రేషన్ కోటా, పింఛన్ పెంచుతాం : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
x

రేషన్ కోటా, పింఛన్ పెంచుతాం : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

జార్ఖండ్ రాష్ట్రంలో హామీల వర్షం కురుస్తోంది. అటు బీజేపీ, ఇటు అధికార జేఎంఎం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాయి.


జార్ఖండ్ రాష్ట్రంలో హామీల వర్షం కురుస్తోంది. అటు బీజేపీ, ఇటు అధికార జేఎంఎం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి అధికారంలోకి వస్తే రేషన్ బియ్యం కోటా పెంచుతామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు. ప్రస్తుతం ఒక మనిషికి 5 కిలోలు ఇస్తుండగా తమను గెలిపిస్తే అదనంగా 2 కిలోలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ హయాంలో 11 లక్షల రేషన్ కార్డులు, 3 లక్షల పింఛన్లు రద్దయ్యాయని ఫలితంగా అనేక మంది గిరిజనులు, దళితులు ఆకలితో మరణించారని ఆరోపించారు. అర్హులందరికీ మళ్లీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. మైయాన్ సమ్మాన్ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పండ్లు, గుడ్లు అందజేస్తామన్నారు.

"బీజేపీ పాలనలో ఆకలి చావులు సర్వసాధారణం అయితే, మీ అబువా (మా) ప్రభుత్వంలో ప్రతి జార్ఖండీ రేషన్, పింఛన్, పౌష్టికాహారం పొందుతున్నందుకు నేను గర్వపడుతున్నాను" అని సోరెన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘అధికారంలోకి వస్తే అమల్లోకి యుసీసీ’

ఇక బీజేపీ మేనిఫెస్టోను ఆదివారం రాంచీలో ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులకు మినహాయింపు ఇస్తూ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసీసీ)ని ప్రవేశపెడతామని ప్రకటించారు. సర్నా మతపరమైన కోడ్ సమస్యపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిశ్రమలు, గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజల పునరావాసం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సహా 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది.

Read More
Next Story