ఈ నలుగురు ఎంపీల వయసు 25 ఏళ్లే...
x

ఈ నలుగురు ఎంపీల వయసు 25 ఏళ్లే...

ఈ లోక్‌సభ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు అతి పిన్న వయసులోనే ఎంపీలయ్యారు. 25 సంవత్సరాల వయసు ఉన్న ఈ నలుగురిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.


ఈ లోక్‌సభ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు అతి పిన్న వయసులోనే ఎంపీలయ్యారు. 25 సంవత్సరాల వయసు ఉన్న ఈ నలుగురిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిలో పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి యుపిలో విజయం సాధించారు. బీహార్ నుంచి ఎల్‌జేపీ టికెట్‌పై శాంభవి చౌదరి గెలుపొందగా, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు చెందిన సంజనా జాతవ్ విజయం సాధించారు.

శాంభవి చౌదరి..

లోక్ జనశక్తి పార్టీ (LJP) నాయకురాలు శాంభవి చౌదరి బీహార్‌లోని సమస్తిపూర్ నుండి లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన సన్నీ హజారీపై 1,87,251 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈమె అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరు. లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో మాస్టర్స్ చేశారు. ఈమె మూడో తరం రాజకీయ నాయకురాలు. ఆమె తండ్రి బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా, కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఆమె తాత మహావీర్ చౌదరి కూడా రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

సంజన జాతవ్..

25 ఏళ్ల సంజనా జాతవ్ రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోలీపై 51,983 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సంజన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అల్వార్‌లోని కతుమార్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే కేవలం 409 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేదీ చేతిలో ఓడిపోయారు. సంజన రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ కప్తాన్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు.

పుష్పేంద్ర సరోజ్..

పుష్పేంద్ర సరోజ్ యుపిలోని కౌశంబి లోక్‌సభ స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) టికెట్‌పై సిట్టింగ్ బిజెపి ఎంపి వినోద్ కుమార్ సోంకర్‌పై 1,03,944 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇతను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రజిత్ సరోజ్ కుమారుడు. ముఖ్యంగా, పుష్పేంద్ర తండ్రి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటును సోంకర్ చేతిలో ఓడిపోయారు. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి అకౌంటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో BSc పూర్తి చేసిన తర్వాత పుష్పేంద్ర రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

ప్రియా సరోజ్..

25 ఏళ్ల ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ స్థానంలో SP టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈమె 35,850 ఓట్ల తేడాతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ భోలానాథ్‌పై విజయం సాధించారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన తూఫానీ సరోజ్ కుమార్తె ప్రియ.

Read More
Next Story