ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ పార్టీలకు ఆశించిన బెర్త్‪లు దక్కేనా?
x

ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ పార్టీలకు ఆశించిన బెర్త్‪లు దక్కేనా?

కేంద్రంలో క్యాబినెట్ బెర్త్‌ల రగడ మొదలైంది. ఎన్డీఏకు మహారాష్ట్ర నుంచి మద్దతిచ్చిన ఏక్‌నాథ్ షిండే (శివసేన), అజిత్ పవార్ (ఎన్‌సిపి) బెర్త్‌ల కోసం పోటీపడుతున్నారు.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి ఈ లోక్‌సభ ఎన్నికలలో ఆశించిన స్థానాలు దక్కించుకోలేకపోయాయి. దాంతో ఆ రెండు పార్టీలకు ఆశించిన మేర క్యాబినెట్ బెర్త్‌లు లభించకపోవడంతో మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూస్తామని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు.

ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మొత్తం 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీజేపీకి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరికొంత మంది కింగ్‌మేకర్‌లుగా మారిన ఎన్‌ చంద్రబాబు నాయుడు (టీడీపీ), నితీష్‌ కుమార్‌ (జేడీయూ)తో పాటు మిత్రపక్షాల ఎంపీలు ఉన్నారు.

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు‌గాను ఎన్‌డీఏ కేవలం 17 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఈ రాష్ట్రం నుంచి ఈ సారి కేవలం ఐదుగురికి మాత్రమే క్యాబినెట్ బెర్తులు దక్కాయి.

2019 ఎన్నికల్లో 41 సీట్లు గెలుపొందగా..ఇందులో బీజేపీ 23, అవిభక్త శివసేనకు 18 సీట్లు వచ్చాయి.

నలుగురు బీజేపీకి ఎంపీలకు మంత్రి పదవులు..

మహారాష్ట్రకు చెందిన ఐదుగురు మంత్రుల్లో నలుగురు బీజేపీకి చెందిన వారు. ఐదో వ్యక్తి షిండే సేనకు చెందిన ప్రతాప్‌రావు జాదవ్. ఈయన సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అజిత్ పవార్ ఎన్‌సిపికి చెందిన ప్రఫుల్ పటేల్‌కు ఇలాంటి పదవి ఆఫర్ చేశారు. కానీ దాన్నిఆయన తిరస్కరించారు.

వెయిట్ చేస్తున్నాం..

గతంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేసిన పటేల్‌కు జూనియర్‌ మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని ఎన్‌సిపి వాదించింది. అజిత్ పవార్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. క్యాబినెట్ బెర్త్ కోసం వేచి చేస్తున్నామన్నారు.

“మాకు ఒక లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీ (సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్) ఉన్నారు. ఇక ముందు మరో ఇద్దరు ఎంపీలు రాజ్యసభకు వెళ్తారు. అప్పుడు మా వాళ్ల సంఖ్య నలుగవుతుంది. అప్పుడు కేబినెట్ బెర్త్ దక్కుతుంది. దాని కోసం వెయిట్ చేస్తున్నాం’’ అని చెప్పారు.

పటేల్ 2011 నుండి 2014 వరకు భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. ఆయన

విలేఖరులతో మాట్లాడుతూ.. "నేను ఇంతకుముందు (కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. ఎన్డీఏ ప్రభుత్వం సహాయ మంత్రి పదవితో సరిపెట్టారు. మా డిమాండ్ చెప్పాం. కొద్ది రోజులు ఆగాలని చెప్పారు.’’ అని పేర్కొన్నారు.

3 బెర్త్‌లు కోరిన షిండే ..

షిండే నేతృత్వంలోని శివసేన వర్గం మొత్తం మూడు పదవులు కోరింది. ఒకటి కేంద్ర మంత్రిగా, మిగతా రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

మంత్రివర్గ విస్తరణపై ఆశలు..

లోక్‌సభలో మూడోసారి గెలుపొందడానికి సహకరించిన 14 మిత్రపక్షాలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే షిండే సేన ఒక్క జూనియర్ మంత్రి పదవిని మాత్రమే పొందగలిగింది. షిండే ప్రస్తుతం ఆఫర్ చేసిన పదవిని అంగీకరించినా.. మంత్రివర్గ విస్తరణలో తమ “వాటా” తమకు దక్కుతుందని ఆశిస్తున్నారు.

మహారాష్ట్రలో మిత్రపక్షాల కోరికలను నెరవేర్చడానికి బీజేపీ ఎలా పనిచేస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం పూర్తి కావడానికి కేవలం తొమ్మిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

బిజెపి తన మహారాష్ట్ర ఎంపిలకు రెండు క్యాబినెట్ బెర్తులు, రెండు సహాయ మంత్రి పదవులను ఇచ్చింది. రాష్ట్రంలో 9 మంది ఎంపీలతో బీజేపీ అతిపెద్ద పార్టీ (ఎన్‌డీఏ సభ్యులు) కాగా, షిండే సేన 6 స్థానాలు గెలుచుకుంది.

ఇక, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి నాలుగుస్థానాల్లో పోటీ చేయగా ఒక్కరు మాత్రమే గెలుపొందారు. ఓడిన మూడింటిలో పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం కూడా ఉంది.

గత వారం ఓట్ల లెక్కింపు అనంతరం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి 272 సీట్ల మెజారిటీ మార్కును అధిగమించింది. బిజెపికి కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే దాని ఎన్‌డిఎ మిత్రపక్షాల నుండి 53 సీట్లు వచ్చాయి.

ఈ 53 సీట్లలో చంద్రబాబు నాయుడుకి చెందిన టీడీపీ, నితీష్ కుమార్‌కి చెందిన జేడీయూ 28 సీట్లు ఇచ్చాయి. షిండే సేన, అజిత్ పవార్ NCP కలిపి లోక్‌సభలో కేవలం ఏడుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వారు పాలక కూటమి నుండి వైదొలగిన పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

అందులో ఆశ్చర్యం లేదు: సూలే

మరోవైపు మోడీ 3.0 కేబినెట్‌లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికి చోటు దక్కకపోవడంలో ఆశ్చర్యం లేదని ఎన్‌సిపి (శరద్‌చంద్ర పవార్) ఎంపి సుప్రియా సూలే వ్యాఖ్యానించారు.

తన తండ్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సిపి 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పూణేలో సూలే విలేకరులతో మాట్లాడారు “యుపిఎ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎన్‌సిపి మిత్రపక్షంగా పనిచేసింది. మన్మోహన్‌జీ పవార్ సాహెబ్ పట్ల విశ్వాసం, ప్రేమ కనబరిచారు. ఆ సమయంలో పార్టీకి ఎనిమిది లేదా తొమ్మిది మంది ఎంపీలు మాత్రమే ఉన్నా..ఆయనకు రెండున్నర క్యాబినెట్ బెర్త్‌లు లభించాయి. కాంగ్రెస్ సంఖ్యాబలం గురించి ఆలోచించడం లేదని, ఆ పార్టీని మిత్రపక్షంగా గౌరవిస్తోందని పేర్కొన్నారు.

“మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవంగా చూసుకున్నారు. మేం ఏ ఫార్ములాకు కట్టుబడి లేం. మా సంబంధం పరస్పర గౌరవం, యోగ్యతపై ఆధారపడి ఉంది ”అని సులే చెప్పారు. ఎన్సీపీకి కేబినెట్‌ బెర్త్‌ రాకపోవడంలో ఆశ్చర్యంలేదన్నారు "గత 10 సంవత్సరాలలో వారు (బిజెపి) తమ మిత్రపక్షాలతో ఎలా ప్రవర్తించారో నేను దగ్గరి నుండి గమనించాను" అని సులే పేర్కొన్నారు.

Read More
Next Story