
అమెరికా నుంచి భారత్‌కు మరోసారి టారిఫ్ షాక్..
దిగుమతులపై 25 శాతం సుంకాల ప్రతిపాదన!
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి వాణిజ్య ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది.
అయితే అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించే అవకాశం కూడా కల్పించింది. అమెరికా తాజా ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో ఏ రంగంలోనూ అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని స్పష్టం చేసింది.
14 దేశాలపై అమెరికా దృష్టి
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) నవంబర్ 25న ఈ ప్రతిపాదనను ప్రకటించింది. తయారీ రంగంలో అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనే ఆరోపణలతో మొత్తం 14 దేశాలు, ఆర్థిక వ్యవస్థలపై ఈ చర్యలకు సిద్ధమైంది.
ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, బంగ్లాదేశ్, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, సింగపూర్, స్విట్జర్లాండ్ ఉన్నాయి.
అమెరికా చేపట్టిన సెక్షన్ 301 దర్యాప్తులో భాగంగా ఈ ప్రతిపాదనలు వచ్చాయి. ఈ దేశాల పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ రాయితీలు, ఉత్పత్తి విధానాలు అమెరికా తయారీ రంగానికి నష్టం కలిగిస్తున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది.
భారత్‌కు 25 శాతం.. ఒప్పందంతో 17 శాతం
తాజా ప్రతిపాదన ప్రకారం భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే భారత్ అమెరికాతో పరస్పర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఈ రేటును 17 శాతానికి పరిమితం చేయవచ్చని అమెరికా పేర్కొంది.
ప్రతిపాదిత సుంకాల విషయంలో భారత్‌పై విధించనున్న రేటు రెండో అత్యధికం. వియత్నాంపై 35 శాతం సుంకాన్ని ప్రతిపాదించింది. ఒప్పందం కుదిరితే చైనా, వియత్నాంపై 20 శాతం, ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, థాయ్‌లాండ్‌పై 18 శాతం సుంకాలు ఉండే అవకాశం ఉంది.
అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్
అమెరికా ప్రతిపాదనపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పందించింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం జారీ చేసిన నోటీసును పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ దర్యాప్తు ప్రక్రియలో భారత్ నిర్మాణాత్మకంగా సహకరించిందని పేర్కొంది. దేశంలోని ఏ రంగంలోనూ నిర్మాణాత్మకంగా అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని గతంలోనే అమెరికాకు స్పష్టం చేసినట్లు తెలిపింది.
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని గుర్తుచేసింది. వాణిజ్యపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఈ చర్చల పరిధిలోనే పరిష్కరించుకోవాలన్నది భారత్ వైఖరని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
‘‘ఈ దర్యాప్తు అంతటా భారత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించింది. దర్యాప్తు ప్రారంభ నోటీస్ కు ప్రతిస్పందనగా, తదుపరి విచారణలలో భారత్ కు ఏ రంగంలోనూ నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం లేదని వాణిజ్య శాఖ పేర్కొంది’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘‘భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. వాణిజ్య సంబంధిత ఆందోళనలను ఈ చర్చల పరిధిలోనే పరిష్కరించుకోవాలన్నది భారత్ వైఖరి. 2026 ఫిబ్రవరి 2 న ప్రకటించినట్లు 2026, ఫిబ్రవరి 7 న జారీ చేసిన ఉమ్మడి ప్రకటనకు అనుగుణంగా, భారత్ - అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
జనవరిలో తదుపరి ప్రక్రియ
అమెరికా ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణకు కూడా సిద్ధమైంది. 2027 జనవరి 5వ తేదీలోగా రాతపూర్వక అభిప్రాయాలు సమర్పించాలని USTR సూచించింది. జనవరి 25న బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా సుంకాల ప్రతిపాదన రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో మరో కీలక పరిణామంగా మారింది. ఈ ప్రతిపాదనలు తుది నిర్ణయానికి చేరుకునేలోగా ఇరు దేశాల మధ్య చర్చలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story
