేపీ నేతలకు మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది.
ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా లోపలికి వెళ్లేందుకు గది తలుపు వద్ద వేచి ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
దళితుడు కాబట్టే..
ఖర్గే దళితుడు కాబట్టే అయనను అంటరాని వ్యక్తిగా చూస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎక్స్‌లో పోస్టు చేశారు."ఈ రోజు వయనాడ్‌లో సీనియర్ పార్లమెంటేరియన్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే పట్ల చూపిన అగౌరవం చాలా నిరుత్సాహపరుస్తుంది. దళితులను కాంగ్రెస్ అంటరాని, మూడో తరగతి పౌరులుగా చూస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిని రబ్బరు స్టాంప్‌గా భావించి.. గాంధీ కుటుంబం ఖర్గేని అవమానిస్తోంది” అంటూ ట్వీట్ చేశారు.
వయనాడ్ ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో మరి..
ఇదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక నామినేషన్ వేసే సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? అని ఖర్గేను ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడితో ఇలా ప్రవర్తిస్తే.. వయనాడ్ ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో ఒక్కసారి ఊహించుకోండి.’’ అని పోస్టు పెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం స్థానం నుంచి పోటీచేసి ఎంపీ శశిథరూర్ చేతిలో ఓడిపోయారు రాజీవ్ చంద్రశేఖర్.
ప్రియాంక అఫిడవిట్ ఆస్తులు చాలా తక్కువ..
ఖర్గే దళితుడు కాబట్టే గాంధీలు బయట పెట్టారా? అని అమిత్ మాలవీయ కూడా ప్రశ్నించారు. తన పోల్ అఫిడవిట్‌లో ప్రియాంక ప్రకటించిన ఆస్తులు.. ఆమె, ఆమె భర్త రాబర్ట్ వాద్రా వద్ద ఉన్న ఆస్తుల కంటే చాలా తక్కువ అని బీజేపీ అధికార ప్రతినిధి భాటియా పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎదురుదాడి..
ఖర్గే వైరల్ వీడియోపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ తప్పుడు ప్రచారంపై విరుచుకుపడింది. ప్రియాంక నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు ఆమె పక్కన ఖర్చే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూర్చున్న ఫొటోలను కాంగ్రెస్ నేతలు షేర్ చేశారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
సుప్రియా ష్రినేట్ కౌంటర్..
You cheap liar. I wish you knew a thing or two about elections and how many people at any given time are allowed inside besides the candidate
— Supriya Shrinate (@SupriyaShrinate) October 23, 2024
Kharge ji, Sonia ji and Rahul Ji waited for some people to exit before they came in
Now see these pics and shut up https://t.co/GMcWfl5JgO pic.twitter.com/SxoE3Xbks4
మాల్వియా పోస్ట్‌కి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ స్పందించారు. వాస్తవాలను తెలుసుకుని స్పందించాలని మందలించారు. లోపల ఉన్న వారు నామినేషన్ గది నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గదిలోకి వెళ్లే ముందు తీసిన వీడియో అని కౌంటర్ ఇచ్చారు. గదిలోపల అందరూ కూర్చున్న ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు.