
కన్నడ నాట బీర్, మద్యం డిస్ట్రిలర్ల మధ్య ఆధిపత్య పోరు
పన్ను విధానంలో తేడాలెందుకని ప్రశ్నలు
కర్ణాటకలో కొత్త మద్యం పన్నుల విధానం బ్రూవర్లకు, డిస్టిలర్లకు మధ్య ఆధిపత్య పోరుకు తెరతీసింది. బీర్ అమ్మకాలు దాదాపు 50 శాతం పెరిగినా.. ప్రభుత్వానికి అదనంగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయంలో 82 శాతం వాటా మాత్రం ఇండియన్ మేడ్ లిక్కర్దే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో కొత్త పన్నుల విధానం ఎవరికి ప్రయోజనం చేకూరుస్తోంది? వినియోగదారులపై దాని ప్రభావం ఏమిటి? అన్న అంశాలపై మద్యం పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక ప్రభుత్వం 2026 మే 11న ఆల్కహాల్ ఇన్ బెవరేజ్ (AIB) పేరుతో కొత్త ఎక్సైజ్ విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న పన్నుల నిర్మాణం స్థానంలో మద్యంలో ఉండే ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు విధించే విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ మార్పుల తర్వాత జులై నుంచి సెప్టెంబర్ వరకు బీర్ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49.69 శాతం పెరిగాయి. గత ఏడాది 84.63 లక్షల కేసులుగా ఉన్న అమ్మకాలు ఈసారి 126.68 లక్షల కేసులకు చేరాయి. అదే సమయంలో ఇండియన్ మేడ్ లిక్కర్ అమ్మకాలు మాత్రం 1.52 శాతం మాత్రమే పెరిగి 171.69 లక్షల కేసులకు చేరుకున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ ఈ విధానం సమర్థతను ప్రశ్నించగా, బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దీనికి ప్రగతి శీల పన్నుల నమూనాగా సమర్థించింది.
పెరిగిన బీర్ అమ్మకాలు..
సీఐఏబీసీ ప్రకారం.. కర్ణాటక ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంలో 84.63 లక్షల కేసులుగా ఉన్న బీర్ అమ్మకాలు, జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాదివారీగా 49.69 శాతం పెరిగి 126.68 లక్షల కేసులకు చేరుకున్నాయి. ఐఎంఎల్ అమ్మకాలు కేవలం 1.52 శాతం పెరిగి 169.12 లక్షల కేసుల నుంచి 171.69 లక్షల కేసులకు పడిపోయాయి.
అయితే అమ్మకాల పెరుగుదలతో పోలిస్తే ప్రభుత్వ ఆదాయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇండియన్ మేడ్ లిక్కర్ ద్వారా వచ్చిన ఎక్సైజ్ ఆదాయం 13.36 శాతం పెరిగి 9,033.21 కోట్ల రూపాయలకు చేరింది. దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా 1,064.52 కోట్ల రూపాయలు వచ్చాయి. బీర్ ద్వారా వచ్చిన ఆదాయం 18.52 శాతం పెరిగి 1,463.07 కోట్ల రూపాయలకు చేరగా, అదనపు ఆదాయం 228.57 కోట్ల రూపాయలుగా నమోదైంది.
ఈ రెండు విభాగాల నుంచి ప్రభుత్వానికి వచ్చిన మొత్తం అదనపు ఆదాయం 1,291.94 కోట్ల రూపాయలు. ఇందులో ఇండియన్ మేడ్ లిక్కర్ వాటా 82 శాతం కాగా, బీర్ వాటా కేవలం 18 శాతమే.
పన్నులలో అన్యాయం...
ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ (CIABC) కొత్త పన్నుల విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అమ్మకాల పరిమాణం పెద్దగా పెరగకపోయినా ఇండియన్ మేడ్ లిక్కర్ ద్వారా ఆదాయం గణనీయంగా పెరగడం, అధిక పన్నుల వసూళ్ల వల్లేనని ఆ సంస్థ వాదిస్తోంది. ముఖ్యంగా సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే మద్యం ధరలపై పన్నుల భారం పెరిగితే, భవిష్యత్తులో డిమాండ్ తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది.
అన్ని రకాల మద్యానికి సమతుల్యంగా పన్నులు విధించాలని కోరింది. ‘‘మద్యంపై పన్ను విధించడం లక్ష్యం బాధ్యతాయుతమైన నియంత్రణ అయి ఉండాలి. అంతేకానీ మద్యం పరిశ్రమలోని కొందరిని విజేతలుగా ఎంపిక చేయడం కాదు. మద్యం ధర మరీ చౌకగా మారి, దాని వినియోగాన్ని పెంచేలా ఏ వర్గానికి ప్రయోజనం చేకూరడదు.
అలాగే పన్నులు గానీ లేదా ప్రభుత్వ ప్రకటనలు గానీ మద్య పానీయాన్ని మరొకదానిపై పరోక్షంగా సమర్థించకూడదు. అలాగే పన్నులు గానీ లేదా ప్రభుత్వ ప్రకటనలు గానీ ఒక మద్య పానీయాన్ని మరొకదానిపై పరోక్షంగా సమర్థించకూడదు.
ఒక విశ్వసనీయమైన చట్రం మొత్తం ఇథనాల్ వినియోగం, వాస్తవ వినియోగ పరిణామాలు తాగే తరచుదనం, కొనుగోలు శక్తి, అందుబాటు వినియోగదారుల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోవాలి’’ అని సీఐఏబీసీ డీజీ అనంత్ ఎస్ అయ్యర్ అన్నారు.
మరోవైపు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మాత్రం కర్ణాటక ప్రభుత్వ కొత్త విధానాన్ని సమర్థిస్తోంది. ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్నులు విధించడం వల్ల తక్కువ మద్యం శాతం ఉన్న పానీయాల వైపు వినియోగదారులు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ విధానం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు మద్యం వల్ల కలిగే ఆరోగ్యపరమైన నష్టాలను తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇలాంటి పన్నుల విధానాన్ని సిఫారసు చేసిందని ఆ సంస్థ తెలిపింది.
అయితే బీర్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉందనే కారణంతో దాన్ని ఇతర మద్యపానీయాల కంటే సురక్షితమైనదిగా పరిగణించలేమని CIABC చెబుతోంది. ఉదాహరణకు, ఐదు శాతం ఆల్కహాల్ ఉన్న 255 మిల్లీలీటర్ల బీర్లో ఉండే స్వచ్ఛమైన ఆల్కహాల్ పరిమాణం, 42.8 శాతం ఆల్కహాల్ ఉన్న 30 మిల్లీలీటర్ల స్పిరిట్స్లో ఉండే పరిమాణంతో దాదాపు సమానమని వివరిస్తోంది. ఎంత మద్యం తాగుతున్నారు, ఎంత తరచుగా తాగుతున్నారు అనే అంశాలే కీలకమని వాదిస్తోంది.
ఏఐబీ ఫ్రేమ్ వర్క్ సమర్థించారు..
బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) కర్ణాటక విధానానికి మద్దతు ఇచ్చింది. ఆల్కహాల్ శాతం ఆధారిత పన్ను విధానం, ప్రభుత్వ ఆదాయాలను మద్దతునిస్తూనే, తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రొత్సహిస్తుందని అది వాదించింది.
‘‘ఆల్కహాల్ పన్నుల విధానంలో ఆల్కహాల్ శాతం ఆధారిత పన్ను అత్యుత్తమైనది. దీనిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అనుసరిస్తున్నారు. మద్యం హానికరమైన వాడకాన్ని తగ్గించే సాధనంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సిఫార్సు చేసింది. అయితే రాబడిని గరిష్ట స్థాయికి చేర్చడమనే ఆర్థిక సమతుల్యం చేయడానికి పన్నుల రేటు సరైన స్థాయిలో ఉండాలి. కర్ణాటక ప్రభుత్వం ఆ పనిని చాలా చక్కగా చేసినట్లు కనిపిస్తోంది’’ అని బీఏఐ డీజీ వినోద్ గిరి అన్నారు.
ఇదిలా ఉంటే, కర్ణాటక కొత్త పన్నుల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. మద్యం పన్నుల విధానాల్లో మార్పులు చేయాలనుకుంటున్న రాష్ట్రాలకు ఈ ప్రయోగం ఒక పరిశీలనాంశంగా మారింది.
అయితే బీర్ అమ్మకాలు పెరగడానికి కొత్త పన్నుల విధానమే ఏకైక కారణమని చెప్పడానికి ఇప్పుడున్న గణాంకాలు సరిపోవు. అలాగే మొత్తం మద్యం వినియోగం, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు పెరిగాయా, తగ్గాయా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు. ప్రభుత్వ ఆదాయం, వినియోగదారులపై ధరల భారం, ప్రజారోగ్యం.. ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే కర్ణాటక ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలుగా కనిపిస్తోంది.
Next Story
